బాండ్లలో మదుపు చేస్తున్నారా?

స్థిరంగా రాబడి అందించే పథకాలను ఎంచుకోవాలనుకునే వారు బాండ్లను పరిశీలిస్తున్నారు. కంపెనీలు తమకు కావాల్సిన పెట్టుబడిని బాండ్ల ద్వారా సమకూర్చుకుంటాయి. చాలామంది ఇవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటివని భావిస్తున్నారు. కానీ, ఈ రెండింటి

Published : 27 May 2022 00:55 IST

స్థిరంగా రాబడి అందించే పథకాలను ఎంచుకోవాలనుకునే వారు బాండ్లను పరిశీలిస్తున్నారు. కంపెనీలు తమకు కావాల్సిన పెట్టుబడిని బాండ్ల ద్వారా సమకూర్చుకుంటాయి. చాలామంది ఇవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటివని భావిస్తున్నారు. కానీ, ఈ రెండింటి మధ్యా ఎంతో తేడా ఉంది. బాండ్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారు దీనిని ప్రధానంగా గమనించాలి. ఇటీవల పలు సంస్థలు బాండ్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో వీటి ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం..

దైనా బాండ్‌లో మదుపు చేయాలనుకుంటున్నప్పుడు ముందుగా గమనించాల్సింది దాని క్రెడిట్‌ రేటింగ్‌. ఒక సంస్థ బాండ్ల ద్వారా డబ్బును సమకూర్చుకోవాలని భావించినప్పుడు, బాండ్లను విడుదల చేస్తుంది. దీనికి ఎలాంటి రేటింగ్‌ ఇవ్వాలనేది థర్డ్‌ పార్టీ సంస్థలు నిర్ణయిస్తాయి. క్రిసిల్‌, ఇక్రా, కేర్‌ తదితర ఏజెన్సీలు బాండ్లకు రేటింగ్‌లను ఇస్తుంటాయి. ‘ఏఏఏ’ అత్యధిక రేటింగ్‌కాగా, ‘డి’ అత్యంత తక్కువ రేటింగ్‌. ‘డి’ అంటే డిఫాల్ట్‌ అనే అర్థంలోనూ చూడొచ్చు. ఈ రేటింగ్‌ ఉన్న బాండ్ల జోలికి అస్సలు వెళ్లకూడదు.

ప్రభుత్వం విడుదల చేసే బాండ్లకు ‘సావరిన్‌’ రేటింగ్‌ ఉంటుంది. అంటే, ఇవి ఎలాంటి నష్టభయం లేని బాండ్లు. ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి, ఇవి ‘ఏఏఏ’ రేటింగ్‌ ఉన్న బాండ్లకన్నా నమ్మకమైనవి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అత్యధిక రేటింగ్‌ ఉన్న బాండ్లు తక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. తక్కువ రేటింగ్‌ ఉంటే.. అధిక వడ్డీ రేటు వస్తుంది.

బాండ్లన్నీ నిర్ణీత వ్యవధితో అందుబాటులో ఉంటాయి. కొన్ని సంస్థలు తమ బాండ్లను వ్యవధికి ముందే బాండ్లను తిరిగి కొంటామని ప్రకటిస్తుంటాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు సంస్థలు తాము జారీ చేసిన బాండ్లను వెనక్కి తీసుకొని, తక్కువ వడ్డీతో కొత్తవి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. దీనివల్ల వడ్డీ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు తక్కువ వడ్డీనిచ్చే బాండ్లను కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. ఇలా మధ్యలోనే కంపెనీలు తిరిగి కొనే వెసులుబాటు ఉన్న బాండ్లలో సాధారణంగా అధిక వడ్డీ ఉంటుంది. వీటిని కాల్‌బాండ్లుగా పిలుస్తుంటారు. కాలావధి తీరేంత వరకూ కొనసాగే బాండ్లను బుల్లెట్‌ బాండ్లుగా పిలుస్తారు.

కొన్ని బాండ్లను మదుపరులు తమకు ఇష్టం వచ్చినప్పుడు సంస్థకు ఇచ్చి, పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. అత్యవసరాల్లో డబ్బు కావాలనుకున్నప్పుడు ఇలాంటి వాటిని పరిశీలించవచ్చు. వీటిలో కాస్త తక్కువ వడ్డీ అందుతుంది.

కొన్నిసార్లు బాండు వ్యవధి తీరే రోజు దగ్గరకు వచ్చినప్పుడు ‘డి’ రేటింగ్‌లోకి వెళ్లే ప్రమాదమూ ఉంది. కాబట్టి, బాండ్లలో మదుపు చేసే వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాబడి రాకపోవడమే కాదు.. కొన్నిసార్లు మొత్తం పెట్టుబడి హరించుకుపోయే అవకాశాలూ ఉన్నాయని స్పష్టంగా తెలుసుకున్నాకే వీటిని ఎంచుకోవాలి. అదే సమయంలో ఒకే వ్యవధి ఉన్న రెండు వేర్వేరు బాండ్లు అందించే వడ్డీ రేట్లలోనూ తేడా ఉంటుంది. ఉదాహరణకు 10 ఏళ్ల వ్యవధి ఉన్న గవర్నమెంట్‌ బాండ్‌ 6.5శాతం వడ్డీని అందించవచ్చు. అదే సమయంలో ఇదే వ్యవధికి కార్పొరేట్‌ బాండ్‌ 7.5శాతం వడ్డీని అందించే వీలుంది. క్రెడిట్‌ రేటింగ్‌ మారడం వల్ల 1 శాతం వ్యత్యాసం కనిపిస్తుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న దశలో.. బాండ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్పొరేట్‌ బాండ్లను ఎంచుకోవాలనుకునే వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని