బీమా పాలసీలు.. ఆ సందేశాలతో జాగ్రత్త

అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేది జీవిత బీమా పాలసీ. చాలామంది దీన్ని పెట్టుబడి సాధనంగానూ, పన్ను మినహాయింపు కల్పించే పథకంగానూ చూస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని, పాలసీదారులను మోసం చేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం

Updated : 10 Jun 2022 07:11 IST

అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేది జీవిత బీమా పాలసీ. చాలామంది దీన్ని పెట్టుబడి సాధనంగానూ, పన్ను మినహాయింపు కల్పించే పథకంగానూ చూస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని, పాలసీదారులను మోసం చేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. మొబైల్‌ ఫోను లేదా ఇ-మెయిల్‌కు వచ్చే సందేశాలను నమ్మి, లింకులపై క్లిక్‌ చేయడం, లేదా ఎవరో చెప్పారని ఏమాత్రం సందేహించకుండా అడిగినంత చెల్లించేయడం లాంటివి ఎప్పుడూ సరికాదు.

బీమా పాలసీలను ఎంచుకునేటప్పుడు అవి మనకు ఎంత మేరకు ఉపయోగపడతాయనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. పూర్తి రక్షణకా.. పెట్టుబడి కోసమా..పదవీ విరమణ అనంతరం ఉపయోగపడుతుందా అనే అంశాలపై అవగాహన ఉండాలి. సాధారణంగా మనకు వచ్చే సందేశాలు ఎలా ఉంటాయి.. వాటిలోని నిజాలేమిటో చూద్దాం...

సందేశం: ‘ఏడాదికి రూ.1,60,000 చొప్పున 12 ఏళ్లు చెల్లించండి. వ్యవధి తీరాక రూ.కోటి మీ సొంతం. రూ.35 లక్షల బీమా రక్షణా ఉంటుంది’.

వాస్తవం: ఏడాదికి రూ.1,60,000 చొప్పున 12 ఏళ్లపాటు చెల్లిస్తే.. రూ.19.2లక్షలు అవుతుంది. ఈ మొత్తంతో రూ. కోటి పొందాలంటే.. దాదాపు 23.86 శాతం రాబడిని అందుకోవాలి. సాధారణంగా సంప్రదాయ జీవిత బీమా పాలసీలు ప్రీమియం మొత్తంలో నుంచి కమీషన్‌ చెల్లింపులు, ఇతర ఖర్చులను మినహాయించి, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర సురక్షిత పథకాల్లో మదుపు చేస్తాయి. వీటిల్లో మదుపు చేసినప్పుడు వచ్చే సగటు రాబడి 6 శాతం వరకూ ఉంటుంది. అంటే, పాలసీ వ్యవధి 35 ఏళ్లు ఉన్నప్పుడు మాత్రమే రూ. కోటి చెల్లించేందుకు సాధ్యం అవుతుంది. బీమా పాలసీ డాక్యుమెంట్లో ఇది పేర్కొంటారు. కేవలం సందేశాన్ని నమ్మి పెట్టుబడి పెట్టకుండా.. పాలసీ నిబంధనలు స్పష్టంగా తెలుసుకున్నప్పుడే ఈ విషయం తెలుస్తుంది.

సందేశం: ‘రోజుకు రూ.11తో రూ.కోటి బీమా...’

వాస్తవం: టర్మ్‌ పాలసీకి సాధారణంగా తక్కువ ప్రీమియం ఉంటుంది. అందరికీ ఇదే సూత్రం వర్తించదు. రోజుకు రూ.11 అంటే.. వార్షిక ప్రీమియం రూ.4వేల వరకూ ఉంటుంది. 22-24 ఏళ్ల మధ్య ఉన్నవారికీ, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకే ఇది వర్తిస్తుందని నిబంధనలు ఉంటాయి. బీమా సంస్థలు మీ వయసు, ఆరోగ్య సమస్యల ఆధారంగా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. మరీ తక్కువ ప్రీమియానికి  రూ. కోటి బీమా అందిస్తున్నామంటే కాస్త సందేహించాల్సిందే. క్లెయిం చెల్లింపుల తీరు సరిగా ఉందా చూసుకోవాలి. టర్మ్‌ పాలసీ తీసుకునేటప్పుడు చిన్న అజాగ్రత్త కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ఆ పాలసీ మొత్తం దక్కకుండా చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని