భారం తగ్గి.. రాబడి పెరిగేలా...

ద్రవ్యోల్బణంతో పోలిస్తే పెట్టుబడి పథకాలపై వస్తున్న రాబడి అంతంత మాత్రంగానే ఉంటోంది. దీనికి తోడు పన్ను చెల్లించాల్సి రావడం ఒక ప్రతికూల అంశం. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కాస్త అధిక

Published : 13 May 2022 04:55 IST

ద్రవ్యోల్బణంతో పోలిస్తే పెట్టుబడి పథకాలపై వస్తున్న రాబడి అంతంత మాత్రంగానే ఉంటోంది. దీనికి తోడు పన్ను చెల్లించాల్సి రావడం ఒక ప్రతికూల అంశం. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కాస్త అధిక రాబడి ఆర్జించడంతోపాటు, పన్ను భారం తగ్గించుకునేందుకు ఏం చేయాలో చూద్దామా..

పెట్టుబడి పథకాలను ఎంచుకునేటప్పుడు చాలామంది వడ్డీ రేట్లను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. కానీ, ఆ రాబడిపై పన్ను భారం ఎలా ఉంటుందన్నది గమనించరు. వచ్చిన వడ్డీని వ్యక్తిగత ఆదాయంలో కలిపి వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో నికరంగా వచ్చే మొత్తం తగ్గిపోతుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే మీ పన్ను ప్రణాళిక ప్రారంభం కావాలి. అప్పుడే గరిష్ఠ ప్రయోజనాన్ని పొందగలరు. ముఖ్యంగా పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో వీలైనంత తొందరగా పెట్టుబడులు ప్రారంభించాలి. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనే మదుపు చేయాలనుకునే వారు.. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వచ్చిన వడ్డీపై పన్ను భారం తగ్గించుకునేందుకు వీలవుతుంది.

* ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆదాయం ఆర్జించే వ్యక్తి పేరుతో కాకుండా.. ఎలాంటి ఆదాయం లేని వారి పేరిట వేయడం వల్ల పన్ను భారం తగ్గుతుంది. జీవిత భాగస్వామి పేరుమీద లేదా తల్లిదండ్రుల పేరుమీద ఈ డిపాజిట్లను ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులు సీనియర్‌ సిటిజన్లయితే.. వారికి రూ.3లక్షల వరకూ ఎలాంటి పన్ను ఉండదు. పైగా వీరికి అరశాతం వడ్డీ అధికంగా లభిస్తుంది. జీవిత భాగస్వామి 60 ఏళ్లలోపు ఉన్నా రూ.2,50,000 వరకూ మినహాయింపు వర్తిస్తుంది. కాబట్టి, వీరి పేరుతో డిపాజిట్లు ప్రారంభించి, అవసరాన్ని బట్టి, ఫారం 15జీ లేదా 15హెచ్‌ను సమర్పించాలి. దీనివల్ల మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌)ను నివారించవచ్చు.

* 18 ఏళ్లు దాటిన పిల్లల పేరిటా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలను ప్రారంభించే అవకాశమూ ఉంది. 18 ఏళ్లు దాటిన మేజర్లకు పాన్‌ కార్డు, బ్యాంకు ఖాతా, డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. వీరు షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలోనూ మదుపు చేయొచ్చు. మీరు వారికి బహుమతిగా కొంత డబ్బును అందించి, వాటిని ఈ పెట్టుబడులకు కేటాయించేలా ప్రోత్సహించవచ్చు. వీరికి ఆదాయం ఉండదు కాబట్టి, రూ.2,50,000 వరకూ వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. చిన్న వయసు నుంచే మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమూ మంచిదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని