Published : 13 May 2022 05:00 IST

దీర్ఘకాలం తోడుగా..

పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించి, దీర్ఘకాలం పాటు కచ్చితమైన రాబడిని అందుకునేలా వినూత్న పాలసీని ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు స్మార్ట్‌ ప్లాటినా ప్లస్‌. పాలసీ తీసుకునేటప్పుడే.. ఏటా ఎంత చెల్లిస్తారు, వ్యవధి తీరిన తర్వాత ఎంత వస్తుందనే వివరాలు తెలియజేస్తుంది. ప్రీమియం ఎన్నేళ్లు చెల్లించాలి, తర్వాత క్రమం తప్పకుండా ఎన్నాళ్లపాటు చెల్లింపులు ఉండాలి అనేది పాలసీదారుడు నిర్ణయించుకునే వీలుంది. ప్రీమియం చెల్లింపు 7/8/10 ఏళ్ల పాటు ఉంటుంది. 

ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి రూ.లక్ష చొప్పున 10 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించేలా పాలసీని ఎంపిక చేసుకున్నారనుకుందాం. అప్పుడు ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తరువాత ఏడాది వేచి ఉండే సమయం ఉంటుంది. ఇది ముగిసిన మరుసటి ఏడాది నుంచి పాలసీదారుడికి 25 ఏళ్లపాటు ఏటా క్రమం తప్పకుండా రూ.92,030 (పే అవుట్‌) అందుతుంది. పాలసీ వ్యవధి తీరిన తర్వాత చెల్లించిన వార్షిక ప్రీమియానికి 110 శాతం అంటే.. రూ.11 లక్షలు చెల్లిస్తారు. ఈ చెల్లింపులన్నీ సెక్షన్‌ 10(10)డి ప్రకారం పన్ను మినహాయింపుతో ఉంటాయి. పాలసీ కొనసాగుతున్నప్పుడు, పే అవుట్‌ సమయంలోనూ పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. నామినీకి 11 రెట్ల వరకూ బీమా పరిహారం అందుతుంది. ఈ పాలసీలో స్వాధీన విలువ, పాలసీ రివైవల్‌ వంటి ప్రయోజనాలూ ఉన్నాయి. కనీసం 30 రోజుల వయసున్న వారి నుంచి గరిష్ఠ వయసు 60 ఏళ్ల వరకూ ఈ పాలసీని ఎంచుకోవచ్చు 

పెట్టుబడి వృద్ధికి తోడ్పడేలా..

జీవిత బీమా రక్షణతోపాటు, పెట్టుబడి వృద్ధికి తోడ్పడే పాలసీని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది. ఈ యూనిట్‌ ఆధారిత పాలసీ మ్యాక్స్‌ లైఫ్‌ ఫ్లెక్సీ వెల్త్‌ అడ్వాంటేజ్‌ ప్లాన్‌ పాలసీదారుల వివిధ అవసరాలను తీర్చే విధంగా రూపొందించారు. పాలసీదారుడు అపరిమితంగా ఒక ఫండ్‌ నుంచి మరో ఫండ్‌కు మారే వెసులుబాటునూ కల్పిస్తోంది ఈ పాలసీ. వసూలు చేసిన ఛార్జీలను వెనక్కి ఇచ్చి ఫండ్‌ విలువకు జోడిస్తుంది. ఎంపిక చేసిన 11 ఫండ్ల నుంచి 5 రకాల పెట్టుబడి వ్యూహాల ద్వారా మదుపు కొనసాగించవచ్చు. జీవితాంతం వరకూ బీమా రక్షణ కల్పించేందుకు వీలుగా లైఫ్‌ కవర్, వెల్త్‌ యాక్సిలరేషన్‌ ఆప్షన్లనూ ఎంపిక చేసుకోవచ్చు. చెల్లించిన ప్రీమియానికి ఎన్ని రెట్ల వరకూ జీవిత బీమా రక్షణ కావాలన్నది పాలసీదారుడు నిర్ణయించుకునే వీలుంది. పాలసీదారుడు తన అవసరాన్ని బట్టి, ఫండ్‌ విలువలో నుంచి క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పాలసీ వ్యవధిలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే ఆ తరువాత పాలసీ కొనసాగేందుకు ప్రీమియం వైవర్‌ బెనిఫిట్‌ రైడర్‌ను ఎంచుకోవచ్చు. పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం పాలసీని ఎంపిక చేసుకునే వారికి ఇది అవసరం. జీవితంలో అనుకున్న ఆర్థిక లక్ష్యాల సాధనకు, దీర్ఘకాలిక పెట్టుబడికి దీన్ని పరిశీలించవచ్చు. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts