Updated : 06 May 2022 03:10 IST

రాబడి హామీతో పింఛను..

దవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా పింఛను రావాలని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకొని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పింఛను పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు అదనంగా చెల్లించేందుకూ వీలు కల్పించే ఈ ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీ పథకం ద్వారా మదుపరులు దీర్ఘకాలం పొదుపు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ యాన్యుటీ పాలసీలో జమైన మొత్తంతో జీవితాంతం వరకూ నిర్ణీత మొత్తంలో పింఛను పొందేందుకు అవకాశం లభిస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని ఏడు రకాలుగా ఎంచుకునేందుకు వీలుంది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఆరోగ్య అత్యవసరం లేదా ఏదైనా అదనపు ఖర్చులు వచ్చినప్పుడు బూస్టర్‌ చెల్లింపులను అందిస్తుంది. అనారోగ్యం వల్ల రోజువారీ ఖర్చులు పెరిగిన సందర్భాల్లో ఇది ఆర్థికంగా చేయూతనిస్తుంది. దీంతోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే.. పదవీ విరమణ తరువాత విహార యాత్రల్లాంటి వాటికీ ఇది కొంత మొత్తాన్ని అందిస్తుంది. దంపతులు ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ఈ యాన్యుటీ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ ప్రీమియం చెల్లింపు కొనసాగుతున్న సమయంలో ప్రాథమిక పాలసీదారుడు మరణిస్తే.. మిగతా ప్రీమియాలను చెల్లించాల్సిన అవసరం లేకుండా వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం వెసులుబాటూ ఉంది. పింఛను అందుకుంటున్నప్పుడూ ప్రాథమిక పాలసీదారుడి అనంతరం, జీవిత భాగస్వామి జీవితాంతం వరకూ పింఛను అందుతుంది. కొన్ని ప్రత్యేక వ్యాధుల బారినపడినప్పుడు, లేదా శాశ్వత వైకల్యానికి గురైన సందర్భాల్లో పాలసీని స్వాధీనం చేయొచ్చు. అప్పుడు చెల్లించిన ప్రీమియాలన్నీ తిరిగి ఇచ్చేస్తుంది. ‘పదవీ విరమణ నాటికి వచ్చే ఆదాయంలో కనీసం 70-90 శాతం ఆదాయం పింఛను రూపంలోనూ అందుకునే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే విశ్రాంత జీవితం ఎలాంటి ఆటంకాలూ లేకుండా సాగుతుంది. దీనికోసం ముందునుంచే తగిన ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే యాన్యుటీ ప్లాన్లు ఉపయోగపడతాయి’ అని సంస్థ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ పల్టా తెలిపారు.


తీవ్ర వ్యాధులకు పరిహారం..

దాదాపు 100 రకాల తీవ్ర వ్యాధుల చికిత్సకు పరిహారం ఇవ్వడంతోపాటు, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నగదును అందించే పాలసీని టాటా ఇన్సూరెన్స్‌ ఏఐజీ క్రిటి-మెడికేర్‌ పేరుతో విడుదల చేసింది. జీవన శైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర అనారోగ్యాల పాలైనప్పుడు ఈ పాలసీ ఆర్థికంగా ఆదుకుంటుంది. తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు, క్యాన్సర్‌ సోకినప్పుడు, ఆసుపత్రిలో చేరినప్పుడు నగదు ఇవ్వడం తదితర ప్రయోజనాలను ఈ పాలసీ కల్పిస్తుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ సెంచరీ ప్రీమియర్‌ ప్లాన్‌ (100 తీవ్ర వ్యాధులు), స్మార్ట్‌ హాఫ్‌ సెంచరీ ప్లాన్‌ (50 తీవ్ర వ్యాధులు) ఎంచుకునే వీలుంది. ఈ జాబితాలో ఉన్న వ్యాధి సోకినప్పుడు ముందుగానే నిర్ణయించిన మొత్తాన్ని ఒకేసారి ఈ పాలసీ అందిస్తుంది. క్యాన్సర్‌ 360 డిగ్రీస్‌ ఇండెమ్నిటీ కవర్‌ ఎంచుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా కవరేజీ లభిస్తుంది. చికిత్స ఖర్చు, వసతి, రవాణా, మానసిక నిపుణుల ద్వారా కౌన్సిలింగ్‌ తదితర ఖర్చులను ఈ పాలసీ భరిస్తుంది. రోజువారీ ఖర్చుల కింద గరిష్ఠంగా రోజుకు రూ.20,000 వరకూ ఏడాదిలో 180 రోజుల పాటు చెల్లిస్తుంది. ప్రమాదంలో గాయాలపాలైనప్పుడు, ఐసీయూలో చేరినప్పుడు ఈ మొత్తం రెట్టింపవుతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని