ఐపీఓ చేయొద్దు ఈ పొరపాట్లు..

భారతీయ స్టాక్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా 18-35 ఏళ్లలోపు వారు అధికంగా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి వారు మార్కెట్లో ఎలాంటి పొరపాట్లూ చేయకుండా తమ మదుపు ప్రయాణాన్ని కొనసాగించాలి.

Updated : 22 Apr 2022 01:37 IST

భారతీయ స్టాక్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా 18-35 ఏళ్లలోపు వారు అధికంగా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి వారు మార్కెట్లో ఎలాంటి పొరపాట్లూ చేయకుండా తమ మదుపు ప్రయాణాన్ని కొనసాగించాలి. గత ఏడాది నుంచి అనేక సంస్థలు తొలిసారి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చి, తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఇందులో కొన్ని షేర్లు దూసుకెళ్తుండగా, మరికొన్ని ఇష్యూ ధర కన్నా తక్కువకే లభిస్తున్నాయి. ఇప్పుడు అనేక సంస్థలు మార్కెట్‌ నుంచి డబ్బులు సమీకరించేందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఓల్లో మదుపు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

క కంపెనీ ఐపీఓకి వస్తున్నట్లు ప్రకటించినప్పుడే.. దాని గురించి అధ్యయనం ప్రారంభించాలి. ఆ సంస్థ ఏం చేస్తుంటుంది? ఐపీఓకి రావాల్సిన అవసరం ఏమిటి? వచ్చిన డబ్బును ఎలా వాడబోతున్నారు? అధిక ధరకు షేర్లను విక్రయిస్తున్నారా? అందుబాటు ధరలోనే ఉందా? ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకైనా సమాధానాలు తెలుసుకోవాలి. ఆ సంస్థ చేసే వ్యాపారం గురించి మీకు అర్థం కాకపోతే.. అందులో పెట్టుబడులు పెట్టడం సరికాదు. ప్రస్తుతం నిర్వహిస్తోన్న వ్యాపారం, భవిష్యత్‌లో వృద్ధికి అవకాశం ఈ రెండూ ముఖ్యమే. వీటిపై కాస్త అవగాహన వచ్చాకే ఐపీఓలకు దరఖాస్తు చేయడం మంచిది.

పేరు చూసి..

చాలామంది కంపెనీ పేరు చూసి, ఐపీఓకి దరఖాస్తు చేయడం, లేదా షేర్లు కొనడంలాంటివి చేస్తుంటారు. జనంలో పేరున్న సంస్థలన్నీ వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించి, లాభాలు పంచుతాయని నమ్మొద్దు. కొన్నిసార్లు ఆయా కంపెనీలతో మనకున్న అనుబంధంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటారు. మార్కెట్లో ఇలాంటి వాటికి చోటుండదు. సంస్థ పేరుతో కాదు.. మంచి యాజమాన్యం, వ్యాపార నిర్వహణ తీరు, లాభనష్టాలు తదితరాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.

సరైన సమయం..

మార్కెట్‌ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరూ చెప్పలేరు. అనుభవం ఉన్నవారికీ సాధ్యం కాదు. కొత్త మదుపరులు దీన్ని గుర్తించాలి. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండటంలాంటి పొరపాట్లు చేయొద్దు. పెరుగుతున్నప్పుడు పెట్టుబడులు పెట్టడం, తగ్గుతున్నప్పుడు వెనక్కి తీసుకుంటే నష్టపోతారు. తిరిగి మార్కెట్‌ విశ్వాసం రావడానికి సమయం పడుతుంది. ఈలోపు పెట్టుబడి అవకాశాలను కోల్పోతారు. షేర్ల ధరలు అందుబాటులోకి వచ్చినప్పుడు కొనడం, దీర్ఘకాలం అందులో కొనసాగినప్పుడే మంచి రాబడి అందుకునే వీలుంటుంది.

వైవిధ్యం లేకపోవడం..

ఒకేచోట మొత్తం పెట్టుబడిని పెడితే నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. పథకాల ఎంపికలో పూర్తి వైవిధ్యం ఉండాలి. షేర్లు, బాండ్లు, స్థిరాస్తులు ఇలా పెట్టుబడులను వర్గీకరించుకోవాలి. మొత్తం పెట్టుబడిలో 10 శాతానికి మించి ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో ఉండకుండా చూసుకోవాలి. లక్ష్యాలకు సరిపోయే విధంగా ఫండ్లను ఎంపిక చేసుకోవడమూ కీలకమే.

భావోద్వేగాలతో..

భయం, అత్యాశ.. ఈ రెండూ మార్కెట్‌లో మదుపరులను శాసిస్తుంటాయి. మదుపరులు ముందుగా భయాన్ని విడనాడాలి. భవిష్యత్‌ గురించి ఆలోచించాలి. స్వల్పకాలంలో మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు సహజం. దీర్ఘకాలంలో ఇవి తక్కువగా ఉంటాయి. చరిత్రను గమనిస్తే.. లార్జ్‌క్యాప్‌ షేర్లు సగటున 10 శాతానికి పైగానే రాబడిని అందించాయి. పెట్టుబడి నిర్ణయాలను మీ భావోద్వేగాలు నియంత్రించే పరిస్థితి తెచ్చుకోవద్దు.

పెట్టుబడుల విషయంలో పొరపాట్లు సహజమే. కానీ, వాటి నుంచి వీలైనంత తొందరగా పాఠాలు నేర్చుకోవాలి. ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. మీ నిర్ణయాలపై మీకు విశ్వాసం ఉండాలి. లేకపోతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఐపీఓని ఎంచుకునేటప్పుడు మీరు ఏ లక్ష్యంతో మదుపు చేస్తున్నారో చూసుకోండి. అనుమానాలున్నప్పుడు క్రమానుగత పెట్టుబడి విధానం పాటించడం ఎప్పుడూ మేలు.

- అమర్జీత్‌ మౌర్య, ఏవీపీ-మిడ్‌ క్యాప్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని