నెలకు రూ.15వేలు వచ్చేలా...

త్వరలో పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు కనీసం రూ.15వేల వరకూ వచ్చేలా ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎంత మొత్తం మదుపు చేయాలి? సురక్షితంగా ఉండే పథకాలను సూచించండి?...

Published : 06 May 2022 00:33 IST

త్వరలో పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు కనీసం రూ.15వేల వరకూ వచ్చేలా ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎంత మొత్తం మదుపు చేయాలి? సురక్షితంగా ఉండే పథకాలను సూచించండి?

- మనోహర్‌

ప్రస్తుతం సురక్షితమైన పెట్టుబడులపై వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం, ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాలు మంచి రాబడినే అందిస్తున్నాయి. వీటిల్లో 7.4శాతం వడ్డీ వస్తోంది. ఒక్కో పథకంలో గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ మదుపు చేయొచ్చు. మీకు నెలకు రూ.15వేల వరకూ ఆదాయం రావాలంటే.. రెండు పథకాల్లో కలిపి రూ.24.5లక్షల వరకూ జమ చేయాల్సి వస్తుంది.


పదేళ్ల మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచన. ఈ మొత్తాన్నివీపీఎఫ్‌లో జమ చేయొచ్చా? లేకపోతే ఇతర పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలా? 15 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం జమ అయ్యే వీలుంది?

- పద్మ

ప్రస్తుతం ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌లో 8.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఇప్పటికే మీరు ఈపీఎఫ్‌లో జమ చేస్తున్నారు కాబట్టి, మరో సురక్షితమైన పథకంలో మదుపు చేయడం వల్ల అధిక రాబడిని అందుకోలేరు. దీనికి బదులు కాస్త నష్టభయం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే పథకాలను ఎంచుకోవచ్చు. దీనికోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. మీరు 15 ఏళ్లపాటు నెలకు రూ.15వేలు మదుపు చేస్తూ ఉంటే.. 12 శాతం రాబడి అంచనాతో.. దాదాపు రూ.67,10,348 అయ్యేందుకు అవకాశం ఉంది.


ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.23వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.8వేల వరకూ దాచి పెట్టాలనుకుంటున్నాను. నా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?

- శ్రీహరి

మీపై ఆధారపడిన వారు ఉంటే.. కనీసం రూ.30లక్షలకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలనూ తీసుకోండి. ఆరు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధినీ సిద్ధం చేసుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.8వేలలో రూ.3వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.


క్రమానుగతంగా బంగారాన్ని జమ చేయాలనేది ఆలోచన. దీనికోసం నెలకు రూ.20వేల వరకూ కేటాయించగలను. దీనికోసం పెట్టుబడి ఎలా ఉండాలి?

- దయాకర్‌

మీరు మదుపు చేసిన మొత్తంతో బంగారాన్ని కొనాలనేది మీ లక్ష్యం అయితే గోల్డ్‌ ఈటీఎఫ్‌లు లేదా గోల్డ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. బంగారం ధరలను బట్టి, ఈ పెట్టుబడుల విలువా ఉంటుంది. లేదా ముందు పెట్టుబడి పెట్టి, తర్వాత బంగారం కొనాలనే ఆలోచన ఉంటే.. రూ.5వేల వరకూ గోల్డ్‌ ఫండ్లలోకి మళ్లించండి. మిగతా రూ.15వేలను ఈక్విటీ హైబ్రీడ్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. మీకు అవసరమైనప్పుడు డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. పసిడిని కొనొచ్చు. కనీసం అయిదేళ్లకు మించి మదుపు కొనసాగించడం మేలు.


నా వయసు 49. రెండేళ్ల క్రితం రూ.50లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో తీసుకుంటే ప్రీమియం రూ.3వేల వరకూ తక్కువగా ఉంది. పాత పాలసీని రద్దు చేసుకొని, ఆన్‌లైన్‌ పాలసీని తీసుకోవచ్చా? ఏమైనా ఇబ్బందులు వస్తాయా?

- అరవింద్‌

ఇప్పటికే ఉన్న పాత పాలసీని వెంటనే రద్దు చేసుకోవద్దు. ముందుగా మీరు ఆన్‌లైన్‌లో బీమా పాలసీ తీసుకునేందుకు దరఖాస్తు చేయండి. కొత్త పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్య పరీక్షలు అడిగే అవకాశం ఉంది. ఇందులో అన్నీ సరిగ్గా ఉంటే.. మీకు పాలసీ జారీ అవుతుంది. ఒకే బీమా సంస్థ నుంచి కాకుండా, మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి పాలసీని తీసుకోండి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉంటే.. ప్రీమియం అధికంగా ఉండొచ్చు. కొత్త పాలసీ తీసుకున్న తర్వాతే పాత పాలసీని ముగించండి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని