Credit Score: క్రెడిట్‌ స్కోరు పెంచుకుందాం

కొత్తగా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు ఒక విషయాన్ని ప్రధానంగా గమనిస్తుంటాయి. అదే ఇప్పటివరకూ మనం తీసుకున్న రుణాలకు చెల్లింపులు ఎలా చేశాం..

Updated : 17 Sep 2021 09:08 IST

కొత్తగా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు ఒక విషయాన్ని ప్రధానంగా గమనిస్తుంటాయి. అదే ఇప్పటివరకూ మనం తీసుకున్న రుణాలకు చెల్లింపులు ఎలా చేశాం.. ఏదైనా బాకీ ఉన్నామాలాంటివి. దీనికోసం బ్యాంకులు పరిశీలించేది క్రెడిట్‌ స్కోరును. 300 - 900 వరకూ ఉండే ఈ అంకెలే మన ఆర్థిక క్రమశిక్షణను నిర్ణయిస్తుంటాయి. ఇది 750కన్నా తక్కువగా ఉంటే.. రుణాలు రావడం కాస్త కష్టమే. మంచి స్కోరుంటే.. వడ్డీ రేటులోనూ రాయితీలనిస్తున్నాయి బ్యాంకులు. మరి, ఈ స్కోరును పెంచుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందామా...

దేశంలో ఇప్పుడు నాలుగు సంస్థలు క్రెడిట్‌ స్కోరును అందిస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, క్రిఫ్‌ హై మార్క్‌ సంస్థలు రుణగ్రహీతలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపుల తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఎక్కువగా సిబిల్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇక క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్న సందర్భాల్లో...

వ్యవధిలోపే చెల్లించండి..

క్రెడిట్‌ బ్యూరోలు ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపుల తీరును పరిశీలిస్తూ ఉంటాయి. ఇందులో ఆలస్యం జరిగితే వెంటనే ఆ వివరాలను నమోదు చేస్తుంటాయి. తరచూ ఆలస్యం జరుగుతుంటే.. స్కోరు దెబ్బతింటుంది. కాబట్టి, వీలైనంత వరకూ బిల్లులను సకాలంలో చెల్లించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే క్రెడిట్‌ స్కోరులో ఏ ఇబ్బందీ ఉండదు. కొత్తగా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు కనీసం రెండు మూడేళ్ల నుంచీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

నివేదికను సరిచూసుకోండి...

రుణాల చెల్లింపుల విషయంలో మన క్రమశిక్షణ ఎలా ఉందన్నది తెలుసుకోవాలంటే.. క్రెడిట్‌ నివేదికను కనీసం ఏడాదికోసారైనా పరిశీలించాలి. ప్రస్తుతం చాలా సంస్థలు ఈ రిపోర్టును ఉచితంగానే అందిస్తున్నాయి. సిబిల్‌ లాంటి బ్యూరోలు ఏడాదికోసారి ఉచితంగా ఇస్తాయి. ఈ నివేదికను తీసుకొని, క్షుణ్నంగా పరిశీలించాలి. క్రెడిట్‌ కార్డులను ఎక్కువగా వాడుతుంటే.. ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికంగా క్రెడిట్‌ కార్డులు వాడితే.. స్కోరు మీద దాని ప్రభావం ఉంటుంది. ఏదైనా తప్పు ఉన్నట్లు కనిపిస్తే వెంటనే బ్యాంకును లేదా క్రెడిట్‌ బ్యూరో సంస్థను సంప్రదించాలి. ఆ తప్పును సరిచేయాల్సిందిగా కోరాలి.

పరిమితంగా..

అవసరం ఉన్నా.. లేకున్నా.. పదే పదే రుణాలు, క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేయడం ఎప్పుడూ పొరపాటే. దీనివల్ల అప్పుల కోసం అధికంగా ప్రయత్నిస్తున్నారనే భావన వస్తుంది. ఇదీ మీ క్రెడిట్‌ స్కోరును దెబ్బతీసే అంశమే. ఏదేని దరఖాస్తును తక్కువ క్రెడిట్‌ స్కోరుందని బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలు తిరస్కరిస్తే... స్కోరు మరింతగా దిగజారుతుంది. నిజంగా రుణం కావాలని అనుకున్నప్పుడే.. ఒకటి, రెండు సంస్థలనే సంప్రదించండి. దీనివల్ల మీరు రుణం కోసం ఎక్కువ సంస్థలను సంప్రదిస్తున్నారనే భావన ఉండదు.

అప్పు.. తక్కువగా..

క్రెడిట్‌ కార్డులను వినియోగించడంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. మొత్తం పరిమితిని ఉపయోగిస్తే.. క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.50వేల వరకూ ఉందనుకుందాం.. గరిష్ఠంగా దీన్ని రూ.20వేలకు మించి వాడకూడదు. అంటే.. 30-40 శాతం లోపే వినియోగించాలి. ఒకవేళ నెలనెలా అధిక మొత్తంలో కార్డును ఉపయోగిస్తే.. అధిక రుణ పరిమితి ఉన్న క్రెడిట్‌ కార్డును తీసుకోండి. లేదా మరో బ్యాంకు నుంచి కార్డును తీసుకునే ప్రయత్నం చేయాలి.

ఒకే రుణంగా..

రెండు మూడు అప్పులు.. క్రెడిట్‌ కార్డు బాకీలు ఉన్నప్పుడు... వాటన్నింటినీ.. ఒకే చోటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకూ చిన్న మొత్తాలతో ఉన్న అప్పులను తీర్చే ప్రయత్నం చేయండి. ఇలా సాధ్యం కాకపోతే.. ఈ అప్పులన్నీ తీర్చేందుకు ఒక పెద్ద రుణం తీసుకోవడం మంచిది. దీనివల్ల అధిక వడ్డీ ఉన్న రుణాల నుంచి మీకు విముక్తి దొరుకుతుంది. అప్పుల సంఖ్య పెరిగితే.. మీ క్రెడిట్‌ స్కోరు తగ్గుతుందని మర్చిపోవద్దు.

సాధ్యమైన మేరకే..

ఆదాయం తగ్గట్టు ఖర్చులు ఉండాలి. అదే విధంగా అప్పులూ అందుకు అనుగుణంగానే ఉండాలి. విలువ పెరిగే ఆస్తుల కొనుగోలుకు చేసే అప్పుతో ముప్పు ఉండదు. కానీ, అనవసర ఆర్భాటాల కోసం చేసే వ్యక్తిగత రుణాల్లాంటివి సరికాదు. మీ మొత్తం ఆదాయంలో ఈఎంఐలకు చెల్లించే మొత్తం 40శాతం మించి ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మీ క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని