సందేహాలు వీడాలి.. మదుపు పెరగాలి..

డబ్బును సంపాదించడం ఒక్కటే కాదు.. దాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టినప్పుడే.. ఆర్థికంగా రక్షణ.  వచ్చిన డబ్బంతా ఖర్చులకు సరిపోతుంది.. ఇక మదుపు చేయడం ఎలా? అనే ఆలోచనతో ఉంటారు ఎంతోమంది. మనసుంటే మార్గం ఉంటుంది.

Published : 22 Apr 2022 01:34 IST

డబ్బును సంపాదించడం ఒక్కటే కాదు.. దాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టినప్పుడే.. ఆర్థికంగా రక్షణ.  వచ్చిన డబ్బంతా ఖర్చులకు సరిపోతుంది.. ఇక మదుపు చేయడం ఎలా? అనే ఆలోచనతో ఉంటారు ఎంతోమంది. మనసుంటే మార్గం ఉంటుంది. సందేహాలు ఉంటే ఏ పనీ సక్రమంగా పూర్తి కాదు. ఆర్థిక విషయాల్లో పూర్తి అవగాహనతో అడుగులు వేస్తే... లక్ష్యాన్ని చేరడం అసాధ్యమేమీ కాదు. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.

పొదుపు చేయలేకపోతున్నాం.. చాలామంది నోట వినిపించే మాట ఇదే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పొదుపు చేయలేకపోతున్నారంటే.. ఖర్చులను సరిగా అంచనా వేయడం లేదని అర్థం. మీరు సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్తోంది అన్నది సరిగా తెలుసుకుంటే చాలు.. సమస్య తీరినట్లే. అందుకే, ప్రతి ఖర్చుకూ ఒక లెక్క ఉండాలి. చిల్లర మొత్తమైనా సరిగ్గా రాసి పెట్టాలి. ఇది అంత తేలికేమీ కాదు.. కొందరు ఒకటి రెండు రోజులు ఈ లెక్కలు రాస్తే.. మరికొందరు వారం, పది రోజుల తర్వాత ఆపేస్తారు. కనీసం మూడు నెలల వరకైనా ఈ ఖర్చుల పద్దు ఉంటే తప్ప మనకు ఆర్థిక క్రమశిక్షణ అలవాటు కాదు. అప్పుడే ఖర్చులు తగ్గి, పొదుపు పెరిగే మార్గం కనిపిస్తుంది.

అప్పులు తీర్చాకే...

పెట్టుబడులు ప్రారంభించే ముందు.. ఒకసారి మీ అప్పుల సంగతి చూసుకోండి. అధిక వడ్డీ రుణాలను తీర్చకుండా.. మదుపు చేసినా ఫలితం ఉండదు. ఆర్థిక స్వేచ్ఛకు అప్పులు అడ్డంకులు సృష్టిస్తాయని మర్చిపోవద్దు. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డుపై రుణం తీసుకుంటే.. దాదాపు 24 శాతం వరకూ వార్షిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీన్ని తీర్చకుండా.. ఏ పెట్టుబడి పెట్టినా.. ఇంతకు మించి రాబడిని ఆర్జించడం అంత తేలిక కాదు. 12 శాతం వడ్డీ విధిస్తున్న రుణం ఉన్నా.. రాబడి 12 శాతమే వస్తే... మిగిలేదేమీ ఉండదు. వీలైనంత వరకూ ముందు అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మదుపు గురించి ఆలోచన.

మీ కోసం ఏం చేయాలి?

డబ్బు కోసం మీరు కష్టపడుతున్నారు. ఆ డబ్బు మీకోసం ఏం చేయాలని అనుకుంటున్నారు? ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. అప్పుడే కష్టపడి పొదుపు చేస్తున్న మొత్తాన్ని అర్థవంతంగా మదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. భవిష్యత్‌ కోసం డబ్బులు ఎలా అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికే పెట్టుబడులు ప్రారంభించాలి. ప్రతి రూపాయినీ మీ ఆర్థిక లక్ష్యంతో ముడిపెట్టాలి. పిల్లల చదువులు, వారి ఇతర ఖర్చులు, మీ పదవీ విరమణ ప్రణాళికలు.. ఇలా ప్రతి లక్ష్యానికీ విడివిడిగా పెట్టుబడులు కేటాయించాలి. దీర్ఘకాలంలో డబ్బు మరింత డబ్బును సంపాదించేలా పథకాలను ఎంచుకోవాలి. నష్టభయం ఉన్న పథకాల ఎంపికలో జాగ్రత్త తప్పనిసరి.

పెట్టుబడులు జాబితాతో..

ఆర్థిక పరిస్థితుల ఆధారంగా పెట్టుబడులు ఉండాలి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక అవసరాల కోసం వేర్వేరు పథకాలు ఎంచుకోవాలి. ఈక్విటీలు ఎప్పుడూ దీర్ఘకాలం కోసమే. డెట్‌ ఫండ్లు 3-5 ఏళ్ల వ్యవధికి సరిపోతాయి. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు ప్రారంభిస్తున్నవారు.. ఈక్విటీ, డెట్‌లలో మదుపు చేసే బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించాలి. నష్టాన్ని భరించే సామర్థ్యం ఎంత మేరకు ఉందన్నది అంచనా వేసుకోవాలి. పెట్టుబడులతోపాటే పన్ను ప్రణాళికా ప్రారంభించాలి. పన్ను ఆదా పథకాలు.. దీర్ఘకాలిక లక్ష్యాలతోపాటు, స్వల్పకాలిక అవసరాలనూ తీరుస్తాయి. పీపీఎఫ్‌ సురక్షితంగా ఉండే దీర్ఘకాలిక పథకం. దీని వ్యవధి 15 ఏళ్లు. తక్కువ కాలావధి (మూడేళ్లు) ఉండే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) నష్టభయం ఉన్నప్పటికీ అధిక రాబడిని అందిస్తాయి.


ఎంత కేటాయించాలి?

ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కొందరు అధిక మొత్తం పెట్టుబడి పెట్టగలరు. అప్పులు ఎక్కువగా ఉన్నవారుంటారు. సంపాదనలోనూ వ్యత్యాసాలుంటాయి. కానీ, ఆర్థికంగా ఒక కచ్చితమైన ప్రణాళిక ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందే. తొలిసారి పెట్టుబడులు పెట్టేవారు.. ముందుగా ఒక సూత్రాన్ని పాటించాలి.

50 శాతం: సంపాదనలో సగం అవసరాలకు కేటాయించుకోవాలి. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, బిల్లుల్లాంటి వాటికి వినియోగించుకోవాలి.

30 శాతం: ఖర్చులు పోను మిగిలిన మొత్తంలో 30 శాతాన్ని భవిష్యత్‌ అవసరాల కోసం దాచి పెట్టుకోవాలి. విహార యాత్రలు, ఇతర అనుకోని ఖర్చులకు దీన్ని వాడుకోవాలి.

20 శాతం: మిగిలిన 20 శాతం మొత్తాన్ని పెట్టుబడి పథకాలకు మళ్లించాలి.

ఇక్కడ చేయాల్సిందేమిటంటే.. ముందుగా 20 శాతాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాతే.. మిగతా వాటి సంగతి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని