ఈ వయసులో పాలసీ ఇస్తారా?

నెలకు రూ.8వేల చొప్పున కాస్త సురక్షితంగా ఉండే పథకాల్లో మదుపు చేయాలని ఆలోచిస్తున్నా. ఇప్పటికే రూ.5వేల వరకూ వీపీఎఫ్‌లో జమ చేస్తున్నా. కొత్త పెట్టుబడి కోసం ఏ పథకాలు ఎంచుకోవాలి? 

Updated : 22 Apr 2022 06:27 IST

1) నెలకు రూ.8వేల చొప్పున కాస్త సురక్షితంగా ఉండే పథకాల్లో మదుపు చేయాలని ఆలోచిస్తున్నా. ఇప్పటికే రూ.5వేల వరకూ వీపీఎఫ్‌లో జమ చేస్తున్నా. కొత్త పెట్టుబడి కోసం ఏ పథకాలు ఎంచుకోవాలి? 

- సతీశ్‌

ప్పటికే సురక్షిత పెట్టుబడి పథకం వీపీఎఫ్‌లో మదుపు చేస్తున్నారు. కాబట్టి, కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.8వేలను కాస్త తక్కువ నష్టభయం ఉన్న పథకాలకు కేటాయించండి. దీనికోసం హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లు లేదా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. వీటిలో దీర్ఘకాలం మదుపు చేయడం ఉత్తమం. నెలకు రూ.8వేల చొప్పున క్రమం తప్పకుండా 10 ఏళ్లపాటు మదుపు చేస్తే 10 శాతం రాబడి అంచనాతో.. దాదాపు రూ.15,29,992 అయ్యేందుకు అవకాశం ఉంది. పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.


2) నా వయసు 57. మరో మూడేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. ఇప్పుడు టర్మ్‌ పాలసీ తీసుకోవడం అవసరమేనా? ప్రీమియం అధికంగా ఉంటుందా? నాకు రక్తపోటు ఉంది. ఆరోగ్య బీమా పాలసీ ఇస్తారా?

- దిలీప్‌

మీపై బాధ్యతలు ఉన్నంత వరకూ జీవిత బీమా రక్షణ కచ్చితంగా ఉండాలి. మీ వయసు 57 కాబట్టి, టర్మ్‌ పాలసీ కోసం అధిక ప్రీమియాన్ని చెల్లించాల్సి వస్తుంది. రక్తపోటు ఉన్న విషయాన్ని బీమా ప్రతిపాదిత పత్రంలో తెలియజేయండి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలకు సిద్ధంగా ఉండాలి. మీ వైద్య పరీక్షల నివేదికల తర్వాత, బీమా సంస్థ తన విచక్షణ మేరకు మీకు పాలసీని ఇస్తుంది. కొన్నిసార్లు ప్రీమియం లోడింగ్‌నూ విధించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీకీ ఇలాంటి నిబంధనలే వర్తిస్తాయి. ముందస్తు వ్యాధులు ఉన్నప్పుడు రెండు నుంచి మూడేళ్లపాటు వేచి ఉండే వ్యవధి ఉంటుంది. తక్కువ వేచి ఉండే వ్యవధిని అందించే పాలసీని ఎంచుకోండి.


3) మాకు ఇటీవలే వివాహం అయ్యింది. ఇద్దరమూ ఉద్యోగులమే. మా ఇద్దరి పేరుమీద ఉమ్మడిగా జీవిత బీమా పాలసీ తీసుకోవచ్చా? ప్రస్తుతం ఒకరి జీతాన్ని మొత్తం పెట్టుబడులకు కేటాయించాలని అనుకుంటున్నాం. మా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?

- స్వప్న

ఉమ్మడి పాలసీ కాకుండా.. ఎవరికి వారే వేర్వేరుగా టర్మ్‌ పాలసీలు తీసుకోండి. ఇద్దరికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా తీసుకోండి. కనీసం ఆరు నెలలకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా సిద్ధం చేసుకోండి. పెట్టుబడికి మళ్లించే వారి జీతం నుంచి 40 శాతం వీపీఎఫ్‌లో జమ చేయొచ్చు. మిగతా 60 శాతాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.


4) ఇల్లు కొనాలనేది మా ఆలోచన. రూ.40లక్షల వరకూ రుణం వస్తుంది. అదనంగా కావాల్సిన మొత్తం కోసం ఈపీఎఫ్‌ నుంచి రూ.10లక్షల వరకూ తీసుకునే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌ బదులు బంగారాన్ని అమ్మేయొచ్చా?

- గోపాల్‌

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో 8.1శాతం వడ్డీ లభిస్తోంది. దీనికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయం లేకపోతేనే ఇందులో నుంచి డబ్బు వెనక్కి తీసుకోవాలి. మీ దగ్గర అవసరానికి మించి బంగారం ఉంటే.. దాన్ని విక్రయించడం ద్వారా డబ్బు సమకూర్చుకునే ప్రయత్నం చేయండి.


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు