ఆ సంఖ్య తెలిస్తే చాలా?

నగదు రహిత చెల్లింపుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టింది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌). రూ.10వేల వరకూ నగదును ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా

Updated : 17 Aug 2022 11:17 IST

నగదు రహిత చెల్లింపుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టింది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌). రూ.10వేల వరకూ నగదును ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా తీసుకునేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) చేసిన ఏర్పాటు ఇది. బ్యాంకింగ్‌ సేవలు పూర్తిగా అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆధార్‌ ఆధారంగా చెల్లింపులను పూర్తి చేసేందుకు, నగదు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. పీఓస్‌, మైక్రో ఏటీఎం, బ్యాంకు మిత్ర తదితరాల నుంచి ఆధార్‌ను అధీకృతం చేయడం ద్వారా డబ్బును తీసుకునే వీలుంది.
బ్యాంకు ఖాతా నెంబరు తెలిసినంత మాత్రాన డబ్బును తీసుకోలేం. డెబిట్‌ కార్డు, పిన్‌ అవసరం. అలాగే ఆధార్‌ సంఖ్య తెలుసుకున్నంత మాత్రాన మోసగాళ్లు ఆధార్‌ అనుసంధానమైన ఖాతా నుంచి డబ్బులు తీసుకోలేరు. ఆధార్‌ సంఖ్య, బ్యాంకు ఖాతా, ఖాతా ఎక్కడుంది లాంటి వివరాలూ అవసరం. అంతేకాకుండా.. ఆధార్‌ను అధీకృతం చేసేందుకు ఓటీపీ, వేలిముద్ర, ఐరిస్‌లాంటివి కావాలి. నగదు తీసుకోవడం, బ్యాలెన్స్‌ తెలుసుకోవడం, మినీ స్టేట్‌మెంట్‌లాంటి సేవలూ పొందేందుకు వీలుంటుంది.
ఇటీవలి కాలంలో ఆధార్‌ను ఉపయోగించి, మోసగాళ్లు నగదు తీసుకున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. మన ఆధార్‌తోపాటు, మొబైల్‌ నెంబరు వేరే వ్యక్తుల చేతిలోకి వెళ్లడం, దాని ద్వారా సిమ్‌ క్లోనింగ్‌లాంటి వాటికి పాల్పడి డబ్బులు కాజేసే అవకాశం ఉందని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఎప్పటికప్పుడు ఆధార్‌ ఓటీపీ మన మొబైల్‌కు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. బయోమెట్రిక్‌/ఐరిస్‌ను లాక్‌ చేసుకునే వీలూ ఇప్పుడు ఉంది. వీటిని ఉపయోగించుకోవాలి. వీటిని ఎంఆధార్‌ యాప్‌ను వాడి వీటిని లాక్‌ చేసుకోవచ్చు. అసలు ఆధార్‌ నెంబరుకు బదులుగా 16  అంకెల వర్చువల్‌ ఐడీని వాడటం అలవాటు చేసుకోవాలి. ఈకేవైసీ కోసం ఎక్కడైనా ఆధార్‌ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించాలి.

* మీకు సంబంధం లేకుండా ఆధార్‌ ఓటీపీ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే యూఐడీఏఐ పోర్టల్‌కు వెళ్లి, బయోమెట్రిక్‌ను నిలిపివేయాలి.
* బ్యాంకు నుంచి మనకు తెలియకుండా డబ్బు వెళ్లినట్లు సమాచారం వచ్చిన వెంటనే ఆలస్యం చేయొద్దు. సంబంధిత బ్యాంకు సేవా కేంద్రానికి ఫోన్‌లో ఫిర్యాదు చేయాలి. ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వాలి. పోలీస్‌ కేసునూ నమోదు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని