పదవీ విరమణలో తోడుగా..

* నా వయసు 43. పదవీ విరమణ ప్రణాళికల కోసం నెలకు రూ.8వేల వరకూ కేటాయించాలనుకుంటున్నాను. బీమా సంస్థల్లో యాన్యుటీ పాలసీలు మంచివేనా? మ్యూచువల్‌ ఫండ్లలోనూ రిటైర్మెంట్‌ ఫండ్లు

Updated : 14 Mar 2022 15:32 IST

* నా వయసు 43. పదవీ విరమణ ప్రణాళికల కోసం నెలకు రూ.8వేల వరకూ కేటాయించాలనుకుంటున్నాను. బీమా సంస్థల్లో యాన్యుటీ పాలసీలు మంచివేనా? మ్యూచువల్‌ ఫండ్లలోనూ రిటైర్మెంట్‌ ఫండ్లు ఉన్నాయి కదా.. రెండింటిలో ఏవి మేలు? - మాధవరావు

బీమా సంస్థలు అందించే యాన్యుటీ పాలసీలు సురక్షితంగా ఉంటాయి. ఇవి రెండు రకాలు. ఒకేసారి కొంత మొత్తం మదుపు చేసినప్పుడు వెంటనే పింఛను ఇచ్చేవి ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాలు. ఇలా కాకుండా ఏటా ప్రీమియం చెల్లిస్తూ.. నిర్ణీత వ్యవధి తర్వాత పింఛను అందించేవి డిఫర్డ్‌ యాన్యుటీ పాలసీలు. మీరు డిఫర్డ్‌ యాన్యుటీలను ఎంచుకోవచ్చు. సాధారణంగా యాన్యుటీ పథకాల్లో వచ్చే రాబడి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు దరిదాపుల్లో ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్లలోనూ రిటైర్మెంట్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈక్విటీ ఆధారిత పథకాలు కాబట్టి, స్వల్పకాలంలో నష్టభయం ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆశించవచ్చు. యాన్యుటీలతో పోల్చి చూసినప్పుడు మ్యూచువల్‌ ఫండ్లతోనే అధిక రాబడి అందుకునే వీలుంటుంది.


* మా అమ్మాయి పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.5వేలు జమ చేస్తున్నాం. మరో రూ.5వేలను పెట్టుబడి పెట్టేందుకు ఏ పథకం ఎంచుకోవాలి? యూనిట్‌ ఆధారిత బీమా పథకం (యులిప్‌) తీసుకోవడం లాభమేనా? - స్వప్న

మీరు ఇప్పటికే ప్రభుత్వ హామీ ఉన్న సుకన్య సమృద్ధిలో జమ చేస్తున్నారు. కాబట్టి, అదనంగా మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని హైబ్రీడ్‌ ఈక్విటీ పథకాలకు కేటాయించండి. యులిప్‌లలో ఛార్జీలు కాస్త అధికంగా ఉంటాయి. అయిదేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. ఇక హైబ్రీడ్‌ ఫండ్లలో నెలకు రూ.5వేల చొప్పున 15 ఏళ్లపాటు జమ చేస్తే.. కనీసం 11 శాతం రాబడి అంచనాతో రూ.20,64,321 అయ్యేందుకు వీలుంటుంది.


* నేను అంతర్జాతీయ మార్కెట్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మంచిదేనా - జయేంద్ర

విదేశీ స్టాక్‌ మార్కెట్లలో మదుపు చేసేందుకు అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల మార్కెట్‌ దిద్దుబాటు నేపథ్యంలో ఇలాంటి ఫండ్లు కాస్త ఎక్కువగానే పతనం అయ్యాయి. మీ మొత్తం పెట్టుబడిలో 15-20శాతం వరకూ ఇలాంటి ఫండ్లలో మదుపు చేయొచ్చు. దీర్ఘకాలం కొనసాగినప్పుడే ఫలితం ఉంటుంది. మార్కెట్లు పతనం అయినప్పుడే కాకుండా.. విదేశీ మారకపు విలువా ఈ ఫండ్లను ప్రభావితం చేస్తుంది. రూపాయి విలువ పతనం అయితే ఇలాంటి ఫండ్లలో లాభాలు అధికంగా కనిపిస్తాయి. బలపడితే రాబడి తగ్గుతుంది.


 


* వ్యాపారం చేస్తున్నాను. నెలకు రూ.30వేల వరకూ ఆర్జిస్తున్నాను. ఇప్పటివరకూ ఎలాంటి పెట్టుబడులూ లేవు. నా దగ్గర డబ్బులు మిగిలినప్పుడల్లా పెట్టుబడి పెట్టేందుకు ఏం చేయాలి? ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి - శ్రీధర్‌

ముందుగా మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రయత్నించండి. దీనికోసం కనీసం రూ.50లక్షల విలువైన టర్మ్‌ పాలసీని ఎంచుకోండి. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలనూ ఎంచుకోండి. మీ దగ్గర డబ్బులు మిగిలినప్పుడల్లా.. అందులో నుంచి 40 శాతాన్ని ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో జమ చేయండి. మిగతా 60 శాతాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు మళ్లించండి. డబ్బు మిగిలినప్పుడే కాకుండా.. నెలనెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మంచిది.

- తుమ్మ బాల్‌రాజ్‌, సర్టిఫైడ్‌ ప్లానర్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని