నెలకు రూ.లక్ష రావాలంటే..

నా వయసు 48. ప్రైవేటు ఉద్యోగిని. జీతం రూ.లక్ష. నెలకు సుమారు రూ.20 వేలు వివిధ పథకాల్లో మదుపు చేస్తున్నాను. దీనికి పీఎఫ్‌ అదనం. 58 ఏట నుంచి నెలకు రూ. లక్ష (పన్ను లేకుండా) రావాలంటే నా దగ్గర ఎంత మొత్తం ఉండాలి? దీనికోసం ఏం చేయాలి?

Updated : 24 Jun 2022 04:31 IST

* నా వయసు 48. ప్రైవేటు ఉద్యోగిని. జీతం రూ.లక్ష. నెలకు సుమారు రూ.20 వేలు వివిధ పథకాల్లో మదుపు చేస్తున్నాను. దీనికి పీఎఫ్‌ అదనం. 58 ఏట నుంచి నెలకు రూ. లక్ష (పన్ను లేకుండా) రావాలంటే నా దగ్గర ఎంత మొత్తం ఉండాలి? దీనికోసం ఏం చేయాలి?

- చైతన్య

మీరు సుమారు 20 శాతం పన్ను శ్లాబులో ఉంటారని అనుకుందాం. అప్పుడు పన్ను తర్వాత మీకు నెలకు రూ.లక్ష అందాలంటే.. వార్షిక ఆదాయం రూ.15లక్షల వరకూ ఉండాలి. అప్పుడు రూ.3లక్షలు పన్ను పోను, నెలకు రూ.లక్ష చొప్పున అందుకోవచ్చు. మీ దగ్గర ఉన్న డబ్బు 6శాతం రాబడిని ఆర్జించేలా చూసుకుంటే.. పదేళ్ల తర్వాత రూ.2.5 కోట్ల నిధి ఉంటేనే ఇది సాధ్యం. 8 శాతం రాబడిచ్చే పథకాల్లో మదుపు చేస్తే రూ.1.87 కోట్లు అవసరం. ఇప్పటికే మీ దగ్గర ఎంత మొత్తం జమ అయ్యిందనే వివరాలు లేవు. ఇప్పటి నుంచి పదేళ్లలో రూ.2.5 కోట్లు జమ చేయాలంటే.. నెలకు రూ.125,000 మదుపు చేయాలి. రూ.1.87 కోట్లు కావాలంటే.. నెలకు రూ.93,500 కావాలి. ఈ పెట్టుబడిని 11 శాతం రాబడినిచ్చే పథకాలకు మళ్లించాలి. ఇప్పటికే మీ పీఎఫ్‌లో మంచి మొత్తం జమ అయి ఉంటుంది. పదవీ విరమణ నాటికి ఇది మరింత పెరుగుతుంది. కాబట్టి, ఇప్పుడు మీరు చేస్తున్న రూ.20 వేల పెట్టుబడిని మీ మిగులు మొత్తాన్ని బట్టి, పెంచుకునే ప్రయత్నం చేయండి. రిటైర్‌ అయ్యాక మొత్తం డబ్బును అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మదుపు చేసి, నెలనెలా రాబడిని అందుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.


* ఆరేళ్ల క్రితం ఒక యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌) తీసుకున్నాను. ఏడాదికి రూ.80వేల ప్రీమియం చెల్లిస్తున్నాను. దీన్ని ఇప్పుడు రద్దు చేసుకోవచ్చా? దీనికి బదులుగా నెలనెలా ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యామ్నాయ పథకాలను సూచించండి?

- రమేశ్‌

సాధారణంగా యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలకు అయిదేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. మీరు పాలసీ తీసుకొని, ఆరేళ్లు అయ్యింది కాబట్టి, ఎలాంటి రుసుములు లేకుండానే పాలసీని రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టుబడి కోసం ఈక్విటీ ఫండ్లను ఎంచుకుంటే.. ఇప్పుడు మార్కెట్‌ తక్కువగా ఉంది కాబట్టి, లాభం తక్కువగా ఉండొచ్చు. మార్కెట్‌ పూర్తిగా కోలుకునే దాకా వేచి చూడండి. ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బుతో అవసరం లేకపోతే.. రెండుమూడేళ్లు ఆగి తీసుకోండి. ముందుగా తగినంత మొత్తానికి బీమా తీసుకోండి. పెట్టుబడి కోసం హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి.


* రెండేళ్లలో గృహరుణం తీసుకొని ఇల్లు కొనాలన్నది ఆలోచన. దీనికోసం మార్జిన్‌ మనీ రూ.15లక్షల వరకూ అవసరం. ఇప్పటికే పీఎఫ్‌లో రూ.7లక్షల వరకూ ఉన్నాయి. మిగతా మొత్తాన్ని జమ చేసేందుకు వీపీఎఫ్‌ను ఎంచుకోవాలా? లేకపోతే షేర్లలో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయా?

- ప్రవీణ్‌

రెండేళ్లలోనే డబ్బు వెనక్కి కావాలి కాబట్టి, సురక్షిత పథకాలను ఎంచుకోవడమే మేలు. షేర్లలో పెట్టుబడి పెట్టినప్పుడు కనీసం 5-6 ఏళ్ల పాటు వేచి చూడాలి. అప్పుడే లాభాలు వస్తాయి. స్వల్పకాలంలో అధిక నష్టభయం ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌/వీపీఎఫ్‌లో 8.1శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇది మంచి రాబడిగానే చెప్పొచ్చు. కాబట్టి, మీరు వీపీఎఫ్‌ను ఎంచుకోవడమే శ్రేయస్కరం.


* మా అబ్బాయి వయసు 14. మరో ఏడేళ్ల తర్వాత అమెరికా పంపించాలన్నది ఆలోచన. దీనికోసం ఇప్పటి నుంచి నెలకు రూ.25వేల వరకూ మదుపు చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి ప్రణాళిక ఉండాలి?

- మధు

మీ అబ్బాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు భద్రత కల్పించేందుకు మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా తీసుకోండి. అమెరికాలో చదివించాలని అనుకుంటున్నారు కాబట్టి, పెట్టుబడులు అమెరికా మార్కెట్లో మదుపు చేసే పథకాలకు కేటాయించండి. దేశీయ మ్యూచువల్‌ ఫండ్లు అంతర్జాతీయ ఫండ్ల ద్వారా అమెరికా మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మూడు నుంచి నాలుగు డైవర్సిఫైడ్‌ అమెరికా ఫండ్లను ఎంచుకొని, సిప్‌ ప్రారంభించండి. డబ్బులు అవసరం ఉన్నప్పుడు రెండు లేదా మూడేళ్ల ముందుగానే ఈ ఫండ్ల నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకొని, సురక్షిత పథకాలకు మళ్లించాలి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు