జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఇల్లు కొనుగోలు చేస్తే క‌లిగే ప్ర‌యోజ‌నాలు

ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది ప్ర‌జ‌ల‌కు ఇల్లు కొనుగోలు చేయడం వారి జీవితంలో తీసుకునే అతి పెద్ద‌ నిర్ణ‌యం. ఇల్లు కొనుగోలు చేయాల‌నుకునేవారు వారి కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాల‌కు, వారి వారి ఆర్ధిక స్థితిగ‌తుల‌కు లోబ‌డి కొనుగోలు చేయాలి. అయితే దీని కోసం వారు పెద్ద మొత్తంలో న‌గ‌దును వెచ్చించాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి వారు

Published : 23 Dec 2020 11:01 IST

ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది ప్ర‌జ‌ల‌కు ఇల్లు కొనుగోలు చేయడం వారి జీవితంలో తీసుకునే అతి పెద్ద‌ నిర్ణ‌యం. ఇల్లు కొనుగోలు చేయాల‌నుకునేవారు వారి కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాల‌కు, వారి వారి ఆర్ధిక స్థితిగ‌తుల‌కు లోబ‌డి కొనుగోలు చేయాలి. అయితే దీని కోసం వారు పెద్ద మొత్తంలో న‌గ‌దును వెచ్చించాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి వారు ఇప్ప‌టివ‌ర‌కు పొదుపు చేసిన మొత్తాన్ని ఇంటి కోసం వినియోగించ‌వ‌ల‌సిరావ‌చ్చు. కాబ‌ట్టి ఇల్లు కొనుగోలు చేసే ముందు ప్ర‌తి చిన్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాల్సి వుంటుంది. ఇంటిని కొనుగోలు చేస్తున్న‌ప్పుడు మీ జీవిత భాగ‌స్వామిని మీ సహ య‌జ‌మానిగా చేసుకోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వ‌ల‌న మీరు తీసుకునే రుణానికి మ‌రికొంత అద‌న‌పు రుణం పొంద‌వ‌చ్చు. రుణం, దానిపై వ‌డ్డీ చెల్లించ‌డంలో రుణ‌ గ్ర‌హీత‌లిద్ద‌రికి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

ఉమ్మ‌డిగా ఇల్లు కొనుగోలు చేయ‌డం వ‌ల్ల క‌లిగే నాలుగు ప్ర‌యోజ‌నాలు:

స్టాంప్ డ్యూటీలో త‌గ్గుద‌ల‌:
మీరు ఇంటిని కొనుగోలు చేసిన‌ప్పుడు మీ పేరు మీద ఇల్లు రిజిష్ర్టేష‌న్ చేయించుకోవ‌డానికి ప్ర‌భుత్వానికి కొంత స్టాంప్ డ్యూటీ, రిజిష్ర్టేష‌న్ చార్జీలు చెల్లించాలి. ఇవి కొనుగోలు దారుకు అద‌న‌పు భారంగా వుంటాయి. మీ భార్య‌ మొద‌టి య‌జ‌మానిగా వుంటే స్టాంప్ డ్యూటీపై చాలా వ‌ర‌కు ఆదా చేసుకునే అవ‌కాశం వుంది. చాలా రాష్ర్టాల‌లో ఆస్తి రిజిస్ర్టేష‌న్ కోసం అయ్యే ఖ‌ర్చులు పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌ల‌కు త‌క్కువ‌గా వుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు దిల్లీలో పురుషుల‌కు 6 శాతం స్టాంప్ డ్యూటీ వుండ‌గా, మ‌హిళ‌ల‌కు 4శాతం మాత్ర‌మే వుంది. ఇలాంట‌ప్పుడు భార్య‌భ‌ర్త‌లు ఇరువురు క‌లిసి కొనుగోలు చేసిన‌ట్ల‌యితే 5 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే స‌రిపోతుంది. అదేవిధంగా హర్యాణాలో ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లోపురుషుల‌కు 8 శాతం, గ్రామీణ ప్రాంతాల‌లో 6 శాతం స్టాంప్ డ్యూటీ వుండ‌గా, మ‌హిళ‌ల‌కు ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో 6 శాతం, గ్రామీణ ప్రాంతాల‌లో 4 శాతంగా వుంది.

రుణ అర్హ‌త‌ను పెంచుకోవ‌చ్చు
చాలా మంది కోనుగోలు దారులు గృహ‌రుణాల ద్వారా ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. రుణం ఇచ్చే కంపెనీలు ముందుగా రుణం తీసుకునే వ్య‌క్తి అర్హ‌త‌ను నిర్ణ‌యిస్తాయి. ఇది ప్ర‌ధానంగా రుణ గ్ర‌హీత ఆదాయంపై ఆధార‌ప‌డి వుంటుంది. రుణ గ్ర‌హీత వార్షిక ఆదాయానికి 5 రెట్లు రుణం ఇస్తారు. రుణ గ్ర‌హీత‌కు త‌గినంత ఆదాయం లేన‌ప్పుడు, క్రెడిట్ స్కోర్ , చెల్లింపులు స‌రిగ్గా లేన‌ప్పుడు స‌హ రుణ గ్ర‌హీత ఆధారంగా రుణం మంజూరు చేస్తారు. ఇది తిరిగి రుణం చెల్లించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. రుణం మంజూరు చేయు సంస్థ‌లు స‌హా య‌జ‌మానులు స‌హ రుణ గ్ర‌హీత‌లుగా వుండ‌డం త‌ప్ప‌నిస‌రి అని చెప్తున్నాయి. అయితే స‌హ రుణ గ్ర‌హీత త‌ప్ప‌నిస‌రిగా స‌హా య‌జ‌మాని కాన‌వ‌స‌వ‌రం లేదు. 
ఉమ్మ‌డి ద‌ర‌ఖాస్తుదారుల విష‌యంలో రుణ గ్ర‌హీతంద‌రి ఆదాయ‌మును ప‌రిగ‌ణంలోనికి తీసుకుని రుణ స‌దుపాయాన్ని తెలియ‌చేస్తారు. అవ‌స‌ర‌మైతే రుణ స‌దుపాయ‌మును పెంచే అవ‌కాశం ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కి మీ సంవ‌త్స‌ర ఆదాయం రూ.10 ల‌క్ష‌లు అయితే మీకు రూ. 50 ల‌క్ష‌ల రుణం ల‌భించ‌వ‌చ్చు. మీ జీవిత భాగ‌స్వామి వార్షిక ఆదాయం కూడా రూ.10 ల‌క్ష‌లు అయితే, ఇరువురు ఒక కోటి రూపాయ‌ల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. మొద‌టి కొనుగోలు దారురాలుగా ఒక మ‌హిళ‌ (మీ భార్య‌, త‌ల్లి, అక్క లేదా చెల్లి, కూతురు) వుంటే, చాలా ఆర్థిక సంస్థ‌లు త‌క్కువ వ‌డ్డీ రేటుకు రుణం మంజూరు చేస్తున్నాయి.

ఉభ‌యుల‌కు ప‌న్నుప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది:

రుణాల‌ను తిరిగి చెల్లించ‌డంలో గృహ య‌జ‌మానులు ఇరువురుకి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 80 సి ప్ర‌కారం స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేష‌న్ చార్జీల‌ను రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను త‌గ్గించుకోవ‌చ్చు. మీరు అదే ఇంటిలో నివ‌సిస్తున్న‌ట్ల‌యితే సెక్ష‌న్ 80సి ప్ర‌కారం ఇంటి కోసం తీసుకున్న రుణం అస‌లుపై 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు, సెక్ష‌న్ 24(బి) ప్ర‌కారం 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు వుంటుంది. ఆస్తి య‌జ‌మానులు ఇద్ద‌రు రుణ గ్ర‌హీత‌లు అయితే కూడా వారి వారి నిష్ప‌త్తుల ప్ర‌కారం ఇరువురు విడి విడిగా ఆదాయ‌పు ప‌న్ను క్లైం చేసుకోవ‌చ్చు. అయితే వారు తిరిగి చెల్లిస్తున్న గృహ రుణాల మొత్తం క‌న్నా ఎక్కువ క్లైం చేయ‌కూడ‌దు. ఇంటిని కొనుగోలు చేస్తున్న‌ప్పుడు ఇద్ద‌రు స‌మాన నిష్ప‌త్తిలో నిధుల‌ను స‌మ‌కూర్చిన్న‌ట్ల‌యితే ప‌న్ను, మూల‌ధ‌న లాభాలు ఇరువురు స‌మానంగా పొందుతారు.

ఒక వేళ స‌ద‌రు ఇంటిని అద్దెకు ఇచ్చిన‌ట్ల‌యితే అద్దె ఆదాయం ఉభ‌యుల‌కు స‌మానంగా వ‌ర్తిస్తుంది. అద్దె ఆదాయం ఇద్ద‌రు య‌జ‌మానులు పంచుకోవ‌డం వ‌ల‌న ఆదాయ‌పు ప‌న్ను త‌క్కువ‌గా వుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి ఇద్ద‌రు య‌జ‌మానులకు సంవ‌త్స‌రానికి 8 ల‌క్ష‌ల రూపాయిలు ఆదాయం వ‌స్తుంద‌నుకుంటే, స‌మాన భాగ‌స్వామ్యం క‌లిగిన ఆస్తిపై వ‌చ్చే అద్దె సంవ‌త్స‌రానికి రూ.4 ల‌క్ష‌లు అనుకుంటే వారి ఒక్కొక్క‌రి ఆదాయానికి రూ.2 ల‌క్ష‌ల ఆదాయాన్ని చేర్చితే ఒక్కొక్క‌రి సంవ‌త్స‌ర ఆదాయం రూ. 10 ల‌క్ష‌లు అవుతుంది. ఇది 30 శాతం కంటే త‌క్కువ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. అదే ఒకే య‌జ‌మాని వుంటే అత‌ని ఆదాయం రూ. 12 ల‌క్ష‌లు అయితే 30 శాతం శ్లాబులోకి వ‌స్తుంది.

వార‌స‌త్వం సుల‌భం:
ఆస్తికి భార్య‌భ‌ర్త‌లు య‌జ‌మానులు అయితే ఉమ్మ‌డిగా వుంటే ఉమ్మ‌డి య‌జ‌మానిగా, ఉమ్మ‌డి అద్దెదారునిగా స‌మాన అధికారం వుండడం వ‌ల‌న వార‌స‌త్వ స‌మ‌స్య‌లను త‌గ్గించుకోవ‌చ్చు. అలా చేయ‌డం వ‌ల‌న భార్య భ‌ర్త‌లు ఇరువురిలో ఒక‌రు మ‌ర‌ణించిన, వారిఆస్తి విష‌యంలో ఏమైనా త‌గాదాలు వ‌చ్చినా లేదా ఒక‌రు మ‌ర‌ణించినా వారి వాటాపై కూడా రెండ‌వ వారు చ‌ట్ట‌బ‌ధ్ద‌మైన హ‌క్కును క‌లిగి వుండ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని