స్థిర ఈఎమ్ఐ లేదా ఈఎమ్ఐ త‌గ్గింపు.. ఏది ఎంచుకుంటారు?

గృహ రుణం తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు మొద‌ట‌గా ఆలోచించాల్సింది ఈఎమ్ఐ గురించే. ప్ర‌తి నెల రుణం తీసుకున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ‌కు ఎంత చెల్లించాల‌ని లెక్కించుకోవాలి. యాక్సిస్ బ్యాంక్ దీనికోస‌మే క్విక్‌పే అనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. క్విక్‌పే వినియోగ‌దారుల‌కు రుణ చెల్లింపు

Published : 17 Dec 2020 22:33 IST

గృహ రుణం తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు మొద‌ట‌గా ఆలోచించాల్సింది ఈఎమ్ఐ గురించే. ప్ర‌తి నెల రుణం తీసుకున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ‌కు ఎంత చెల్లించాల‌ని లెక్కించుకోవాలి. యాక్సిస్ బ్యాంక్ దీనికోస‌మే క్విక్‌పే అనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. క్విక్‌పే వినియోగ‌దారుల‌కు రుణ చెల్లింపు వాయిదాల్లో త‌గ్గింపు ల‌భిస్తుంది. అంటే ప్ర‌తి నెల క‌చ్చిత‌మైన మొత్తాన్ని తిరిగి చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. చెల్లింపు గ‌డువు పెరిగినకొద్ది వాయిదాలు త‌గ్గుతూ వ‌స్తాయి. అయితే మొద‌ట వాయిదాలు కొంత అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధార‌ణంగా ఈఎమ్ఐలో క‌చ్చిత‌మైన వాయిదా చెల్లించాలి. ఇందులో వ‌డ్డీ, అస‌లు క‌లిపి ఉంటుంది. అదే క్విక్‌పే రుణాల్లో అస‌లు స్థిరంగా ఉంటుంది కానీ వాయిదాల్లో చెల్లించాల్సిన మొత్తం త‌గ్గుతుంది.

రుణ చెల్లింపులు:

సాధార‌ణంగా గృహ రుణాల్లో ఈఎమ్ఐ స్థిరంగా ఉంటుంది. రుణం మొత్తం చెల్లించేంత‌వ‌ర‌కు ఈఎమ్ఐలో వ‌డ్డీ అసలు క‌లిపి లెక్కించాలి. ఉదాహ‌ర‌ణ‌కు, రూ.50 ల‌క్ష‌ల గృహ రుణానికి వార్షిక వ‌డ్డీ రేటు 9 శాతం. రుణ కాల‌ప‌రిమితి 20 సంవ‌త్స‌రాలు. మొద‌టి ఈఎమ్ఐ రూ.44,986 గా ఉంటుంది. ఇందులో రూ.37,500 మొత్తం రుణంపై వ‌డ్డీ, అస‌లు రూ.7,486. అదేవిధంగా వ‌చ్చే నెల‌లో వ‌డ్డీని, త‌గ్గిన అస‌లు ఆధారంగా లెక్కిస్తారు. అయితే ఈఎమ్ఐ మాత్రం అంతే ఉంటుంది. ఎందుకంటే వ‌డ్డీ త‌గ్గినాకొద్ది అసలు పెంచి బ్యాలెన్స్ చేస్తారు.

క్విక్‌పే రుణాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అంటే రుణాన్ని ఈఎమ్ఐ రూపంలో క‌చ్చిత‌మైన మొత్తాన్ని చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. మొద‌టి వాయిదాలు ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. అంటే మొద‌టి ఈఎమ్ఐ రూ.58,333 గా ఉంటుంది. వ‌డ్డీ రేటు మాత్రం అదేవిధంగా రూ.37,500 గా ఉంటుంది. అయితే ఇందులో అస‌లు మొత్తం చెల్లింపు రూ.20,833. ప్ర‌తి నెల‌లో ఈ విధంగా క‌చ్చితంగా అస‌లు రూ.20,833 త‌గ్గిస్తూ మిగిలిన దానిపై వ‌డ్డీ లెక్కిస్తారు ఈ ఉదాహ‌ర‌ణ‌లో సాధార‌ణ గృహ రుణం మొత్తం చెల్లించేనాటికి రూ.1.08 కోట్లకు చేరుతుంది. వ‌డ్డీనే రూ.58 ల‌క్ష‌లు అవుతుంది. మ‌రోవైపు క్విక్‌పేలో ప‌రిశీలిస్తే మొత్తం రూ.95.2 ల‌క్ష‌లు అవుతుంది. ఇందులో వ‌డ్డీ మొత్తం రూ.45.2 లక్ష‌లు ఉంటుంది.

ఎక్కువ వ‌డ్డీ రేట్లు:

పైన ఉదాహ‌ర‌ణ‌ల్లో రెండు ర‌కాల రుణాల‌కు ఒకే ర‌క‌మైన వ‌డ్డీ రేటు లెక్కించారు. అయితే క్విక్‌పే రుణాల్లో యాక్సిస్ బ్యాంక్ సాధార‌ణ వ‌డ్డీ రేట్ల‌తోపోలిస్తే 15-20 బేసిస్ పాయింట్లు అధికంగా వ‌డ్డీ తీసుకుంటుంది. అంటే గృహ రుణంపై వ‌డ్డీ 9 శాతం ఉంటే, క్విక్ పేలో 9.15 శాతం నుంచి 9.2 శాతం వ‌ర‌కు ఉంటుంది. దీంతో మొత్తం రుణం పూర్త‌య్యేనాటికి రూ.95.2 ల‌క్ష‌ల నుంచి రూ.96.2 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే సాధార‌ణంగా గృహ రుణాన్ని 9-10 సంవ‌త్స‌రాల లోపు చెల్లిస్తారు. అయితే మ‌రో ప్ర‌త్యామ్నాయంగా రుణం తీసుకున్న‌ ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌తి ఏడాది రూ.3 లక్ష‌లు చెల్లిస్తుంటే 9 శాతం వ‌డ్డీ రేటుతో మొత్తం చెల్లింపు చేసేది రూ.86 లక్ష‌ల‌కు త‌గ్గుతుంది. అదే రూ.4 ల‌క్ష‌లు చెల్లిస్తే మొత్తం రూ.83 ల‌క్ష‌ల‌కు చేరుతుంది. క్విక్ పే రుణాల్లో ఎలాంటి ఛార్జీలు లేకుండా ముందస్తుగా రుణం చెల్లించే అవ‌కాశం ఉంటుంది. 9.2 శాతం వ‌డ్డీతో ఐదేళ్ల త‌ర్వాత రూ. 3 ల‌క్ష‌లు చెల్లిస్తుంటే మొత్తం రూ.81 ల‌క్ష‌లు , 4 ల‌క్ష‌లు చెల్లిస్తే రూ.79 లక్ష‌లు అవుతుంది.

మ‌రి ఏం చేయాలి?

పైన తెలిపిన గణాంకాల ప్ర‌కారం, సాధార‌ణ గృహ రుణంతో పోలిస్తే క్విక్‌పే రుణాలు కొంత సవాళ్ల‌తో కూడుకున్న‌ద‌నే చెప్పాలి. ఎందుకంటే ప్రారంభంలో వాయిదాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఒక‌వేళ మీరు అంత‌ మొత్తంలో చెల్లించ‌గ‌ల‌ర‌నుకుంటే క్విక్‌పేని ఎంచుకోవ‌డ‌మే మేలు. దీంతో వ‌డ్డీ రూపంలో స‌మ‌ర్పించుకునే మీ డ‌బ్బు ఆదా అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని