Published : 06 May 2022 00:41 IST

కష్టార్జితాన్ని కాపాడుకోండి...

ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ... ఆర్జించిన సొమ్మును జాగ్రత్త చేసుకోవటం ఎలా? ఎవరినంటే వారిని నమ్మి, వాళ్ల చేతుల్లో పోయటమా లేక నమ్మకమైన మార్గాల్లో ముందుకు సాగటమా...? కొత్తగా సంపాదనపరులైన వారికి ఎదురయ్యే  సందేహమే ఇది.  ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తాము ఏమేరకు పొదుపు చేయగలం, దాన్ని సురక్షితంగా మంచి ప్రతిఫలం లభించే పథకాల్లో ఏ విధంగా మదుపు చేయాలి...? అనేది ఆలోచించుకోవాలి. అటువంటి వారు ఈ సూత్రాలు పాటించాలి.

టర్మ్‌ పాలసీతో: అన్నింటికంటే ముందుగా మీకు జీవిత బీమా ఎంతో అవసరం. మీరు సంపాదన పరులు కాబట్టి మీమీద ఆధారపడిన కుటుంబానికి అనుకోని ఉపద్రవం ఎదురుకాకుండా భరోసా కావాలి. అందువల్ల ఒక టర్మ్‌ పాలసీ తప్పనిసరి. వార్షికాదాయానికి 10 నుంచి 12 రెట్లు మొత్తానికి సమానమైన టర్మ్‌ పాలసీ తీసుకోవాలి.  

ఆన్‌లైన్‌ మోసాల బారిన పడొద్దు: ఇ-మెయిల్‌ ఆధారంగా మీకో పెద్ద లాటరీ తగిలింది. ప్రాసెసింగ్‌ ఖర్చుల కింద ఒక రూ50,000 ట్రాన్స్‌ఫర్‌ చేస్తే చాలు,... లాటరీ మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తాం, మీ బ్యాంకు ఖాతా వివరాలు, పాన్‌, ఆధార్‌ నెంబర్లు పంపండి- అనే మెయిల్‌ ఒక రోజు మెయిల్‌ బాక్స్‌లో ప్రత్యక్షమవుతుంది. సహజంగా ఎవరైనా దీనికి ఆశపడిపోతారు. లాటరీ వచ్చిందంటే సంతోషపడనిది ఎవరు. కానీ అదొక పెద్ద ట్రాప్‌, అనేది తెలుసుకోలేకపోతే మొత్తానికే మోసపోతారు. చేతిలో సొమ్ము పోవటంతో పాటు మీ బ్యాంక్‌ ఖాతాను సైతం హ్యాక్‌ చేసి మొత్తం ఊడ్చేసే ప్రమాదం ఉంది. ఇదొక రకమైన ఆన్‌లైన్‌ మోసం మాత్రమే. ఇటువంటి ఎన్నో రకాలైన వలలు విసిరేవారు ఆన్‌లైన్‌లో ఎంతో పెరిగిపోయారు. వీటన్నింటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

అవి మోసపూరిత హామీలు: తెల్లారే సరికి మీ సొమ్ము రెట్టింపు చేస్తాం, లేదా ఏడాదిలో నాలుగైదు రెట్లు పెరుగుతుంది, మా పథకాల్లో పెట్టుబడి పెట్టండి- అని మోసపూరితమైన హామీలు ఇచ్చేవారు ఎందరో కనిపిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే పదేళ్లకు కానీ రెట్టింపు కావటం లేదు, ఇదేదో బాగానే ఉండే అని ఆశపడ్డారా మీ సొమ్ముకు రెక్కలొచ్చినట్లే. డబ్బు వాళ్ల చేతుల్లో పెట్టి దాన్ని తిరిగి వసూలు చేసుకోవటానికి చెప్పులు అరిగిపోయే విధంగా తిరగాల్సి వస్తుంది. డబ్బు విషయంలో సహజ సిద్ధమైన ప్రతిఫలానికి భిన్నంగా నాలుగు రెట్లు ఇస్తాం, అయిదు రెట్లు ఇస్తాం- అంటూ ఇచ్చే హామీలను విశ్వసించవద్దు.

నమ్మకమైన పథకాల్లో: బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చే పథకాలు అరుదుగా ఉంటాయి. అటువంటి వాటిని ఒకటికి రెండుసార్లు పరిశీలించి, నమ్మకమైనవేనని నిర్ధారించుకున్న తర్వాతే  పెట్టుబడి పెట్టాలి. లేని పక్షంలో బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు పథకాలు మేలు. కొన్ని అగ్రశ్రేణి ప్రైవేటు రంగ సంస్థల డిపాజిట్‌ పథకాలనూ పరిశీలించవచ్చు.

అత్యవసర పరిస్థితుల కోసం...: జీవితంలో అనుకున్నదేదీ జరగదు. ఆశ్చర్యాన్ని కలిగించే, అనుకోని సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో డబ్బు కోసం వాళ్ల మీద, వీళ్ల మీద ఆధారపడలేని పరిస్థితి. అందువల్ల ఆకస్మిక అవసరాల కోసం ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే చేతిలో ఎల్లప్పుడూ కొంత నగదు పెట్టుకోవాలి. దాన్ని వాడితే వీలైనంత వెంటనే భర్తీ చేయాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని