వ్యక్తిగత రుణాలు vs క్రెడిట్ కార్డులు

మీ నగదు అవసరాన్ని తీర్చడానికి మార్కెట్లో వివిధ రకాల అవకాశాలు అందుబాటులో ఉంటాయి. మీకు ఆర్ధిక సహాయం అవసరమైనప్పుడు, బ్యాంకులు ఒక ఉత్తమ ప్లాట్ ఫారంగా ఉంటూ మీకు సహాయం చేయడానికి అనేక మార్గాలను కలిగి ఉన్నాయి. మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోడానికి రుణాలను తీసుకోవడం ఉత్తమమైన మార్గమని

Published : 23 Dec 2020 09:42 IST

మీ నగదు అవసరాన్ని తీర్చడానికి మార్కెట్లో వివిధ రకాల అవకాశాలు అందుబాటులో ఉంటాయి. మీకు ఆర్ధిక సహాయం అవసరమైనప్పుడు, బ్యాంకులు ఒక ఉత్తమ ప్లాట్ ఫారంగా ఉంటూ మీకు సహాయం చేయడానికి అనేక మార్గాలను కలిగి ఉన్నాయి. మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోడానికి రుణాలను తీసుకోవడం ఉత్తమమైన మార్గమని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. సాధారణంగా వ్యక్తిగత రుణాలుగా పిలువబడే భద్రత లేని రుణాలు కేవలం ఉద్యోగస్తులకు, స్వయం ఉపాధి పొందే వారికి మాత్రమే అందుబాటులో ఉండే ప్రముఖ క్రెడిట్ ఉత్పత్తిగా చెప్పవచ్చు. అయితే, వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. కానీ రుణగ్రహీతలకు మాత్రం ఈ రెండు ఉత్పత్తుల్లో ఏది మంచిదో అర్ధం కావడం లేదు. వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డుల కంటే మెరుగైన ఎంపికని చాలా మంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారని Qbera.com వ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్య కుమార్ తెలిపారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయన తెలిపారు.

తక్కువ వడ్డీ రేట్లు:

క్రెడిట్ కార్డులపై ఉన్న వడ్డీ రేట్ల కంటే వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు ఏపిఆర్ (యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ అఫ్ ఇంట్రెస్ట్) చూస్తే, క్రెడిట్ కార్డులు సంవత్సరానికి 35 శాతం నుంచి 40 శాతం పరిధిలో వడ్డీ రేట్లను ఆకర్షిస్తాయి. కానీ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు మాత్రం సంవత్సరానికి కేవలం 10.99 శాతం నుంచి ప్రారంభమై 24 శాతం వరకు ఆకర్షిస్తాయి. చాలా మంది రుణదాతలు 11 శాతం నుంచి 18 శాతం పరిధిలోనే వడ్డీ రేట్లను అందిస్తారు.

ఫ్లెక్సిబుల్ తిరిగి చెల్లించే కాలపరిమితి:

మీరు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే, రుణ కాల పరిమితిని కూడా ఎంచుకోవచ్చు. రుణ కాల పరిమితి సాధారణంగా 6 నెలల నుంచి 60 నెలల మధ్య అందుబాటులో ఉంటుంది, కొందరు రుణదాతలు మాత్రం కేవలం 3 నెలల కాలవ్యవధులతో అసురక్షిత రుణాలను అందిస్తున్నారు. క్రెడిట్ కార్డుల విషయంలో, మీ మొత్తం అవుట్ స్టాండింగ్ బ్యాలన్స్ లో 3 శాతాన్ని కనీస నెలవారీ చెల్లింపు కింద చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని కూడా మీరు నెలవారీ ఈఎంఐ కింద మార్చుకోవచ్చు, కానీ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి.

విస్తృత శ్రేణి రుణ మొత్తాలు:

క్రెడిట్ కార్డుల విషయంలో, మీ నెలవారీ ఆదాయానికి రెండు రెట్లు అధికమైన క్రెడిట్ పరిమితిని బ్యాంకులు అందిస్తాయి. అదే వ్యక్తిగత రుణాల విషయానికి వస్తే, మీ నెలవారీ ఆదాయాన్ని ఆరు రెట్లు లేదా అంత కంటే ఎక్కువ రుణాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, ప్రస్తుత రోజుల్లో రుణగ్రహీతలు తమ రుణ కాలపరిమితిలో కొంత గడువు ముగిసిన తర్వాత టాప్ అప్ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రుణ దాతలు అందిస్తున్నారు. సాధారణంగా, కనీసం ఒక సంవత్సరం కాలపరిమితి పూర్తి చేసిన వ్యక్తులకు మాత్రమే రుణదాతలు టాప్ అప్ రుణాలను అందిస్తారు.

నామమాత్రపు ముందస్తు చెల్లింపు ఛార్జీలు:

వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడం వలన కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీ నెలవారీ వాయిదా మొత్తాన్ని తగ్గించుకోడానికి, ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అలాగే నామమాత్రపు ఛార్జీతో మీ రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు. సాధారణంగా ముందస్తు చెల్లింపు చార్జీలు మీ ప్రస్తుత అవుట్ స్టాండింగ్ ప్రిన్సిఫల్ పై 2 శాతం నుంచి 5 శాతం వరకు ఉంటాయి, దానితో పాటు ప్రత్యేక వడ్డీ చార్జితో ఉంటాయి. రుణ ముందస్తు చెల్లింపు చార్జీలను ఒక్కో రుణదాత ఒక్కో విధంగా వసూలు చేస్తారు. అన్ని బ్యాంకులు వాటి క్రెడిట్ కార్డులపై వడ్డీ లేని కాలవ్యవధిని అందిస్తాయి. నిర్దిష్ట కాల పరిమితిలోగా కార్డుపై ఉన్న మొత్తం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ను చెల్లించగలిగితే, మీరు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని