కార్డుతో...వాయిదాల్లో...

గృహోపకరణాల దగ్గర నుంచి దుస్తుల దాకా ఎక్కడ చూసినా భారీ రాయితీలు స్వగతం పలకడం మనం చూస్తూనే ఉంటాం. సాధారణ స్థాయి కంటే మనల్ని ఎక్కువగా ఖర్చు పెట్టెలాగా చేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు నగదు ఎలా? క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే…ఒక్కసారి బిల్లు మొత్తం

Published : 22 Dec 2020 12:04 IST

గృహోపకరణాల దగ్గర నుంచి దుస్తుల దాకా ఎక్కడ చూసినా భారీ రాయితీలు స్వగతం పలకడం మనం చూస్తూనే ఉంటాం. సాధారణ స్థాయి కంటే మనల్ని ఎక్కువగా ఖర్చు పెట్టెలాగా చేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు నగదు ఎలా? క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే…ఒక్కసారి బిల్లు మొత్తం చెల్లించడం సాధ్యం కాకపొతే? ఇలాంటప్పుడు ‘నెలసరి వాయిదాలు’ ఉపయోగపడతాయి. ఇలాంటి కొనుగోళ్లను ప్రోత్సహించడానికి క్రెడిట్ కార్డు కంపెనీలు కూడా రక రకాల ఆఫర్లను ప్రవేశ పెడుతుంటాయి. నగదు వెనక్కి, ఈఎంఐ లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొనండి, మీకు నచ్చిన విధంగా చెల్లించండి అంటూ కార్డులు కొనుగోలుదారులకు ఖర్చు పెట్టేందుకు భరోసానిస్తున్నాయి. అయితే, ఇది వినడానికి బాగానే ఉన్నా…ఆచరణ లో మాత్రం కొంత ఇబ్బందే. సౌకర్యం మాటున దాగిన రహస్యాలను తెలుసుకోకుంటే జేబు భారం తప్పదు.

సౌకర్యమే! అయినా…

క్రెడిట్ కార్డు మీద భారీ మొత్తం లో కొనుగోలు చేసినప్పుడు నెలసరి వాయిదాల్లో చెల్లించడం ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. గృహ రుణం, వ్యక్తిగత రుణం చెల్లించినట్టుగానే ఇదీ ఉంటుంది. తాత్కాలికంగా చేతిలో డబ్బు లేనప్పుడు ఇది కాస్త ఉపసమానమే. ఈఎమ్ఐ సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా కొన్ని ప్రత్యేక దుకాణాల్లో కొనుగోళ్లు జరిపినప్పుడు మాత్రమే ఈ సౌకర్యం లభించవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, సిటీ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు లాంటివి ఖాతాదారులను బట్టి సున్నా, 1.49, 1.99 శాతం వరకూ వడ్డీ విధిస్తాయి. వ్యక్తి రుణాల కన్నా క్రెడిట్ కార్డులు అందించే ఇలాంటి రుణాలకు ఎలాంటి పత్రాలూ అవసరం ఉండవు. ఈఎమ్ఐ తీసుకునే ముందు వడ్డీ, ఇతర వివరాల గురించి క్రెడిట్ కార్డు కంపెనీ తో చర్చించడం మర్చిపోకండి.

ఎప్పుడు తీసుకోవాలంటే…

నగదు లభ్యత కష్టకరంగా ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే అనవసరంగా రుసుములు భరించాల్సి ఉంటుంది. పైగా 30 నుంచి 40 శాతం వార్షిక వడ్డీ కూడా విధిస్తాయి బ్యాంకులు. పైగా సకాలం లో బాకీ చెల్లించకపోతే క్రెడిట్ స్కోరు పై ప్రభావం కూడా పడుతుంది. దీని కన్నా కూడా వాయిదాల పధ్ధతి లో చెల్లించడం సులువు.

చూడాల్సినవివే…

పరిమితి
ఈఎమ్ఐ చెల్లించినన్ని రోజులూ కార్డు పరిమితి ని గరిష్టంగా ఉపయోగించుకోలేరు. ఉదాహరణకి మీ కార్డు గరిష్ట పరిమితి రూ. 50 వేలు అనుకుందాం. రూ. 25 వెలను ఈఎమ్ఐ కింద చెల్లించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు మీ కార్డు మీద రూ. 25 వేలు వరకే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. ఈఎమ్ఐ చెల్లిస్తున్న కొద్దీ పరిమితి కూడా పెరుగుతుంది.

అదనపు రుసుములు
పేరుకి సున్నా శాతం వడ్డీ అయినప్పటికీ డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ ఫీజు, కింద బ్యాంకులు కొంత మొత్తాన్ని వాసులు చేస్తాయి. వ్యవధి తీరక ముందు చెల్లించాలనుకుంటే బాకీ ఉన్న మొత్తం పై 3 శాతం వరకు రుసుము విధిస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని అందుబాటు లో ఉన్న ఇతర అవకాశాలను చూడడం ఉత్తమం.

రాయితీలు
కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు కొనుగోళ్ల పై 5 నుంచి 10 శాతం వరకు రాయితీలు కూడా ప్రకటిస్తుంటారు. ఒక విధంగా ఇది కాష్ బ్యాక్ ఆఫర్ లాంటిదే. పైగా ఈఎమ్ఐ గా కూడా మార్చుకోవచ్చు. అయితే, కేవలం వీటిని ఆధారంగా చేసుకునే కొనుగోలు చేయకుండా…నిజంగా మీకు ఎంత వరకు అవసరం అన్నది చూసుకోండి.

చెల్లించకపోతే..
ఒకసారి ఈఎమ్ఐ గా మార్చుకున్న తరువాత ఖచ్చితంగా నెల నెలా బాకీ ని చెల్లించండి. ఒక్కసారి చెల్లించకపోయినా అధిక మొత్తం లో రుసుములు విధిస్తారు. పైగా మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్డు బాకీ గా మార్చి మరుసటి నెల బిల్లు లో కలిపి పంపిస్తారు.

చివరిగా…

క్రెడిట్ కార్డు రెండు వైపులా పదునున్న కట్టి లాంటిదన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అత్యవసరం అనుకుంటేనే కార్డు ను ఉపయోగించి కొనుగోళ్లు చేయాలి. వాయిదాల్లో కట్టేందుకు అవకాశం ఉంది కదా! అని అక్కర్లేని వన్నీ కొంటే…మన ఆర్ధిక ప్రణాళిక దెబ్బ తింటుందన్న విషయం మర్చిపోకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని