చిరు వ్యాపారుల‌ ప్రోత్సాహ‌కారి ముద్ర బ్యాంకు

చిన్న వ్యాపారాలు నిర్వహించేవారు ఆస్తులు హామీగా ఉంచకుండా, బ్యాంకు లేదా ఇతర ఆర్ఠిక సంస్ఠల వద్ద రుణాలు పొందడం కష్టం. దేశవ్యాప్తంగా 5.77 కోట్ల వరకూ చిన్న స్థాయి వ్యాపారాలు ఉన్నాయి. వీటన్నింటికీ అవసరమైన తోడ్పాటును అందించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ది సాధ్యమవుతుంది. చిన్న స్థాయి

Published : 16 Dec 2020 21:53 IST

చిన్న వ్యాపారుల‌కు హామీలేని రుణాలు అందిస్తూ త‌న‌దైన ముద్ర వేసుకున్న‌ముద్ర బ్యాంకు ప్రాముఖ్య‌త‌, రుణ మంజూరీ విధానాల గురించి తెలుసుకుందాం.

చిన్న వ్యాపారాలు నిర్వహించేవారు ఆస్తులు హామీగా ఉంచకుండా, బ్యాంకు లేదా ఇతర ఆర్ఠిక సంస్ఠల వద్ద రుణాలు పొందడం కష్టం. దేశవ్యాప్తంగా 5.77 కోట్ల వరకూ చిన్న స్థాయి వ్యాపారాలు ఉన్నాయి. వీటన్నింటికీ అవసరమైన తోడ్పాటును అందించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ది సాధ్యమవుతుంది. చిన్న స్థాయి పరిశ్రమలకు, వ్యాపారాలకు అవసరమైన నిధులను సమకూర్చడం ద్వారా వాటి అభివృద్దికి ముద్రా బ్యాంకు తోడ్పాటునందిస్తుంది.రుణాల‌ను అందుకునే క్ర‌మంలో ఈ ప‌రిశ్ర‌మ‌ల నిర్వాహ‌కులు ఎటువంటి ఆస్తుల‌ను హామీగా ఉంచ‌క్క‌ర్లేదు. ఉత్ప‌త్తి, వ్యాపార‌, సేవా రంగాల‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల‌కు రుణాల‌ను ముద్ర బ్యాంకు మంజూరు చేస్తుంది.

ముద్ర బ్యాంకు యోజ‌న‌ కింద రుణ మంజూరీని మూడు ప్ర‌త్యేక విభాగాలుగా చూస్తారు.
శిశు:
మొద‌టి ద‌శ‌లో రూ. 50 వేల వ‌ర‌కూ అవ‌స‌ర‌మైన రుణాలను వ్యాపారుల‌కు అంద‌జేస్తారు. ఈ రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కూ గ‌డువు ఇస్తారు.

కిషోర్‌:
ఈ ద‌శ‌లో రూ. 50 వేల నుంచి మొద‌లుకొని రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కూ అవ‌స‌ర‌మైన రుణాల‌ను స‌మ‌కూరుస్తారు.

త‌రుణ్‌:
చివ‌రి ద‌శ‌లో రూ. 5 ల‌క్ష‌ల నుంచి మొద‌లుకొని రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ అవ‌స‌ర‌మైన రుణాల‌ను స‌మ‌కూరుస్తారు.

నిధుల కేటాయింపు:
మొత్తం నిధుల్లో శిశు విభాగానికి 60 శాతం. మిగిలిన రెండు(కిషోర్‌, త‌రుణ్‌) విభాగాల‌కు 40 శాతం రుణాల‌ను కేటాయిస్తారు. సూక్ష్మ స్థాయి వ్యాపారాల‌కు ఇచ్చే ప్రాముఖ్య‌త‌ను ఇస్తారు.

ముద్రా బ్యాంకు ల‌క్ష్యాలు:
* సూక్ష్మ‌, చిన్న స్థాయి ప‌రిశ్ర‌మ‌ల‌కు రుణాలు జారీ చేసేందుకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తారు. అన్ని సూక్ష్మ రుణ సంస్థ‌లు ఒకేచోట న‌మోద‌యి, రుణాల‌ను అందిస్తాయి. వీటి నియంత్ర‌ణ‌ను ఒకే సంస్థ చేస్తుంది. చిన్న వ్యాపారాలు మ‌రింత‌గా విస్త‌రించేందుకు స‌హాయం చేస్తారు.
* అల్పాదాయ వ‌ర్గాల వారు సొంతంగా వ్యాపారాలు నిర్వ‌హించుకునేలా ఆర్థిక తోడ్పాటునిస్తారు.
* బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌కు దూరంగా ఉన్న‌వారికి త‌క్కువ వ‌డ్డీకి రుణాలు అందిస్తారు.
* రుణాలు ఇచ్చేట‌ప్పుడు ఎస్సీ, ఎస్టీ వారికి ప్రాధాన్య‌త‌నిస్తారు.
* ఉత్ప‌త్తి, వ్యాపార‌, సేవా రంగాల వారికి రుణాలందించే సూక్ష్మ రుణ సంస్థ‌ల‌ను నియంత్రిస్తారు.
అర్హ‌త‌:
ముద్రా యోజ‌న కింద అన్ని చిన్న వ్యాపారాలు, సంస్థ‌లకు రుణాల‌ను అంద‌జేస్తారు. ఏక యాజ‌మాన్య‌, భాగ‌స్వామ్య సంస్థ‌ల‌కు రుణాల‌ను అందిస్తారు. అంతే కాకుండా ఆహార ప‌దార్థాలు, కూర‌గాయ‌లు, పండ్ల వ్యాపారులు, హెయిర్ కంటింగ్ సెలూన్లు(క్షౌర శాల‌లు), బ్యూటీ పార్ల‌ర్లు, ట్రాన్స్‌పోర్టేష‌న్ స‌ర్వీసెస్‌, రిపెయిర్ షాపులు, స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, హాక‌ర్లు, క‌ళాకారులు, ఇత‌ర చిన్న‌స్థాయి వృత్తినిపుణులు, సేవా రంగాల వారు రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ రుణాలు పొందేందుకు అర్హులు.

పైనాన్సింగ్ ఏజెన్సీస్‌:
ఈ ప‌థ‌కం కింద ప్ర‌యోజ‌నం పొందేందుకు వ్యాపార ప్రణాళిక‌ల‌ను రూపొందించుకుని ఏదైనా ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు బ్యాంకుల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

ముద్రా బ్యాంకు రుణ సంస్థ‌లు
* అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వాణిజ్య బ్యాంకులు
* ప్రాంతీయ‌ గ్రామీణ బ్యాంకులు
* అన్ని సూక్ష్మ రుణ సంస్థ‌లు, స్మాల్ బిజినెస్ ఫైనాన్స్‌ కంపెనీలు, సెక్ష‌న్ 25 కింద ప‌నిచేసే సూక్ష్మ రుణ‌సంస్థ‌లు, ట్ర‌స్టులు, సొసైటీలు, లాభాపేక్ష లేని ఎన్‌బీఎఫ్‌సీలు
* షెడ్యూల్డ్ ప‌ట్ట‌ణ‌, రాష్ట్ర స‌హ‌కార బ్యాంకులు
ముద్రా కార్డు:
* రుణ మంజూరు త‌ర్వాత క్రెడిట్ కార్డు త‌రహాలో ఒక కార్డును మంజూరు చేస్తారు.
* రోజు వారీ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌ను భ‌రించేందుకు వీలుగా, రుణ మొత్తంలో 10 శాతం లేదా రూ. 10వేల వ‌ర‌కూ కార్డు ప‌రిమితి ఉంటుంది.
* ముద్రా కార్డుల‌ను బ్యాంకులు లేదా సూక్ష్మ రుణ సంస్థ‌లు మంజూరు చేస్తాయి.
* రూపే డెబిట్ కార్డుల మాదిరిగా ఉండే ఈ కార్డులు, రుణాల‌ను అందుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
* వీటిని ఏటీఎమ్‌, పాయింట్ ఆప్ సేల్స్‌(పీవోఎస్) యంత్రాల ద్వారా నిధుల‌ను డ్రా చేసుకునేందుకు, ఆన్‌లైన్ కొనుగోళ్లు జ‌రిపేందుకు వాడుకోవ‌చ్చు.

అవ‌స‌ర‌మ‌య్యే ప‌త్రాలు
* వ్య‌క్తిగ‌త గ‌ర్తింపు ప‌త్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
* పాస్‌పోర్ట్ / ఆధార్‌కార్డు / పాన్‌కార్డు
* కొనుగోలు చేయాల్సిన యంత్రాలు, వ‌స్తువుల కొటేష‌న్లు
* యంత్రాలు, ఇత‌ర వ‌స్తువుల స‌ప్ల‌యిర్ల వివ‌రాలు
* వ్యాపార నిర్వ‌హ‌ణ గుర్తింపు ప‌త్రాలు, వ్యాపార నిర్వ‌హ‌ణ చిరునామా, అవ‌స‌ర‌మ‌య్యే లైసెన్సులు, సర్టిపికేట్లు
* ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల వార‌యితే అందుకు సంబంధించిన గుర్తింపు ప‌త్రాలు
ముద్రా బ్యాంకు ప్ర‌యోజ‌నాలు:
* రుణం పొందేందుకు ఎటువంటి హామీ అవ‌స‌రం లేదు, రుణ ద‌ర‌ఖాస్తు రుసుం చెల్లించాల్సినక్క‌ర్లేదు.
* 1 శాతం వ‌డ్డీకే రుణాల మంజూరు.
* సుల‌భంగా రుణం మంజూరు చేసే ఈ ప‌ద్ధ‌తి వ‌ల్ల చిన్న వ్యాపారాలకు ఆర్థిక అండ ల‌భిస్తుంది.
* అల్పాదాయ వ‌ర్గాల‌కు చెందిన వ్యాపారస్థుల‌కు రుణం మంజూరు చేయ‌డం ద్వారా వారి సామాజిక‌, ఆర్థిక స్థితి మెరుగ‌వుతుంది. త‌ద్వారా దేశ ఆర్థికాభివృద్దికి బాట‌లు ప‌డ‌తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని