Updated : 03 Jun 2022 06:03 IST

డిపాజిట్లు..పర్యావరణ హితంగా..

వాతావరణ మార్పు.. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రతల పెరుగుదలను అరికట్టేందుకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హరిత ఉద్యమం నడుస్తోంది. పరిశ్రమలు, వ్యాపారాలు పర్యావరణహిత విధానాలకూ మారుతున్నాయి. పెట్టుబడిదారులూ కర్బన రహిత వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌ డిపాజిట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వీటి గురించి తెలుసుకుందామా..

పర్యావరణానికి అనుకూలంగా ఉండే కంపెనీలకు పెట్టుబడులు సమకూర్చే లక్ష్యంతో వచ్చినవే గ్రీన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. కాలుష్య నివారణకు తోడ్పడే వ్యాపారాలను ఇవి ప్రోత్సహిస్తాయి. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వంటి ఆర్థిక సంస్థలు పెట్టుబడిదారులకు గ్రీన్‌ డిపాజిట్‌ సేవలను అందిస్తున్నాయి. యునైటెడ్‌ నేషన్స్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (యూఎన్‌ఎస్‌డీజీ)కి మద్దతునిచ్చే ప్రాజెక్టులు, సంస్థలకు రుణాలను ఇచ్చేందుకు ఈ గ్రీన్‌ డిపాజిట్లను ఉపయోగిస్తారు.  

ఏయే రంగాలకు..: గ్రీన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో భాగంగా సమీకరించిన సొమ్మును ఇంధన సామర్థ్యం పెంపు, పునరుత్పాదక శక్తి, హరిత రవాణా, ఆహారం, వ్యవసాయం, అడవులు, వ్యర్థాల నిర్వహణ, కర్బన ఉద్గారాల తగ్గింపు, హరిత భవనాలు ఇలా పర్యావరణానికి మేలు చేసే రంగాలకు ప్రత్యేకిస్తారు. 

అధిక వడ్డీ : సాధారణ డిపాజిట్లతో పోలిస్తే గ్రీన్‌ ఎఫ్‌డీలకు కాస్త అధిక వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం వీటిపై 6.55శాతం వార్షిక రాబడి అందుతోంది. 60 ఏళ్లు దాటిన వారికి రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై 0.25% నుంచి 0.5% వరకూ అదనపు రాబడి పొందే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా గ్రీన్‌ డిపాజిట్‌లో మదుపు చేసినప్పుడు రూ.50లక్షల లోపు డిపాజిట్లపై 0.1శాతం అధిక వడ్డీని చెల్లిస్తున్నాయి. 

అర్హులెవరు: భారతీయ పౌరులు, ఎన్‌ఆర్‌ఐలు, కార్పొరేట్లు, ట్రస్టులు భారతదేశంలో గ్రీన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ప్రారంభించవచ్చు. మైనర్ల పేరిట సంరక్షకులూ పెట్టుబడి పెట్టొచ్చు. భాగస్వామ్య సంస్థలు, సొసైటీలు, క్లబ్‌లు, సంఘాలూ ఈ డిపాజిట్‌ ఖాతాను తెరిచేందుకు వీలుంది. 

వెనక్కి తీసుకుంటే..: ఈ డిపాజిట్లలో పూర్తి కాలం కొనసాగినప్పుడే అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. మొదటి మూడు నెలల్లో హరిత డిపాజిట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు. వ్యక్తిగత పెట్టుబడిదారుడు మూడు నెలల పూర్తయ్యాక.. ఆరు నెలల్లోపు డబ్బును వెనక్కి తీసుకుంటే.. వడ్డీ రేటు 3 శాతంగా నిర్ణయించి చెల్లిస్తారు. మిగతా వారికి ముందస్తు ఉపసంహరణలకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఆరు నెలలు పూర్తయ్యాక ఆర్జించిన వడ్డీపై 1 శాతం అపరాధ రుసుము వర్తిస్తుంది. పాక్షికంగా వెనక్కి తీసుకున్నా.. ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నా.. గ్రీన్‌ డిపాజిట్‌ నుంచి సాధారణ డిపాజిట్‌గా మారుతుంది. 

పెట్టుబడి కోసం: గ్రీన్‌ డిపాజిట్‌ అందిస్తున్న సంస్థల వెబ్‌సైటు లేదా మొబైల్‌ యాప్‌లోకి వెళ్లి గ్రీన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవాలి. పాన్‌ లేదా ఆధార్‌తో కేవైసీని పూర్తి చేసి, మీ పొదుపు ఖాతా నుంచి డబ్బు బదిలీ చేయండి. లేదా ఆయా బ్యాంకుల శాఖలకు వెళ్లి, ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. 

మదుపు చేయొచ్చా?: కాస్త నష్టభయం భరించగలిగి, అధిక రాబడిని ఆశించే వారికివి అంతగా సరిపోవు. సంప్రదాయ పెట్టుబడి దారులు, సీనియర్‌ సిటిజన్లు పెట్టుబడి కోణం నుంచి వీటిని పరిశీలించచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న మొత్తంలో 1 శాతం వరకూ ఈ డిపాజిట్లకు కేటాయించే ప్రయత్నం చేయొచ్చు. గ్రీన్‌ డిపాజిట్ల లక్ష్యం పెట్టుబడిపై అధిక రాబడిని ఆర్జించడమే కాదు. పర్యావరణానికి మేలు చేయడమూ ఇక్కడ ప్రధాన లక్ష్యం. దీనిపై ఆసక్తి ఉన్నవారూ వీటిని ఎంచుకోవచ్చు.

డిపాజిట్‌ బీమా: సాధారణ ఎఫ్‌డీల మాదిరిగానే.. రూ.5లక్షల లోపున్న హరిత డిపాజిట్లకు.. డిపాజిటరీ ఇన్సూరెన్స్‌ రక్షణ ఉంటుంది. 

వ్యవధి: ఈ డిపాజిట్లలో పెట్టుబడి కనీసం 18 నెలల పాటు కొనసాగించాలి. గరిష్ఠంగా 10 ఏళ్ల వ్యవధి వరకూ కొనసాగించవచ్చు. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని