రుణాలు..భారం కావద్దంటే..

కొవిడ్‌-19 పరిస్థితుల నుంచి చాలామంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అవసరాలు పెరగడంతోపాటు, పిల్లల ఫీజులు తదితరాల ఖర్చుల కోసం రుణాలు తీసుకోవడం అధికమవుతోంది. ఓవైపు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.

Updated : 17 Jun 2022 11:38 IST

కొవిడ్‌-19 పరిస్థితుల నుంచి చాలామంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అవసరాలు పెరగడంతోపాటు, పిల్లల ఫీజులు తదితరాల ఖర్చుల కోసం రుణాలు తీసుకోవడం అధికమవుతోంది. ఓవైపు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ దశలో అప్పులు తీసుకునే వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి వెంటనే క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ బ్యాంకులు ఫోన్‌ చేస్తుంటాయి. సులభంగా లభిస్తుంది కదా అని చాలామంది కార్డులను తీసుకుంటారు. ఎంతోమంది తొలి రుణం క్రెడిట్‌ కార్డు ద్వారానే తీసుకుంటారు. బిల్లు చెల్లించేందుకు 40-50 రోజుల వ్యవధి ఇస్తున్నారు కదా.. అని కనిపించిందల్లా కొనడం అలవాటవుతుంది. నెలనెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తే ఇబ్బందేమీ లేదు. కానీ, ఆదాయానికి మించి కొనుగోళ్లు చేసి, మొత్తం బిల్లు చెల్లించకుండా.. కనీస మొత్తం కడితే మాత్రం.. అప్పుల ఊబిలో కూరుకుపోవడం ప్రారంభమైనట్లే. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకుంటే.. ఏడాదికి 36-40 శాతం వరకూ వడ్డీ విధిస్తాయి. కొన్నిసార్లు వీటిని వదిలించుకునేందుకు కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది. పైగా క్రెడిట్‌ స్కోరు దారుణంగా దెబ్బతింటుంది.

20 శాతం లోపే..
భవిష్యత్తులో ఆదాయం అధికంగా ఉంటుందని, ఇప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయడం చాలామందికి అలవాటు. రేపటి సంగతి తరువాత.. ఇప్పుడు మన ఆర్థిక స్థితి ఏమిటన్నదే చూసుకోవాలి. ఆర్జించే ఆదాయాన్ని బట్టి, అప్పులు తీసుకోవాలి. అంతేకానీ.. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని తీసుకోకూడదు. మీ నెలవారీ ఆదాయంలో 20 శాతానికి మించి రుణ వాయిదాలు చెల్లించకుండా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్తు కోసం ఎంతోకొంత పొదుపు, పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది.

విలువ పెంచే ఆస్తుల్లో..
రుణం తీసుకుంటే.. దానికి ఒక విలువ ఉండాలి. దీర్ఘకాలంలో ఆ అప్పు ద్వారా సంపద సృష్టి జరగాలి. ఉదాహరణకు గృహరుణంలాంటిది మంచి రుణమే. దీనివల్ల మన ఆస్తుల జాబితా పెరుగుతుంది. అవసరమైతే అమ్మి, రుణం చెల్లించడంతోపాటు, మూలధన రాబడీ పొందవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారు వ్యాపార విస్తరణ కోసం అప్పు చేయొచ్చు. విలాస వస్తువులు కొనుగోలు చేయడం, విందులు, విహారయాత్రలు తదితర అవసరాల కోసం చేసే రుణాలు ఎప్పుడూ ఆర్థికంగా భారాన్నే మిగులుస్తాయి. చేతిలో డబ్బు లేనప్పుడు కోరికలను వాయిదా వేసుకోవడమే ఆర్థికంగా శ్రేయస్కరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు