సూచీ ఫండ్లతో తొలి అడుగు..

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు ఆకర్షణీయమే. కానీ, నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. ఇటీవలి కాలంలో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడాన్ని బట్టి, దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొదటి సారిగా స్టాక్‌మార్కెట్లో అడుగుపెట్టాలనుకునే వారు ఏం చేయాలి,

Updated : 24 Jun 2022 04:34 IST

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు ఆకర్షణీయమే. కానీ, నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. ఇటీవలి కాలంలో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడాన్ని బట్టి, దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొదటి సారిగా స్టాక్‌మార్కెట్లో అడుగుపెట్టాలనుకునే వారు ఏం చేయాలి, ఎటువంటి మార్గాన్ని అనుసరించాలి...? అనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త మదుపరులు తమ పెట్టుబడుల ప్రయాణంలో తొలి అడుగు వేయటానికి ‘ఇండెక్స్‌ ఫండ్స్‌’ (సూచీ ఫండ్లు)ను పరిగణనలోకి తీసుకోవటం మేలు. నష్ట భయం తక్కువగా ఉండటానికి తోడు బ్యాంకు వడ్డీ రేట్లకు మించిన ప్రతిఫలాన్ని వీటి నుంచి ఆశించవచ్చు.
ఇండెక్స్‌ ఫండ్లు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలైన నిఫ్టీ 50, నెన్సెక్స్‌ 30 మీద ఆధారపడి ఉంటాయి. సూచీల్లోని కంపెనీలకున్న వెయిటేజీ ఆధారంగా ఇండెక్స్‌ ఫండ్స్‌ పెట్టుబడులు పెడతాయి. అంటే సూచీల్లోని అన్ని కంపెనీల షేర్లకు ఆయా కంపెనీలకు ఉన్న సూచీల్లో ఉన్న వెయిటేజీ ప్రకారం పెట్టుబడుల కేటాయింపు ఉంటుంది.

* ఏదైనా నిఫ్టీ- 50 ఆధారిత ఇండెక్స్‌ ఫండ్‌ను పరిశీలిస్తే, ఆ ఫండ్‌ కింద నిఫ్టీ- 50లో ఉన్న అన్ని షేర్లను, అదే వెయిటేజీ ప్రకారం కొనుగోలు చేస్తుంది.
* సూచీలను క్రమం తప్పకుండా సవరిస్తూ ఉంటారు. అంటే కొన్ని కంపెనీలను తొలగించి, కొత్త కంపెనీలను జతచేస్తారు దీన్ని రీ-బ్యాలెన్సింగ్‌ అంటారు. ఇలా రీ-బ్యాలెన్సింగ్‌ జరిగిన ప్రతిసారీ ఇండెక్స్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడులను ఆ మేరకు సవరిస్తాయి.
* ఇటువంటి పథకాల్లో ఫండ్‌ మేనేజర్‌ క్రియాశీలత ఏమీ ఉండదు. ఇండెక్స్‌ షేర్లలో వాటి వెయిటేజీ ప్రకారం పెట్టుబడులు కేటాయించటమే. అంతేగానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం, అవకాశం ఉండదు.
ఇండెక్స్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టటంలో ఉన్న మరొక ప్రయోజనం, వాటి నిర్వహణ ఛార్జీలు తక్కువగా ఉండటమే. ‘రెగ్యులర్‌’ ఫండ్‌ పథకాలకు నిర్వహణ ఛార్జీలు 1.5%- 2.25% ఉంటాయి. ఇండెక్స్‌ ఫండ్స్‌పై నిర్వహణ ఛార్జీలు 0.2-0.3 శాతం ఉంటున్నాయి.
ఎన్నో పథకాలు
ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిఫ్టీ 50, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30, నిఫ్టీ నెక్ట్స్‌ 50, బ్యాంక్‌ నిఫ్టీ, నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఆధారిత ఇండెక్స్‌ ఫండ్స్‌ ను నిర్వహిస్తున్నాయి.
ఇవే కాకుండా నాస్‌డాక్‌ 100 వంటి అంతర్జాతీయ ఇండెక్స్‌ ఫండ్స్‌ సైతం అందుబాటులో ఉన్నాయి.

ఇతర ప్రత్యేకతలు
ఇండెక్స్‌ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా ‘పోర్ట్‌ఫోలియో వైవిధ్యం’ సాధించినట్లే. వివిధ రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలను ఎంపిక చేసి సూచీల్లో స్థానం కల్పిస్తారు. కాబట్టి ఇండెక్స్‌ ఫండ్స్‌ కొనటం అంటే సంబంధిత సూచీల్లోని అన్ని కంపెనీలపై మనం పెట్టుబడి పెట్టినట్లే.
సూచీల్లో ఏ మేరకు వృద్ధి నమోదవుతుందో... అంతే స్థాయిలో ఇండెక్స్‌ ఫండ్స్‌ ప్రతిఫలం ఉంటుంది.
ఒకేసారి ఏక మొత్తం పెట్టుబడి మాదిరిగా కాకుండా సిప్‌ (క్రమానుగత పెట్టుబడి)  పద్దతిలో వారానికోసారి లేదా నెలకోసారి వాయిదాల్లో ఇండెక్స్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీనివల్ల ‘కాస్ట్‌ యావరేజింగ్‌’ ప్రయోజనం లభిస్తుంది.
ఏదైనా ఒక కంపెనీ లేదా నాలుగైదు కంపెనీలపై పెట్టుబడి పెట్టినప్పుడు ఆ కంపెనీల పనితీరును నిరంతరం గమనిస్తూ ఉండాలి. మార్కెట్‌ కరెక్షన్‌కు లోనైనప్పుడు ఆయా షేర్ల ధరలు బాగా పతనమై నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఇటువంటి ప్రమాదం సూచీల ఆధారిత పెట్టుబడులు- అంటే ఇండెక్స్‌ ఫండ్స్‌లోనూ ఉంటుంది. కానీ నష్ట భయం తక్కువ కావటంతో పాటు, మళ్లీ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మొదటిసారి ఈక్విటీ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇండెక్స్‌ ఫండ్స్‌ అనుకూలమని చెప్పొచ్చు.

 -  చింతన్‌ హారియా, హెడ్‌-ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని