Published : 13 May 2022 06:36 IST

పదవీ విరమణ.. ఆర్థిక ఇబ్బందులకు దూరంగా..

పదవీ విరమణ.. రోజువారీ పని ఒత్తిళ్లకు దూరంగా ఉన్నప్పటికీ.. మలి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆర్థికపరమైన సవాళ్లను తీసుకొస్తాయి. ఆర్జించే వయసులో చేసిన చిన్న పొరపాట్లే ఇప్పుడు ఎంతో ఖరీదైనవిగా కనిపిస్తుంటాయి. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా... విశ్రాంత జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

దాదాపు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం అనంతరం చాలామందికి కొన్ని ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. నేను తగినంత పొదుపు చేశానా? నా దగ్గరున్న డబ్బు అయిపోతే నా పరిస్థితి ఏమిటి? పదవీ విరమణ ప్రయోజనాలను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? సురక్షిత పథకాల్లోనా... అధిక రాబడి వచ్చే వాటిల్లోనా? నా దగ్గరున్న డబ్బును వారసులకు ఎలా ఇవ్వాలి? కొన్ని రోజులు ఏదైనా ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది.. ఇలా ఎన్నో సందేహాలు సహజమే. వీటన్నింటికీ సమాధానాలు వ్యక్తులు, వారు ఇప్పటి వరకూ పాటించిన ఆర్థిక క్రమశిక్షణను బట్టి మారుతూ ఉంటాయి. కానీ, కొన్ని విషయాలు మాత్రం అందరికీ వర్తిస్తాయి. 

మీ విలువ ఎంత?

కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ముందుగా మీ నికర విలువ ఎంత అనేది గణించుకోవాలి. అందుకోసం మీరు సంపాదించిన ప్రతి రూపాయినీ లెక్కలోకి తీసుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టిన షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, జీవిత బీమా పాలసీలు, స్థిరాస్తులు, డిపాజిట్లు, చేతిలో ఉన్న నగదు ఇలా ఆర్థిక వివరాలన్నీ ఒక చోట రాయండి. వీటితోపాటు మీకున్న బాధ్యతలు, బరువులనూ మరోవైపు రాసి పెట్టుకోండి. ఇవేకాకుండా.. మీకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాలు.. అంటే పింఛను, అద్దె, యాన్యుటీ ప్లాన్ల ద్వారా లభించే మొత్తం ఎంత అనేదీ చూసుకోండి. ఇవన్నీ ఒక చోటకు తీసుకొచ్చినప్పుడు మీ నికర విలువ ఎంత అనేది సులభంగా తెలుస్తుంది. ఆస్తులకన్నా.. బాధ్యతలు చాలా తక్కువగా ఉండి, కావాల్సినంత ఆదాయం లభిస్తూ ఉన్నప్పుడే మీ విశ్రాంత జీవితం మీరు అనుకున్నట్లు గడుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా..

తొందర వద్దు..

పదవీ విరమణ చేయగానే చాలామంది తమ దగ్గరున్న మొత్తాలను ఏదో ఒక పథకంలో మదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. రాబోయే 15-20 సంవత్సరాల్లో మీకుండే అవసరాలను ముందుగా చూసుకోవాలి. స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక అవసరాలను బట్టి, పెట్టుబడి పథకాల ఎంపిక ఉండాలి. పదవీ విరమణ తర్వాత నష్టభయం అధికంగా ఉండే పెట్టుబడుల జోలికి వెళ్లకూడదు అని చెబుతుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. 15 ఏళ్ల తర్వాత అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నష్టభయం ఉన్నప్పటికీ ఈక్విటీ లేదా హైబ్రీడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం వల్ల అధిక రాబడిని అందుకునేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మీ దగ్గరున్న మొత్తంలో 25 శాతం వరకూ వీటికి కేటాయించేందుకు ప్రయత్నించవచ్చు. మార్కెట్లో దీర్ఘకాలం మాత్రమే మదుపు చేయాలి. కొంటూ, అమ్ముతూ ఉండాలనే ఆలోచన రానీయకండి. దీనివల్ల మీ దగ్గరున్న మొత్తం హరించుకుపోవచ్చు. ఈక్విటీలకు కేటాయించే మొత్తాన్ని కనీసం రెండేళ్లపాటు క్రమానుగత బదిలీ విధానంలో మార్కెట్లోకి మళ్లించాలి. సురక్షిత పథకాల్లో వచ్చే రాబడి 7-8 శాతం వరకూ ఉంటుంది. మార్కెట్‌ ఆధారిత పథకాల్లో కనీసం 10 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. అదనంగా వచ్చే లాభంతో మలి జీవితంలో ఎన్నో అవసరాలు తీరతాయి.

సరైన ప్రణాళికతో..

ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరుగుతున్న సంగతి మీకు తెలియంది కాదు. కాబట్టి, ఖర్చులను తట్టుకునేలా మీ నగదు ప్రవాహం ఉండాలి. వృథా ఖర్చులు ఏ వయసులోనైనా చేసే అవకాశం ఉంది. మలి వయసులో వీటికి కట్టడి వేసేందుకు గట్టిగానే ప్రయత్నించాలి. ప్రతి అవసరమూ అత్యవసరమే కానక్కర్లేదు. ఏడాదికోసారి విహార యాత్ర, ఇతర ఆహ్లాదకరమైన పనులు, పిల్లలకు బహుమతులు ఇలా ఏడాది చివరి నాటికి కొన్ని ఖర్చులు ఉంటాయి. ఈ అవసరాలు తీరేలా నగదు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. 

ధీమా ఉండాల్సిందే..

పెరుగుతున్న వైద్య ఖర్చులు తట్టుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీ అవసరం. 60 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య బీమా పాలసీ ఖరీదే. ఇప్పటికే వ్యాధులు ఉంటే బీమా సంస్థ విచక్షణ మేరకు పాలసీ లభిస్తుంది. ఆరోగ్య బీమా ఉంటే దాన్ని కొనసాగించడమే మేలు. కొత్త పాలసీ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్‌ కాకుండా.. దంపతులిద్దరూ విడివిడిగా పాలసీని ఎంచుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది. పాలసీ ఉన్నా.. కనీసం రూ.5లక్షల వరకూ ఆరోగ్య అత్యవసర నిధిని నిర్వహించాలి. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని