గృహ రుణాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేయాలనుకుంటున్నారా?

ఇంటి రుణాల బదిలీ కోసం బ్యాంకులు అందించే ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈఎంఐ హాలిడే, గిఫ్ట్ వోచర్స్ మొదలైన వాటిని కూడా వారు ఆఫర్ చేయవచ్చు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో మీరు ఎలాంటి వాటిని కోల్పోతారో మీకు తెలుసా? దీర్ఘ కాలంలో మీ ఆర్ధిక పరిస్థితులపై వీటి ప్రభావం ఎలా

Published : 19 Dec 2020 18:27 IST

ఇంటి రుణాల బదిలీ కోసం బ్యాంకులు అందించే ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈఎంఐ హాలిడే, గిఫ్ట్ వోచర్స్ మొదలైన వాటిని కూడా వారు ఆఫర్ చేయవచ్చు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో మీరు ఎలాంటి వాటిని కోల్పోతారో మీకు తెలుసా? దీర్ఘ కాలంలో మీ ఆర్ధిక పరిస్థితులపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీలైనంత వ‌ర‌కు రుణం తీసుకున్న బ్యాంకులోనే కొన‌సాగేందుకు ప్ర‌య‌త్నించండి. ఇతర బ్యాంకులు అందించే వడ్డీ రేటుకి, ప్రస్తుతం మీరు కొనసాగుతున్న బ్యాంకు అందించే వడ్డీ రేటు మధ్య తేడా అధికంగా ఉంటే మాత్రమే రుణాన్ని బదిలీ చేయడం మంచిది. ఇత‌ర బ్యాంకుల‌తో పోలిస్తే మీ బ్యాంకులో వ‌డ్డీ కేవలం 5 నుంచి 20 బేసిస్ పాయింట్స (బీపీఎస్) వ్యత్యాసం మాత్రమే ఉంటే, మీ గృహ రుణాన్ని బదిలీ చేయకుండా ఉండడం మంచిది. 25 బేసిస్ పాయింట్ల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, అప్పుడు మీరు బదిలీ గురించి ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం దాని ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు.

కేవలం వడ్డీ రేటు ఒక్కటే కాకుండా, కొన్ని ఇతర అంశాలను కూడా మీరు ప‌రిశీలించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రుణ బదిలీలో ప్రాసెసింగ్ ఫీజు, నిర్వాహక చార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు వంటి ఛార్జీలు ఉంటాయి. మీ మొత్తం అవుట్ స్టాండింగ్ పై కొత్త బ్యాంకు 0.25 నుంచి 1 శాతం అదనంగా చార్జ్ చేయవచ్చు. గృహ రుణం లక్షల రూపాయలలో ఉంటుంది కాబట్టి, అదనంగా చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండచ్చు.

అదనంగా, మీరు కొత్త రుణదాతకు కూడా ఇంతక ముందు చేసిన విధంగా పేపర్ వర్క్ చేయవలసి ఉంటుంది. కొత్త రుణదాత సాంకేతిక, చట్టపరమైన అంచనాలకు కూడా బాధ్యత వహిస్తారు, దీనిని కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే, అడ్మినిస్ట్రేషన్ రుసుమును కూడా చెల్లించవలసి ఉంటుంది.

స్థిర రేటు నుంచి ఫ్లోటింగ్ కు మారడం:

ఒకవేళ మీరు బ్యాలెన్స్ బదిలీ చేయాలనీ నిర్ణయించుకుంటే, స్థిర రేటు నుంచి ఫ్లోటింగ్ కు మారండి. ఒకవేళ మీరు గృహ రుణం స్థిర వడ్డీ రేటుతో తీసుకున్నట్లయితే, దాని పనితీరుతో మీరు సంతోషంగా లేకపోతే, అప్పుడు మీరు ఫ్లోటింగ్ రేటుతో బ్యాలన్స్ బదిలీని ప్రారంభించవచ్చు.

అదే సమయంలో, మీరు ఇప్పటి వరకు రుణ మొత్తంలో ఎంత మొత్తాన్ని చెల్లించారో అనే అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ రుణ మొత్తంలో ఒక పెద్ద భాగాన్ని మీరు చెల్లించినట్లయితే, బ్యాలెన్స్ బదిలీని ఎంచుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలాగే గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, ఒకవేళ రుణం ఒక ఫ్లోటింగ్ రేటు తో ముడిపడి ఉన్నట్లయితే, బ్యాంకులు ముందస్తు చెల్లింపు లపై జరిమానాను వసూలు చేయవు.

పెనాల్టీ నిబంధనలను తనిఖీ చేయండి:

మీ ప్రస్తుత బ్యాంకు బ్యాలెన్స్ బదిలీకి పెనాల్టీ చార్జ్ లను వసూలు చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు గృహ రుణ ఒప్పంద పత్రాన్ని తనిఖీ చేయండి. రుణం తీసుకున్న ప్రారంభంలో దీనికి సంబంధించిన చార్జీలు ఎక్కువగా ఉండవచ్చు, కానీ సమయం పెరిగే కొద్దీ చార్జీల రేటు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, గృహ రుణాన్ని బదిలీ చేసే సమయంలో పొందే ప్రయోజనాలతో పాటు పెనాల్టీ కూడా ఉంటుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొండి. నిర్ణయం తీసుకుని అగ్రిమెంట్ పై సంతకం చేసే ముందు స్పష్టంగా ఆలోచించండి.

గృహ రుణంతో జీవిత బీమాను కొనుగోలు చేయడం తప్పనిసరా?

గృహ రుణ బ్యాలెన్స్ బదిలీతో పాటు జీవిత బీమా వంటివి బ్యాంకులు అందించడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణమైన విషయమే. చాలా సందర్భాల్లో, బ్యాంకు కార్యనిర్వాహకులు జీవిత బీమాను తీసుకోవడం తప్పనిసరని చెప్తుంటారు, కానీ ఇది నిజం కాదు. గృహ రుణంతో పాటు ఏవైనా అదనపు ఉత్పత్తులను ఎంచుకోవడమనేది కేవలం మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.

మీరు బ్యాలెన్స్ బదిలీని ఎప్పుడు పరిగణించాలి?

గణనీయమైన ఖర్చులు, విధానపరమైన అవసరాలను పరిగణలోకి తీసుకుంటే, మీ ప్రస్తుత బ్యాంకు, రుణ బదిలీ చేయాలనుకుంటున్న బ్యాంకు మధ్య వడ్డీ రేటులో తేడా 25 బేసిస్ పాయింట్లకు సమానంగా లేదా తక్కువగా ఉన్నట్లయితే, రుణ బ్యాలెన్స్ బదిలీ మీకు అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ, ఒకవేళ వీటి మధ్య తేడా 25 బేసిస్ పాయింట్ల స్థాయిని మించినట్లయితే, పైన చెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మీరు బ్యాలెన్స్ బదిలీని పరిగణలోకి తీసుకోవచ్చు.

ఏప్రిల్ 01, 2016న బ్యాంకులు వారి వడ్డీ రేట్లను నిర్ణయించడానికి మార్జినల్ కాస్ట్ - బేస్డ్ లెండింగ్ రేటును (ఎంసీఎల్ఆర్) అనుసరించాలని ఆర్బీఐ ఆదేశించింది. పాలసీ రేట్లలో మార్పులను త్వరగా రుణగ్రహీతలకు బదిలీ చేయడం ద్వారా ఎంసీఎల్ఆర్ విధానం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉంటుంది.

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ (ఎన్బీఎఫ్సీ), హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ (హెచ్ఎఫ్సీ) ఇప్పటికీ పాత ప్రైమ్ లెండింగ్ రేట్ (పీఎల్ఆర్) ఆధారిత వ్యవస్థను అనుసరిస్తున్నాయి. మీ రుణ‌దాత కూడా ఇదే విధానాన్ని అనుస‌రిస్తే మీ రుణ బ‌దిలీకి ఇది కూడా ఒక కార‌ణంగా ప‌రిశీలించ‌వచ్చు.

చివరిగా, మీ ప్రస్తుత బ్యాంకు ఇతర బ్యాంకులతో సమానంగా మీకు వడ్డీ రేట్లను అందించినా, వేరే వాటితో పోలిస్తే స్వ‌ల్ప వ్య‌త్యాసం ఉన్నా బ‌దిలీ చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఒకవేళ రెండిటి మధ్య తేడా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రుణ బ్యాలన్స్ ను బదిలీ చేసుకోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని