డెబిట్‌ కార్డుతో ఆర్థిక క్రమశిక్షణ

కార్డుతో చెల్లింపులు అనగానే మనలో చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేది క్రెడిట్‌ కార్డే. మన దగ్గర డబ్బు లేకున్నా.. వాడుకునే వీలు కల్పిస్తుందిది. కానీ, అప్పుల ఊబిలోకీ నెట్టేస్తుందన్న మాట వాస్తవం.

Updated : 05 Dec 2021 15:57 IST

కార్డుతో చెల్లింపులు అనగానే మనలో చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేది క్రెడిట్‌ కార్డే. మన దగ్గర డబ్బు లేకున్నా.. వాడుకునే వీలు కల్పిస్తుందిది. కానీ, అప్పుల ఊబిలోకీ నెట్టేస్తుందన్న మాట వాస్తవం. అందుకే, క్రెడిట్‌ కార్డు వాడకం వీలైనంత తగ్గించాలి. బదులుగా డెబిట్‌ కార్డును వాడుతే.. ఖర్చులు అదుపు.. ఆర్థిక క్రమశిక్షణ రెండూ సాధ్యం అవుతాయి.

ప్రతి రూపాయికీ లెక్క..

డబ్బు నిర్వహణలో ప్రతి రూపాయికీ లెక్క ఉండటం ఎంతో అవసరం. డెబిట్‌ కార్డును ఉపయోగించినప్పుడు దీన్ని సులభంగా తెలుసుకోవచ్చు. మీ ఖాతాలో ఉన్న డబ్బునే ఖర్చు పెడుతుంటారు. కాబట్టి, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా బ్యాంకింగ్‌ యాప్‌ ద్వారా ఎక్కడ, ఎంత ఖర్చు చేశామన్నది తేలిగ్గా అర్థం అవుతుంది. నెలవారీ బ్యాంకు ఖాతా వివరాలు వచ్చే వరకూ ఆగాల్సిన అవసరం ఉండదు. ఖాతాలో ఎంత నిల్వ ఉందో ఎప్పటికప్పుడు తెలుస్తుంది కాబట్టి, అనవసర వ్యయాలకు అడ్డుకట్ట వేయొచ్చు.

పరిమితి మేరకే..

నెలకు ఎంత ఖర్చు చేయాలని అనుకుంటున్నారు.. అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆ మేరకు డెబిట్‌ కార్డులో పరిమితి విధించుకోవాలి. అంతకుమించి ఖర్చు చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ అధికంగా కావాలంటే.. నెట్‌ బ్యాంకింగ్‌కు వెళ్లి.. పరిమితిని పెంచుకోవాలి. అప్పుడు మనం ఎక్కువగా వ్యయం చేస్తున్న సంగతి అర్థమవుతుంది. బ్యాంకులను బట్టి, ఈ వెసులుబాటు ఉంటుంది. మీ బ్యాంకు డెబిట్‌ కార్డుపై ఈ తరహా పరిమితి విధించుకునే వీలుందా లేదా చూసుకోండి.

క్రెడిట్‌ కాకుండా..

రోజువారీ ఖర్చులకు క్రెడిట్‌ కార్డును వాడకపోవడమే మంచిది. ముందే అనుకున్నట్లు అది మనపై అప్పు భారాన్ని మోపుతుంది. నిత్యావసరాల కొనుగోలు, ఇతర తప్పనిసరి ఖర్చులకు డెబిట్‌ కార్డు ద్వారానే చెల్లింపులు చేయండి. దీనివల్ల ఖర్చు ఎంత చేస్తున్నామనే అవగాహన వస్తుంది. తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలనూ అన్వేషిస్తాం. అందుకే, సాధ్యమైనంత వరకూ క్రెడిట్‌ కార్డుకు దూరంగా ఉండాలి.

వాయిదాల్లో వద్దు..

ఒకప్పుడు క్రెడిట్‌ కార్డులపై కొని, వాయిదాల్లో బిల్లుల చెల్లించేందుకు ఏర్పాటు ఉండేది. ఇప్పుడు చాలా బ్యాంకులు డెబిట్‌ కార్డులకూ ఈ వెసులుబాటును ఇస్తున్నాయి. మూడు లేదా ఆరు నెలల వ్యవధికి ఈఎంఐని నిర్ణయించుకోవచ్చు. డెబిట్‌ కార్డు ఈఎంఐలపైన బ్యాంకును బట్టి 11%-15% వరకూ వడ్డీ ఉంటుంది. ఇది అదనపు భారమే. మీ దగ్గర డబ్బు ఉంటే, ఒకేసారి మొత్తం చెల్లించి కొనండి. అత్యవసరం కాకపోతే... డబ్బును జమ చేశాకే కొనడం ఎప్పుడూ మంచిది.

అవసరానికి తగ్గట్టుగా..

బ్యాంకులు పలు రకాల డెబిట్‌ కార్డులను అందిస్తుంటాయి. ఇందులో మీ అవసరాలు, ఖర్చుల తీరు ఆధారంగా డెబిట్‌ కార్డును ఎంచుకోవాలి. కొన్ని ప్రతి కొనుగోలుకూ రివార్డు పాయింట్లను అందిస్తుంటాయి. మరికొన్ని ఉచితంగా ప్రమాద బీమాలాంటివి ఇస్తుంటాయి. మీ బ్యాంకును సంప్రదించి, ఏ తరహా డెబిట్‌ కార్డులను అందిస్తుందో తెలుసుకోండి. అందులో మీకు నప్పే కార్డును ఎంపిక చేసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని