Updated : 25 Mar 2022 06:13 IST

టర్మ్‌ పాలసీ చెల్లింపుల చరిత్ర చూడాలి

అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కుటుంబ పెద్దపై ఉంటుంది. ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో ఇది తప్పనిసరి. దీనికోసం జీవిత బీమా పాలసీలు తీసుకోవడం ఒక మార్గం. తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ లభించే టర్మ్‌ పాలసీలు ఇందుకు ఉపయోగపడతాయని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. సరైన పాలసీ తీసుకున్నప్పుడే దీనివల్ల ఉపయోగం. ఒక్కో బీమా సంస్థ వేర్వేరు ప్రయోజనాలతో వీటిని అందిస్తూ ఉంటుంది. నిబంధనలు, వర్తించేవి, మినహాయింపులు వేర్వేరుగా ఉంటాయి. పాలసీ కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ చూడటంతోపాటు.. కంపెనీ చెల్లింపుల చరిత్రనూ తప్పనిసరిగా అధ్యాయనం చేయాలి.

నిర్ణీత వ్యవధిలో.. వచ్చిన క్లెయింలు, వాటిలో ఎన్ని పరిష్కరించారో తెలిపేదే చెల్లింపుల చరిత్ర నిష్పత్తి (క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో). పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీ బీమా సంస్థను సంప్రదించి, పాలసీని క్లెయిం చేసుకుంటారు. బీమా సంస్థ నిబంధనల మేరకు ఆ క్లెయింను ఆమోదింస్తుంది లేదా తిరస్కరిస్తుంది. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థ నుంచి పాలసీ తీసుకుంటే.. తిరస్కరణకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తక్కువ చెల్లింపుల నిష్పత్తి ఉండే సంస్థ.. పరిహారం ఇవ్వడంలో ఇబ్బందులు సృష్టిస్తుందని అర్థం చేసుకోచ్చు. ఉదాహరణకు ఒక సంస్థకు ఏడాదిలో 1,000 క్లెయింలు వచ్చాయనుకుందాం. ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందులో 900 పాలసీలకు పరిహారం ఇస్తే.. దాని చెల్లింపుల నిష్పత్తి 90శాతం ఉన్నట్లు లెక్క.
టర్మ్‌ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు ఈ క్లెయిం చెల్లింపుల నిష్పత్తిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని బీమా సంస్థలు పాలసీదారులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఆన్‌లైన్‌లో తక్కువ ప్రీమియానికే ఈ పాలసీలు అందుబాటులోకి తెస్తున్నాయి. కేవలం ప్రీమియం తక్కువగా ఉందని పాలసీలను తీసుకోవడం ఎప్పుడూ సరికాదు. జీవితంలో టర్మ్‌ పాలసీ అనేది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. కాబట్టి, పూర్తిగా పరిశోధన చేశాకే పాలసీని ఎంచుకోవాలి.

ఎలా చూడాలి..

గతంలో క్లెయిం చెల్లింపుల నిష్పత్తిని పరిశీలించేందుకు వీలయ్యేది కాదు. కానీ, భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) బీమా సంస్థలు తమ క్లెయిం సెటిల్‌మెంట్‌ గురించి ప్రకటించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో బీమా సంస్థలు ఏడాదిలో తాము ఎన్ని క్లెయింలు పరిష్కరించిందీ చెబుతున్నాయి. కేవలం పాలసీల సంఖ్యను మాత్రమే ఇవి తెలియజేస్తాయి. ఎంత మొత్తం క్లెయిం చేశామన్నది పేర్కొనేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతించలేదు. అవసరమైన మేరకు సమాచారాన్ని తీసుకొని, సరైన అవగాహనతో పాలసీని తీసుకోవడానికి ప్రయత్నించాలి.

ఇక్కడ మరో విషయం.. ప్రకటనలను చూసి మోసపోవద్దు. బీమా సంస్థ నాలుగైదేళ్లుగా చెల్లింపులను ఎలా చేసిందనే సమాచారాన్ని విశ్లేషించాలి. కేవలం టర్మ్‌ పాలసీల విషయంలోనే కాకుండా.. ఎండోమెంట్‌, మనీ బ్యాక్‌, యులిప్‌ తదితర పాలసీలకూ క్లెయిం చెల్లింపుల నిష్పత్తిని చూడాలి. అప్పుడే సరైన సంస్థను ఎంచుకోగలం.

వార్షికాదాయం, బాధ్యతలు, ప్రీమియం చెల్లించే సామర్థ్యం, పాలసీ ఇచ్చే ప్రయోజనాల్లాంటివీ టర్మ్‌ పాలసీల ఎంపికలో కీలకమని గుర్తుంచుకోండి. పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య, ఆర్థిక విషయాలన్నీ ఎలాంటి దాపరికం లేకుండా బీమా సంస్థకు తెలియజేయండి. ఇప్పటికే ఉన్న పాలసీల వివరాలూ చెప్పాలి. అప్పుడే పాలసీ క్లెయింలో ఎలాంటి ఇబ్బందులూ రావు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని