అప్పు చేసి మదుపు వద్దు

ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాం. గృహరుణం రూ.27 లక్షల వరకూ వస్తోంది. నాకు రూ.20 లక్షలు చాలు. మొత్తం రుణం తీసుకొని, మిగతా రూ.7 లక్షలను ఎక్కడైనా మదుపు చేస్తే లాభమేనా..  

Updated : 03 Jun 2022 07:30 IST

ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాం. గృహరుణం రూ.27 లక్షల వరకూ వస్తోంది. నాకు రూ.20 లక్షలు చాలు. మొత్తం రుణం తీసుకొని, మిగతా రూ.7 లక్షలను ఎక్కడైనా మదుపు చేస్తే లాభమేనా?  

- శంకర్‌

పెట్టుబడుల కోసం సొంత డబ్బును మాత్రమే వినియోగించాలి. అప్పు చేసి మదుపు చేయడం ప్రమాదకరం. ప్రస్తుతం మన దేశంలో గృహరుణాలు 6-7 శాతం మధ్య ఉన్నాయి. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీ పెట్టుబడులు మీరు చెల్లించే వడ్డీకి మించి రాబడిని ఆర్జించాలి. అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, ముందుగా మీరు రూ.20లక్షల రుణానికి ఎంత ఈఎంఐ చెల్లించాలో చూడండి. రూ.27 లక్షల రుణం తీసుకుంటే వాయిదా మొత్తం ఎంతో తెలుసుకోండి. రుణం రూ.20లక్షలు తీసుకోండి. రూ.27 లక్షలకు ఈఎంఐ చెల్లిస్తున్నట్లుగా భావించి, ఆ వ్యత్యాసాన్ని పెట్టుబడులకు మళ్లించండి.


మరో రెండేళ్లలో పదవీ విరమణ చేస్తాను. ఆ తరువాత నుంచి నాకు నెలకు రూ.20వేలు పింఛను వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలనేది ఆలోచన. దీనికోసం నేను ఎంత మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. నేను పనిచేస్తున్న సంస్థ ఆరోగ్య బీమాను అందిస్తోంది. సొంతంగా మరో పాలసీ తీసుకోవాలా?     

- మోహన్‌రావు

నెలకు రూ.20వేలు పింఛను రూపంలో రావాలంటే.. ఈ రెండేళ్లలో మీరు రూ.34,30,000 వరకూ జమ చేయాలి. అప్పుడు కనీసం 7 శాతం రాబడి ఆర్జించే పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తే.. మీరనుకుంటున్న మొత్తం సులభంగా చేతికందుతుంది. పదవీ విరమణ చేసిన అనంతరం యాజమాన్యం ఇచ్చే ఆరోగ్య బీమా కొనసాగకపోవచ్చు. కాబట్టి, మీరు ఇప్పుడే సొంతంగా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం మేలు. బీమా దరఖాస్తు పత్రంలో మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే తెలియజేయండి. అవసరమైతే వైద్య పరీక్షలూ చేయించుకోండి.


నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. మా అమ్మాయి వయసు 14. మరో 10 ఏళ్లకు ఈ డబ్బు తన అవసరాలకు ఉపయోగపడాలి. ఎలాంటి పెట్టుబడి పథకాలు ఎంచుకోవాలి?

 - శ్రీసౌమ్య

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం కుటుంబ పెద్ద పేరుమీద తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. నెలకు రూ.10వేల చొప్పున 10 ఏళ్లపాటు మదుపు చేస్తే.. సగటున 12 శాతం రాబడి అంచనాతో.. రూ.21,05,848 అయ్యేందుకు అవకాశం ఉంది. డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకొని, మదుపు కొనసాగించండి.


ఆదాయపు పన్ను మినహాయింపు కోసం జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏడాదికి రూ.50వేల వరకూ ప్రీమియం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది?

- సంతోశ్‌

వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండాలి. దీనికోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవచ్చు. దీనికి ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీరు చెల్లించే ప్రీమియానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.50వేలలో టర్మ్‌ పాలసీకి ప్రీమియం చెల్లించాక మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మదుపు చేయొచ్చు. ఈ పెట్టుబడులకూ సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు మినహాయింపు పొందవచ్చు. వీటికి మూడేళ్ల లాకిన్‌ ఉంటుంది. నష్టభయం ఉన్నప్పటికీ.. కాస్త అధిక రాబడికి అవకాశముంది.


మూడేళ్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. మధ్యలో మంచి లాభాలు వచ్చినా..  ప్రస్తుతం నేను పెట్టిన పెట్టుబడి మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు ఫండ్లలో నుంచి డబ్బు వెనక్కి తీసుకోవాలా? లాభాలు రావాలంటే ఎన్నాళ్లు చూడాలి?

- రాధాకృష్ణ 

ఈక్విటీ పెట్టుబడుల్లో పెట్టిన మొత్తం వృద్ధి చెందాలంటే.. కనీసం 5-7 ఏళ్లపాటు వేచి చూడాలి. మీరు మదుపు ప్రారంభించి మూడేళ్లే అయ్యింది. కాబట్టి, వాటిని కొనసాగిస్తూనే ఉండండి. ఒకసారి మీ ఫండ్ల పనితీరును పరిశీలించండి. బాగుంటే అవే ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. లేదా మార్చుకునేందుకు ప్రయత్నించండి. 

 - తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని