ఏ రుణం సురక్షితం?

ఆర్థిక వ్యవస్థలో దేశ ప్రజలందరూ సమ్మిళితం కానందున అనధికారిక రుణాలు తీసుకునేవారి సంఖ్య 90 శాతంగా ఉంటుందని వివిధ సంస్థల అధ్యయనంలో తేలింది. అందరికీ బ్యాంకు ఖాతాలు లేకపోవడం, నిరక్షరాస్యత వంటి కారణాల దృష్ట్యా బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద కంటే ప్రైవేటు వ్యక్తులనే

Published : 16 Dec 2020 20:05 IST

ఆర్థిక వ్యవస్థలో దేశ ప్రజలందరూ సమ్మిళితం కానందున అనధికారిక రుణాలు తీసుకునేవారి సంఖ్య 90 శాతంగా ఉంటుందని వివిధ సంస్థల అధ్యయనంలో తేలింది. అందరికీ బ్యాంకు ఖాతాలు లేకపోవడం, నిరక్షరాస్యత వంటి కారణాల దృష్ట్యా బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద కంటే ప్రైవేటు వ్యక్తులనే రుణం కోసం ఆశ్రయించడం పరిపాటైపోయింది. పిల్లల ఉన్నత విద్య, వివాహ అవసరాలు, వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతు, ఇంటి కొనుగోలు, కారు కొనుగోలు, వ్యాపార అవసరాల రీత్యా ప్రజలు రుణం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. రుణ ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ - బ్యాంకులు పలు డాక్యుమెంట్ల పరిశీలన విషయంలో కచ్చితంగా ఉండటం, పలు సార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి రావడం వంటి కారణాల రీత్యా గ్రామీణ ప్రాంతాల వారు బ్యాంకు రుణాల వైపు మొగ్గు చూపడం లేదు. పట్టణ ప్రాంతాల్లో సైతం చిన్న వ్యాపారులు పాన్‌ బ్రోకర్లు, ఫైనాన్సియర్ల దగ్గరే రుణాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. తర్వాత రుణం తీర్చే దగ్గరికి వచ్చే సరికి అనధికారిక రుణం పొందిన వారు ప్రైవేటు రుణ దాతల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు.

చట్టం పరిధిలో పరిష్కార మార్గం - డాక్యుమెంట్ల పరిశీలన దగ్గర నుంచి రుణ దరఖాస్తు ప్రక్రియ వరకూ వివిధ దశల్లో బ్యాంకు రుణం విషయంలో విధానపరమైన ప్రక్రియ ఉంటుంది. దీనివల్ల అటు రుణ సంస్థకు, ఇటు రుణ గ్రహీతకు ఇబ్బందులు తలెత్తినప్పుడు చట్టం పరిధిలో పరిష్కార మార్గం ఉంటుంది. అదే ప్రైవేటు రుణాల విషయంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రామిసరీ నోటు మీద రాసుకున్న ఒప్పందం మేరకు ప్రైవేటు రుణాలు పొందుతారు. నియమ నిబంధనలకు అనుగుణంగా - రుణం చెల్లింపు విషయం వచ్చే సరికి బ్యాంకు, ఆర్థిక సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వ్యవహారించాల్సి ఉంటుంది.

ప్రైవేటు వ్యక్తులు, ఇతర రుణ సంస్థలు డబ్బు తిరిగి రాబట్టాలనుకున్నప్పుడు వెంటనే ఒత్తిడి తీసుకువస్తాయి. పరస్పర అంగీకారంతో చేసినా - ఒప్పంద పత్రంలో పరస్పర అంగీకారంతో సంతకాలు చేసినా రుణదాత అభీష్టం మేరకు రుణ గ్రహీత వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రస్తుత రుణాన్ని తీర్చేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మరో రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇలా ప్రైవేటు రుణాలను పొందినవారు చివరకు రుణ ఊబిలో చిక్కుకుంటారు. ఈ విధంగా కుటుంబం మొత్తం కష్టాల పాలు కావాల్సి వస్తుంది. వడ్డీ రేట్లపై కఠిన వైఖరి- వడ్డీ రేట్ల విషయంలో ప్రైవేటు రుణదాతలు కఠిన వైఖరి అవలంబిస్తే వ్యక్తులు దాని పరిణామాలను భరించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాల విషయంలో ఈఎమ్‌ఐలకు స్థిర వడ్డీ ఉండటంతో ఎవరికీ ఏ సమస్యా ఉండదు. వాయిదాలు చెల్లించనప్పుడు మాత్రమే సమస్య వస్తుంది.

పూచీకత్తు అవసరం - సెక్యూరిటీ/పూచీకత్తు విషయంలో ప్రైవేటురుణాలతో పోల్చితే బ్యాంకులు కొంచెం సంక్లిష్టంగా ఉంటాయి. రెండింటి విషయంలోనూ ఎటువంటి ఆస్తులు తనఖా పెట్టనవసరం లేదు. బ్యాంకు రుణాల విషయంలో మాత్రం మధ్యవర్తి(హామీదారు) అవసరం ఉంటుంది. ఈఎమ్‌ఐల రూపంలో- రీపేమెంట్‌ విషయంలో బ్యాంకులు రుణాల చెల్లింపులను ఈఎమ్‌ఐల రూపంలో స్వీకరించేందుకు మెగ్గుచూపుతాయి. ప్రైవేటు రుణాల విషయంలో ఒక్కోసారి పెద్దమొత్తంలో చెల్లించాలని రుణదాత అడిగే అవకాశం ఉంది.

అప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బంగారంపై రుణాలు 16శాతం లోపే - బంగారు రుణాల విషయంలో ప్రైవేటు రుణ సంస్థలు 14 నుంచి 26 శాతం వడ్డీ రేట్లు విధిస్తే, బ్యాంకులు 12 నుంచి 16 శాతం మాత్రమే వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు రుణాల విషయంలో ముందస్తు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. ముందస్తు చెల్లింపునకు - సంస్థాగత రుణాల విషయంలో ముందస్తు చెల్లింపునకు అవకాశం ఉన్నప్పటికీ పెనాల్టీ విధిస్తాయి. ఈ కారణం చేత బ్యాంకు రుణాలకు వడ్డీ రేట్లు తక్కువగాను, ప్రైవేటు రుణాలకు వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగాను ఉంటాయి. తనఖా పెడితే త‌క్కువ‌కే - వ్యక్తిగత రుణాలు ఎటువంటి తనఖా లేకుండా ఇవ్వడం మూలంగా వడ్డీరేట్లు 13 నుంచి 20 శాతం వరకూ ఉంటున్నాయి. వీటికి కాలపరిమితి గరిష్ఠంగా 5 ఏళ్ల వరకూ ఉండొచ్చు. అదే ఏదైనా తనఖా పెట్టి తీసుకునే వ్యక్తిగత రుణాల విషయంలో వడ్డీ రేట్లు 12 నుంచి 15 శాతంగానూ, కాలపరిమితి గరిష్ఠంగా 15 ఏళ్ల వరకూ ఉంటుంది. వ్యాపార సంస్థల విస్తరణకై - వ్యాపార సంస్థలు విస్తరణ కోసం బ్యాంకు రుణాలవైపే మొగ్గు చూపుతారు.

స్థిర ఆదాయం ఉంటే గానీ బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రావు. అలాంటప్పుడు ఏదో ఆస్తిని పూచీకత్తుగా ఉంచి రుణం పొందవచ్చు. ప్రైవేటు రుణాలను ఆశ్రయిస్తే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారిగా రుణం చెల్లించాలని ఒత్తిడి చేస్తే కష్టమవుతుంది. సంస్థాగత రుణాలు తీసుకోవడం ఎవరికైనా మంచిది. బ్యాంకులకు ముందుగా నిర్ణయించిన ఈఎమ్‌ఐలను చెల్లించుకుంటూ ఎటువంటి భారం లేకుండా రుణాన్ని తీర్చవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని