రుణాలు- వాటి ర‌కాలు

బ్యాంకు ఖాతాలో నిల్వ‌ల‌కు మించి అద‌న‌పు న‌గ‌దును పొందే సౌక‌ర్యాన్ని ఓవ‌ర్‌డ్రాఫ్ట్ అని అంటారు. ఖాతాదారుడిని, బ్యాంకును బ‌ట్టి ఓవ‌ర్ డ్రాఫ్ట్‌ ద్వారా పొందే రుణ‌ప‌రిమితుల‌లో స్వ‌ల్ప మార్ప‌లు ఉంటాయి. ఓవ‌ర్ డ్రాఫ్ట్ పొందేందుకు బ్యాంకులకు పూచీక‌త్తు స‌మ‌ర్పించాల్సి

Published : 17 Dec 2020 22:09 IST

ఓవ‌ర్‌డ్రాఫ్ట్
బ్యాంకు ఖాతాలో నిల్వ‌ల‌కు మించి అద‌న‌పు న‌గ‌దును పొందే సౌక‌ర్యాన్ని ఓవ‌ర్‌డ్రాఫ్ట్ అని అంటారు. ఖాతాదారుడిని, బ్యాంకును బ‌ట్టి ఓవ‌ర్ డ్రాఫ్ట్‌ ద్వారా పొందే రుణ‌ప‌రిమితుల‌లో స్వ‌ల్ప మార్ప‌లు ఉంటాయి. ఓవ‌ర్ డ్రాఫ్ట్ పొందేందుకు బ్యాంకులకు పూచీక‌త్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దాదాపు అన్ని ప్ర‌ధాన బ్యాంకులు ఓవ‌ర్‌డ్రాఫ్ట్ స‌దుపాయాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి.

క్రెడిట్‌కార్డు రుణాలు
క్రెడిట్‌కార్డు ఆధారంగా తీసుకునే రుణం వ్య‌క్తిగ‌త రుణం లాంటిదే. క్రెడిట్ కార్డు పొందేందుకు ముంద‌స్తుగా గుర్తింపు ప్ర‌తాలు స‌మ‌ర్పించి ఉంటారు కాబ‌ట్టి కార్డు వాడే ప్ర‌తి సారీ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన ప‌ని ఉండ‌దు. కాక‌పోతే క్రెడిట్ కార్డు బిల్లులు క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లిస్తే స‌రి. వ్య‌క్తిగ‌త రుణాల‌తో పోలిస్తే క్రెడిట్ కార్డుల వాడ‌కంపై స్వ‌ల్ప మోతాదులో వ‌డ్డీ రేట్లు ఉంటాయి.

గృహ రుణం
ఇల్లు కొనుగోలు, నిర్మాణం, స్థ‌లం కొనుగోలు, గృహ మ‌ర‌మ్మ‌తు రుణం, స్థిరాస్తిపై రుణం వంటి రుణాల‌ను గృహ రుణంలో భాగంగా అంద‌జేస్తారు. వాయిదా ప‌ద్ధ‌తిలో రుణాన్ని చెల్లించేందుకు 5 నుంచి 20 ఏళ్ల వ‌ర‌కూ గ‌డువు ఇస్తారు. బ్యాంకులు అందించే అన్ని రకాల రుణాల్లో ఈ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. ఈ రుణాల‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద ప‌న్ను మిన‌హాయింపు సైతం ఉంటుంది.

విద్యా రుణం
ఉన్న‌త విద్య‌కు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడ‌ద‌ని ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌క‌రంగా విద్యా రుణాల‌ను అందుబాటులో ఉంచింది. రూ. 4 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకునే రుణాల‌కు ఎటువంటి పూచీక‌త్తు అవ‌స‌రం లేదు. భార‌త‌దేశంలో అయితే రూ. 10 ల‌క్ష‌లు, విదేశాల్లో అయితే రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ గ‌రిష్ఠంగా విద్యా రుణాన్ని పొంద‌వ‌చ్చు. ఈ రుణాల‌కు వ‌డ్డీ రేట్లు 10 నుంచి 15 శాతం వ‌ర‌కూ ఉంటాయి. హాలిడే పీరియ‌డ్ త‌ర్వాత 5 నుంచి 7 ఏళ్ల‌లోపు వాటిని తీర్చాల్సి ఉంటుంది.

కారు రుణం
వ్య‌క్తిగ‌త ఆదాయం ఏడాదికి రూ. 2.4 ల‌క్ష‌లు ఆపైన ఉన్న‌వారికి బ్యాంకులు కారు రుణాలు మంజూరు చేస్తాయి. 20 నుంచి 65 ఏళ్ల‌లోపు వ‌య‌సు ఉండి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న‌వారు, వృత్తినిపుణులు ఈ రుణాల‌ను పొంద‌వ‌చ్చు. కారు ధ‌ర‌లో 80 నుంచి 100 శాతం వ‌ర‌కూ రుణాన్ని పొంద‌వ‌చ్చు. కారు రుణాన్ని 1 నుంచి 7 ఏళ్ల‌లోగా చెల్లించాల్సి ఉంటుంది.

వ్య‌క్తిగ‌త రుణం
ఉన్న‌త విద్య‌, వివాహం, ఇంటి మ‌రమ్మ‌తు, క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లింపుల కోసం చాలా మంది వ్య‌క్తిగ‌త రుణం తీసుకుంటూ ఉంటారు. దీనికి పూచీక‌త్తు అవ‌స‌రం లేదు. నెల‌వారీ ఆదాయం ఆధారంగా బ్యాంకులు ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి. ఇందుకోసం స‌మ‌ర్పించాల్సిన ప‌త్రాలు సైతం త‌క్కువ‌గానే ఉంటాయి. వ్య‌క్తిగత రుణాల‌పై వ‌డ్డీ రేట్లు 12 నుంచి 30 శాతం వ‌ర‌కూ ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణాల‌కు కాల‌ప‌రిమితి 1 నుంచి 5 ఏళ్ల వ‌ర‌కూ ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై రుణాలు
దీర్ఘ‌కాల ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా పిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లు చేయ‌డం ప‌రిపాటే. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డ‌బ్బు అవ‌స‌ర‌మైతే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ర‌ద్దు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లోని సొమ్మ‌ను పూచీక‌త్తుగా తీసుకొని బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి. మొత్తం ఎఫ్‌డీ విలువ‌లో 70 నుంచి 80 శాతం వ‌ర‌కూ రుణం పొంద‌వ‌చ్చు. వ‌డ్డీ రేట్లు ఎఫ్‌డీకి చెల్లించే దాని కంటే 1 నుంచి 2 శాతం ఎక్కువగా ఉంటాయి.

బీమా పాల‌సీల‌పై రుణాలు
జీవిత బీమా పాల‌సీల‌ను స్వాధీన‌ప‌రిచి బ్యాంకు రుణాలు పొందే అవ‌కాశం ఉంది. జీవిత బీమా పాల‌సీ తీసుకున్న 3 ఏళ్ల త‌ర్వాత నుంచి వాటికి స్వాధీన విలువ వ‌స్తుంది. పెట్టుబ‌డి క‌లిసి ఉన్న పాల‌సీల‌పై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు మొగ్గుచూపుతాయి.
విలువ‌లో 90 శాతానికి పైగానే రుణం పొందే వీలుంది. ఉదా: ఎండోమెంట్‌, మ‌నీబ్యాక్ పాల‌సీలు పాల‌సీ

ఈపీఎఫ్‌, పీపీఎఫ్ పై రుణాలు
ఈపీఎఫ్‌లో ఉన్న సొమ్ము ఆధారంగా ఉద్యోగులు రుణం తీసుకోవ‌చ్చు.  ఉద్యోగ భ‌విష్య‌నిధిలో చేరిన రెండో సంవ‌త్స‌రం నుంచి రుణం పొంద‌వచ్చు. ప్రావిడెంట్ ఫండ్ ప‌థ‌కంలో భాగంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సొమ్ము జ‌మ‌చేస్తారు. పీపీఎఫ్‌ డిపాజిట్ హామీగా ఉంచి రుణం తీసుకోవ‌చ్చు. పీపీఎఫ్‌పై తీసుకున్న రుణాన్ని 36 నెల‌ల్లోగా చెల్లించ‌వ‌చ్చు.  ఏ ఇత‌ర మార్గం లేక‌పోతే మాత్ర‌మే ఈ ర‌క‌మైన రుణాల‌ను ఆశ్ర‌యించాలి.

షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై రుణాలు
షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ల‌ను హామీగా ఉంచ‌డం ద్వారా రుణాన్ని తీసుకోవ‌చ్చు. స‌త్వ‌ర అవ‌స‌రాలు తీర్చుకునేందుకు ఈ ర‌క‌మైన రుణాల‌ను ఆశ్ర‌యిస్తారు. మార్కెట్ విలువ‌లో 70 శాతం వ‌ర‌కూ రుణం పొంద‌వ‌చ్చు. రూ. 10 వేల నుంచి మొద‌లుకొని గ‌రిష్ఠంగా రూ. 20 లక్ష‌ల వ‌ర‌కూ రుణం తీసుకోవ‌చ్చు. 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల  వ‌య‌సు లోపు వారు ఈ రుణాలు తీసుకునేందుకు అర్హులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని