EMI: ఈఎంఐ భారం సర్దుబాటు చేసుకోండిలా...

రెపో రేటు పెరగడంతో రుణాలపై వడ్డీ భారం మొదలైంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆరు శాతం మేరకు ఉండటంతో రేట్ల పెంపు ఊహించిన పరిణామమే అయినప్పటికీ.. సామాన్యులకు ఇది భారంగానే మారింది. ఈ తప్పనిసరి పరిస్థితులకు రుణగ్రహీతలు సిద్ధంగా ఉండాల్సిందే. దీనికి అనుగుణంగా పొదుపు, పెట్టుబడి ప్రణాళికలను సర్దుబాటు చేసుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Updated : 20 May 2022 11:07 IST

రెపో రేటు పెరగడంతో రుణాలపై వడ్డీ భారం మొదలైంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆరు శాతం మేరకు ఉండటంతో రేట్ల పెంపు ఊహించిన పరిణామమే అయినప్పటికీ.. సామాన్యులకు ఇది భారంగానే మారింది. ఈ తప్పనిసరి పరిస్థితులకు రుణగ్రహీతలు సిద్ధంగా ఉండాల్సిందే. దీనికి అనుగుణంగా పొదుపు, పెట్టుబడి ప్రణాళికలను సర్దుబాటు చేసుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

చాలా నెలల తరువాత వడ్డీ రేట్లలో కదలిక వచ్చింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు ఇది కొంత ఆశాజనకమే అయినా.. వివిధ రకాల రుణగ్రహీతలకు ఇది కాస్త కష్టం కలిగించే విషయమే. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉండటం, ఇతర ఖర్చులూ తడిసి మోపెడవుతుండటం అందరినీ కలవర పెడుతోంది. ఇప్పుడు వడ్డీ పెంపుతో ఈఎంఐలూ భారం కానున్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో లేకపోతే.. రెపోలో మరోసారి మార్పు తప్పకపోవచ్చు అనే సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి.

ఖర్చుల నియంత్రణ..

వడ్డీ పెంపు ప్రభావం ఈఎంఐలమీద ఉంటుంది. కాబట్టి, మీ జేబు నుంచి కొంత అదనపు డబ్బును దీనికోసం కేటాయించాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని, అనవసర ఖర్చులపై నియంత్రణ కచ్చితంగా ఉండాలి. ప్రతి రూపాయీ నిజమైన అవసరం కోసమే ఖర్చు చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. రూ.100 మిగిలినా అది ఈఎంఐ ఖాతాలోకి   మళ్లించేలా చూసుకోవాలి.

పాక్షిక చెల్లింపుతో..

సాధారణంగా బ్యాంకులు ఈఎంఐ పెంచే బదులు రుణ కాలపరిమితిని పొడిగిస్తాయి. కాబట్టి, నెలవారీ బడ్జెట్‌కు ఇప్పటికిప్పుడు ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. కానీ, వ్యవధి పెరిగితే.. వడ్డీ భారం ఆ మేరకు పెరుగుతుందని మర్చిపోవద్దు. కాబట్టి, వ్యూహాత్మకంగా సర్దుబాటు చేయగలిగితే.. ఈఎంఐని పెంచాలని బ్యాంకులకు సూచించవచ్చు.

వ్యవధి పెంచుకున్నప్పుడు ఏడాదికోసారి అదనపు ఈఎంఐ చెల్లించడం ద్వారా వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. బోనస్‌లు, పన్ను రిఫండుల్లాంటివి లేదా ఖర్చుల్లో మిగులు మొత్తాన్ని దీనికి సర్దుబాటు చేయొచ్చు. దీనివల్ల మీ రుణం తొందరగా తీరుతుంది.

బదిలీ చేసుకుంటే..

ఈఎంఐ భారం మీ శక్తికి మించి పెరుగుతున్నట్లు అనిపిస్తే.. బ్యాంకును సంప్రదించి, మీ రుణాన్ని పునర్‌వ్యవస్థీకరణ చేసుకోవచ్చు. దీనిద్వారా మీ చెల్లింపు సామర్థ్యం ఆధారంగా బ్యాంకు కొత్త ఈఎంఐని నిర్ణయిస్తుంది. ఇది కుదరకపోతే.. తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల భారం తగ్గుతుంది.

వ్యూహాత్మక పెట్టుబడితో...

భవిష్యత్‌లో వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనా ఉంది. అందువల్ల ఈ రోజు నుంచే ఆ పెంపు మొదలయ్యిందని భావించి, ఆ మేరకు సొమ్మును పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి. ఉదాహరణకు మీ గృహరుణంపై వడ్డీ 6.5 శాతం ఉందనుకుందాం. ఇది 6.9 శాతానికి చేరుకుంటుందని భావిస్తే.. ఆ అదనపు 0.4 శాతం కోసం అవసరమయ్యే మొత్తాన్ని స్వల్పకాలిక డెట్‌ ఫండ్లలో సిప్‌ ద్వారా మదుపు చేయాలి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఈ డబ్బును వినియోగించుకోవచ్చు. లేదా.. మీ పెట్టుబడి అలాగే ఉండి.. భవిష్యత్తులో ఖర్చులకు ఉపయోగపడుతుంది.

మిగులు మొత్తంతో..

మీ గృహరుణానికి అనుసంధానమైన పొదుపు ఖాతాలో సాధారణ నిల్వకన్నా అధిక మొత్తం జమ చేయొచ్చు. దీన్ని గృహరుణం అసలు మొత్తం నుంచి మినహాయించి, మిగిలిన మొత్తానికే వడ్డీని లెక్కిస్తాయి బ్యాంకులు. దీన్ని హోమ్‌లోన్‌ సేవర్‌ ఖాతాగా పిలుస్తారు. ఈ ఖాతాలో ఉన్న మొత్తాన్ని బట్టి, మీ రుణంపై ఆ మేరకు వడ్డీ భారం తగ్గుతుంది. ఇది పొదుపు ఖాతాలాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు, వడ్డీని ఆదా చేస్తూ ఆర్థిక క్రమశిక్షణనూ నేర్పుతుంది. మీ బ్యాంకు ఈ వెసులుబాటు కల్పిస్తుందా లేదా అనేది పరిశీలించండి.

అధిక వడ్డీ అప్పులు..

ఒకటికి మించి రుణాలు ఉన్నప్పుడు వాటి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. మీ అప్పులను తొందరగా తీర్చుకునే వ్యూహాలు ఏమున్నాయో ఆలోచించాలి. సాధ్యమైనంత వరకూ అధిక వడ్డీ ఉన్న అప్పులను తొందరగా తీర్చేయాలి. క్రెడిట్‌ కార్డు లోన్‌, వాహన రుణం, గృహరుణం ఉన్నాయనుకుందాం.. ఇందులో క్రెడిట్‌ కార్డు రుణానికి అధిక వడ్డీ ఉంటుంది. దీన్ని తొందరగా తీర్చకపోతే.. మీ సంపాదన అంతా వడ్డీకే పోతుంది. దీర్ఘకాల వ్యవధితో అధిక వడ్డీ రుణాన్ని కొనసాగించడం ఎప్పుడూ క్షేమం కాదు. పైగా దీనికి ఒక వాయిదా చెల్లించకపోయినా.. జరిమానా మొత్తం అధికంగానే ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసర నిధి అవసరం ఎంతో ఉంది. కనీసం 3-6 నెలల ఖర్చులు, రుణ వాయిదాలకు సరిపోయే మొత్తాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దీన్ని లిక్విడ్‌ ఫండ్లలో జమ చేసుకోవచ్చు. అదే సమయంలో ఆర్థిక ప్రణాళిక అనే నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. సమర్థమైన ఆర్థిక నిర్వహణ, ఆరోగ్య బీమా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు.. ఎలాంటి ఆర్థిక చిక్కులు వచ్చినా కాపాడేవి ఇవే అని గుర్తుంచుకోవాలి.

- ప్రంజాల్‌ కమ్రా, సీఈఓ, ఫినోలజీ వెంచర్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని