హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ ఒకేసారి రెండు లార్జ్‌క్యాప్‌లు..

ఎన్‌ఎస్‌ఈ (నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా) సూచీ నిఫ్టీలో భాగమైన అగ్రశ్రేణి కంపెనీల్లో పెట్టుబడి, తక్కువ నష్టభయం, స్థిరమైన వృద్ధిని ఆశించే వారికి అనువైన రీతిలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌

Updated : 18 Feb 2022 00:36 IST

ఎన్‌ఎస్‌ఈ (నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా) సూచీ నిఫ్టీలో భాగమైన అగ్రశ్రేణి కంపెనీల్లో పెట్టుబడి, తక్కువ నష్టభయం, స్థిరమైన వృద్ధిని ఆశించే వారికి అనువైన రీతిలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒకేసారి రెండు పథకాలను తీసుకువచ్చింది.
ఇందులో ఒకటి హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్‌ ఫండ్‌ కాగా, మరోటి హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌. ఈ రెండు కొత్త పథకాల యూనిట్ల విక్రయానికి సంబంధించిన ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 18 (నేడు)తో     ముగియనుంది. ఎన్‌ఎఫ్‌ఓ ద్వారా కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.

మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌) ప్రకారం లెక్కిస్తే, దేశీయ స్టాక్‌ మార్కెట్లో నమోదైన కంపెనీల్లో 68 శాతం వాటా ‘లార్జ్‌ క్యాప్‌’ తరగతికి చెందిన షేర్లదే కావటం గమనార్హం. ఇటువంటి 100 కంపెనీల్లో పెట్టుబడి పెట్టే పరోక్ష అవకాశాన్ని ఈ రెండు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించినట్లు అవుతోంది.

హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్‌ ఫండ్‌, నిఫ్టీ 100 ఇండెక్స్‌లోని కంపెనీలను ఫ్రీ-ఫ్లోట్‌ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ ఆధారంగా తన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో కోసం ఎంచుకుంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌కు ఇటువంటి పరిమితి ఏదీ ఉండదు. అన్ని కంపెనీలను పరిగణనలోకి తీసుకొని, లాభదాయకత ఎక్కడ ఎక్కువగా ఉంటే, ఆ కంపెనీల వైపు మొగ్గు చూపుతుంది.


అన్ని  తరగతుల  షేర్లలో

ఎస్‌బీఐ మల్టీక్యాప్‌ ఫండ్‌

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక మల్టీ క్యాప్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఎస్‌బీఐ మల్టీక్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 28. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. అన్ని తరగతులకు చెందిన (లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌) షేర్లలో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ పథకానికి ఉంటుంది. తద్వారా లాభదాయకతను పెంచుకునేందుకు, నష్టభయాన్ని తగ్గించుకునేందుకు వీలవుతుంది. ఈ క్రమంలో ఫండ్‌ మేనేజర్‌ పాత్ర క్రియాశీలకం అవుతుంది. ఆర్‌.శ్రీనివాసన్‌, మోహిత్‌ జైన్‌ ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లు. ‘నిఫ్టీ 500 మల్టీక్యాప్‌ 50: 25: 25’ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు.


తక్కువ నష్టభయంతో

పెట్టుబడుల విలువలో తక్కువ హెచ్చుతగ్గులు ఉండే విధంగా నూతన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చింది. ఇండెక్స్‌ షేర్లతో నాణ్యమైన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నిర్మించే వ్యూహంతో వచ్చిన ఈ పథకం పేరు యూటీఐ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ లో వోలటాలిటీ ఇండెక్స్‌ ఫండ్‌. దీని ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 25తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఫండ్‌ మేనేజర్‌ శర్వాన్‌ కుమార్‌ గోయల్‌. మార్కెట్‌కు సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, షేర్లలో బాగా దిద్దుబాటు రావటం చూస్తూనే ఉంటాం. కానీ తక్కువ హెచ్చుతగ్గులు ఉండే పథకాల కోసం ఎంచుకునే షేర్లు ఇటువంటి పరిస్థితులను తట్టుకునేవిగా ఉంటాయి. తద్వారా మదుపరులకు నష్టభయం తక్కువగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని