ఇంటి కొనుగోలుకు డౌన్‌పేమెంట్ భారం కాకుండా...

ఇల్లు కొనుగోలు చేసేందుకు 20శాతం డౌన్‌పేమెంట్ చెల్లించ‌డమ‌నేది కొంద‌రికి భారంగా ప‌రిణ‌మించ‌వ‌చ్చు. రుణ మొత్తంలో క‌నీసం 10 నుంచి 20శాతం దాకా సొమ్ము ఉంటేనే రుణం ఇవ్వాల్సిందిగా బ్యాంకుల‌కు ఆర్‌బీఐ దిశానిర్దేశం చేసింది. అంటే ఈ మొత్తం సొమ్మును జేబులోంచి తీసి స్థిరాస్తి

Published : 17 Dec 2020 18:33 IST

ఇల్లు కొనుగోలు చేసేందుకు 20శాతం డౌన్‌పేమెంట్ చెల్లించ‌డమ‌నేది కొంద‌రికి భారంగా ప‌రిణ‌మించ‌వ‌చ్చు. రుణ మొత్తంలో క‌నీసం 10 నుంచి 20శాతం దాకా సొమ్ము ఉంటేనే రుణం ఇవ్వాల్సిందిగా బ్యాంకుల‌కు ఆర్‌బీఐ దిశానిర్దేశం చేసింది. అంటే ఈ మొత్తం సొమ్మును జేబులోంచి తీసి స్థిరాస్తి డీల‌ర్‌కో యాజ‌మానికో ఇవ్వాల్సిందే. ఈ నేప‌థ్యంలో ఇల్లు కొనుగోలు చేసే అంశాన్ని కొన్ని ఏళ్ల ముందు నుంచే ప్లాన్ చేసుకోవ‌డం మంచిది. దీని వ‌ల్ల పెద్ద మొత్తంలో డ‌బ్బు జ‌మ‌చేసుకోగ‌లుగుతాం.

ఒక్కోసారి అద్దె ఇంట్లో నివ‌సించ‌డ‌మే స‌బ‌బు అనిపిస్తుంది. సొంత ఇంటి కొనుగోలు కోసం వెచ్చించే సొమ్మును ఏదైనా ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెడితే మంచి రాబ‌డి వ‌స్తుంది. ఐతే సొంత ఇంటి కొనుగోలుతో భావోద్వేగ‌పు అనుబంధం ఉంటుంది. ఇంటి కొనుగోలుతో వ‌చ్చే భ‌ద్ర‌త ఎక్కువ కాలంపాటు నిల‌వాలంటే ఇత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోవాలి. లేదా ఆ ప్ర‌భావం డౌన్‌పేమెంట్‌పై తీవ్రంగా ప‌డుతుంది. మ‌రి ఇత‌ర అంశాలేమిటో తెలుసుకుందామా…

వాయిదా చెల్లింపుల‌పై ప్ర‌భావం - నెల‌వారీ ఆదాయ రాబ‌డుల‌పై గృహ‌రుణ వాయిదా చెల్లింపుల ప్ర‌భావంపై అవ‌గాహ‌న లేక‌పోతే ఇంటిని సొంతం చేసుకున్నామ‌న్న ప్ర‌శాంత‌త కొంత కాల‌మే మిగిలిపోతుంది. ఈఎమ్ఐల భారంతో రాత్రిళ్లు నిద్ర‌ప‌ట్ట‌దు. చాలా మంది ఇంటి డౌన్‌పేమెంట్ క‌ట్టేందుకు తాము దాచుకున్న మొత్తాన్ని వెచ్చిస్తారు. దీంట్లో మ్యూచువ‌ల్ ఫండ్లు, ఫిక్స‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతా సొమ్ము అన్నీ వ‌చ్చేస్తాయి.

దీంట్లోని పెట్టుబ‌డిని తీసుకోవ‌డంలో త‌ప్పేమీ లేదు. ఆ త‌ర్వాత వాయిదా చెల్లించేందుకు కొంత సొమ్ము మిగిల్చుకోక‌పోవ‌డ‌మే పొర‌పాటు. ఇంటి కొనుగోలు వ‌ల్ల అతి పెద్ద విలువైన ఆస్తి సొంత‌మ‌వుతుంది. ఐతే దీంట్లో మ‌నం నివ‌సిస్తాం కాబ‌ట్టి ఎలాంటి రాబ‌డిని అందించ‌లేదు. అందుకే ఇంటికి చెల్లించే డౌన్‌పేమెంట్‌, చెల్లించ‌బోయే ఈఎమ్ఐలు రెండూ అందుబాటు ధ‌ర‌లో ఉండాలి. త‌గినంత సంప‌ద లేక‌పోతే కొన్నాళ్లు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవ‌డ‌మే మంచిది.

ఇత‌ర ఖ‌ర్చుల‌ను దృష్టిలో…రిజిస్ట్రేష‌న్, స్టాంప్ డ్యూటీ, బ్రోక‌రేజీ ఛార్జీలు(ఒక వేళ బ్రోక‌ర్ ద్వారా కొంటే) ఇవ‌న్నీ డౌన్‌పేమెంట్ కిందికి రావు. ఇవ‌న్నీ ఇంటి కొనుగోలుదారు భ‌రించాలి. ఇవి కాకుండా ఇంటికి అద‌న‌పు హంగులు అద్దేందుకు ల‌క్ష‌ల్లోనే ఖ‌ర్చ‌వుతుంది. నిర్మాణంలో ఉన్నవి అనుకున్న స‌మ‌యానికి పూర్తికాక‌పోతే ఇటు మ‌నం అద్దె ఇంట్లో ఉంటే దానికి చెల్లించాలి, వాయిదాలు పెరుగుతూ ఉంటాయి. కాబ‌ట్టి ఇత‌ర ఖ‌ర్చుల‌నూ దృష్టిలో పెట్టుకోవాలి. ముందుగా మొద‌లుపెట్టేయండి - ఇంటి కొనుగోలుకు ఎంతో ముందుగా మ‌దుపు చేయ‌డంలో త‌ప్పేమీ లేదు. ప్ర‌స్తుతం మీరు అందుకునే వేత‌నం, ఎంత పొదుపు చేయ‌గ‌ల‌రు, స్థిరాస్తి ధ‌ర‌ల‌ను బ‌ట్టి ఇది నిర్ణ‌య‌మ‌వుతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు రూ.25ల‌క్ష‌లు జ‌మ‌చేయాల‌నుకున్నార‌నుకుందాం. నెల‌కు రూ.5వేలు చేస్తే 15ఏళ్లు ప‌డుతుంది. అదీ 12శాతం రాబ‌డి అంచ‌నా వేసుకుంటేనే సాధ్య‌ప‌డుతుంది. ఎప్పుడూ కూడా ముందు పొదుపు చేసి ఆ త‌ర్వాత ఆస్తి కొనుగోలు చేయ‌డం మంచిది… ముందే ఆస్తి కొనేసి ఆ త‌ర్వాత మ‌దుపు చేస్తామంటే త‌గ‌ని ప‌ని. ఇత‌ర ల‌క్ష్యాల లాగే డౌన్‌పేమెంట్ ల‌క్ష్యానికి త‌గినంత స‌మ‌యంలోగా పూర్తి అయ్యేలా ప్లాన్ వేసుకోవాలి.

ఎలాంటి ప్ర‌ణాళిక లేకుండా కొంటే మాత్రం, దీర్ఘ‌కాలంపాటు పొదుపు చేసిందంతా భ‌విష్య‌త్‌లో రిస్క్‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ విధానం ద్వారా ముందు నుంచీ మ‌దుపు అల‌వాటుచేసుకోవ‌చ్చు. ఇంటి కొనుగోలు స‌మ‌యంలో డౌన్‌పేమెంట్ చేసేట‌ప్పుడు డ‌బ్బు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు వ్య‌క్తిగ‌త రుణం పొందొచ్చు. ఐతే దీనికి బ‌దులుగా దీర్ఘ‌కాల ప‌థ‌కాల్లో అంటే 8-10ఏళ్ల దాకా ఉండే ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి ఉండాలి. ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో కొంచెం కొంచెం డ‌బ్బును మ‌దుపు చేస్తే కొన్నేళ్ల త‌ర్వాత పెద్ద మొత్తంలో జ‌మ అవుతుంది. ఆర్థిక వ్య‌వ‌స్థ బాగా అభివృద్ధి చెందే అవ‌కాశాలెక్కువ కాబ‌ట్టి మంచి రాబ‌డుల‌ను భ‌విష్య‌త్‌లో ఆశించ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని