బ్యాంకింగ్‌లో మదుపు

నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ పోలిన తరహాలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే కొత్త పథకాన్ని ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 24. కనీస పెట్టుబడి రూ.5,000.

Updated : 11 Feb 2022 05:51 IST

నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ పోలిన తరహాలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే కొత్త పథకాన్ని ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 24. కనీస పెట్టుబడి రూ.5,000.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టటం అంటే..., దేశీయంగా బ్యాంకింగ్‌ రంగంలో ఎంతో అధిక లిక్విడిటీ ఉన్న అతిపెద్ద బ్యాంకుల షేర్లను కొనుగోలు చేసినట్లే. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్‌,  యాక్సిస్‌, కోటక్‌, ఇండస్‌ఇండ్‌ వంటి ప్రైవేటు బ్యాంకులూ, ఎస్‌బీఐ మరికొన్ని ఇతర బ్యాంకులున్నాయి. పదేళ్లుగా దేశీయ బ్యాంకుల వ్యాపార పరిమాణం, మార్కెట్‌ కేపిటలైజేషన్‌ ఎంతగానో పెరిగిన విషయం తెలిసిందే. నిఫ్టీ బ్యాంక్‌ టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌) గత పదేళ్లలో ఆరేళ్ల పాటు నిఫ్టీ 50 కంటే అధిక లాభాలు ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పుడున్న దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల నుంచి త్వరలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మనదేశం సమీప భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు బాగా విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని విశ్వసించే మదుపరులు బ్యాంకింగ్‌ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు. నేరుగా కాకుండా మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చిన ఈ కొత్త పథకం పరిశీలించదగినదే.


అమెరికా కంపెనీలపై ఆసక్తి ఉందా?
 

ఇటీవల కాలంలో పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు విదేశీ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు వీలుకల్పించే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) పథకాలను ఆవిష్కరించాయి. అదే కోవలో కొత్తగా మ్యూచువల్‌ ఫండ్‌ సేవల రంగంలోకి అడుగుపెట్టిన నవీ మ్యూచువల్‌ ఫండ్‌, ‘నవీ యూఎస్‌ టోటల్‌ స్టాక్‌ మార్కెట్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 18. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500.

దేశీయ మదుపరుల నుంచి సమీకరించిన పెట్టుబడులను ‘వ్యాన్‌గార్డ్‌ టోటల్‌ స్టాక్‌మార్కెట్‌ ఈటీఎఫ్‌’లలో పెట్టుబడిగా పెడతారు. ఈ ఫండ్‌ యూఎస్‌లోని అతిపెద్ద ‘ప్యాసివ్‌లీ మేనేజ్డ్‌’ ఈటీఎఫ్‌ పథకం. వ్యాన్‌గార్డ్‌ టోటల్‌ స్టాక్‌ మార్కెట్‌ ఈటీఎఫ్‌, సీఆర్‌ఎస్‌పీ యూఎస్‌ టోటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. అంటే దాదాపు 4,000 కు పైగా యూఎస్‌ స్టాక్‌మార్కెట్లో నమోదైన షేర్లలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందన్నమాట. చిన్న, పెద్ద కంపెనీలన్నింటిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నప్పటికీ, అధిక కేటాయింపులు మాత్రం యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, టెస్లా... తదితర అగ్రశ్రేణి కంపెనీలకే ఉండటం గమనార్హం. యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు గత ఏడాది, అయిదేళ్లు, పదేళ్ల కాలంలో... వరుసగా, 28.15 శాతం, 20.11 శాతం, 20.27 శాతం సగటు వార్షిక ప్రతిఫలాన్ని అందించాయి.


నిఫ్టీ100 సూచీలో 

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నిఫ్టీ 100 ఇండెక్స్‌ ఆధారిత కొత్త పథకం వచ్చింది. ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్‌ ఫండ్‌ - అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 18. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. కనీస పెట్టుబడి రూ.5,000. దీనికి నిమేష్‌ సేథ్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

ఈ పథకంలో పెట్టుబడి పెడితే నిఫ్టీ 100 సూచీలోని షేర్లను పరోక్షంగా కొనుగోలు చేసినట్లు. తద్వారా దేశంలోని అత్యుత్తమ కంపెనీల నమోదు చేసే వృద్ధిలో భాగస్వామి అయినట్లు అవుతుంది. నిప్టీ 100 సూచీలో దాదాపు అన్ని ముఖ్యమైన వ్యాపార రంగాలకు చెందిన పెద్ద కంపెనీలు భాగంగా ఉన్నాయి. ఆర్థిక సేవలు, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, వినియోగ రంగాలకు చెందిన కంపెనీలకు ఈ సూచీలో స్థానం కల్పించారు. దీర్ఘకాలిక మదుపరులకు ఇది అనువైన పథకం. ప్రతిఫలం అధికంగా కాకపోయినా ‘హేతుబద్ధమైన’ లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. అంతేగాక దీర్ఘకాలంలో నష్టభయం తక్కువగా ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts