కొత్త రుణానికి...మీరు అర్హులేనా?

కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటున్నారా? క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసారా?కార్డు పరిమితి పెంచుకోవాలా? బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించాకే రుణం ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటాయి. మరి మీ ఆర్ధికారోగ్యం కొత్త రుణాలు పొందేందుకు సహకరిస్తోందా? ఒక వ్యక్తి

Published : 23 Dec 2020 11:02 IST

కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటున్నారా? క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసారా?కార్డు పరిమితి పెంచుకోవాలా? బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించాకే రుణం ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటాయి. మరి మీ ఆర్ధికారోగ్యం కొత్త రుణాలు పొందేందుకు సహకరిస్తోందా? ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితి ని అంచనా వేసేందుకు అతని రుణ చరిత్ర, ప్రస్తుతం ఉన్న అప్పులు, వాటిని తీరుస్తున్న విధానం ఎంతో కీలకం. అయితే చాలా మంది రుణ గ్రహీతలకు తమ క్రెడిట్ స్కోరు, చెల్లింపుల తీరు పై అవగాహన ఉండదు. దీనివల్లే కొత్త రుణాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

క్రెడిట్ స్కోరు సంగతేంటి?

గత పదేళ్ల కాలం లో సిబిల్, ఎక్విఫ్యాక్స్ తదితర క్రెడిట్ బ్యూరో సంస్థలు వ్యక్తుల రుణ సమాచారాన్ని పెద్ద సంఖ్యా లో సేకరించాయి. ఒక వ్యక్తి తీసుకున్న వివిధ రుణాలు, ఏయే బ్యాంకుల నుంచి తీసుకున్నారు? వాటిని సరిగ్గా చెల్లిస్తున్నారా లేదా?తదితర అంశాల ఆధారంగా క్రెడిట్ స్కోరును కేటాయిస్తున్నాయి. ఒక వ్యక్తికి రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఈ సమాచారాన్ని తీసుకొని దాని ఆధారంగా రుణం ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాయి. ఉదాహరణకు సిబిల్ ఒక వ్యక్తికి 300 నుంచి 900 వరకూ స్కోరును కేటాయిస్తుంది. 900 మార్కులకు ఎంత దగ్గరగా ఉంటే రుణం పొందడం అంత సులభం అన్నమాట. వడ్డీ రేట్లలో కూడా కొంత రాయితీ దొరికేందుకు అవకాశం ఉంటుంది.

చాలా బ్యాంకులు కొత్తగా వాహన, గృహ రుణం ఇవ్వడానికి కనీసం 650 మార్కులకు పైగా ఉండాలంటున్నాయి. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు ఇవ్వాలంటే కనీసం 750 కి మించి ఉండాలి. ఇప్పటికే తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డులకు సంబంధించిన చెల్లింపులు సరిగా లేకపోతే ఆ ప్రభావం క్రెడిట్ స్కోరు పై పడుతుంది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న దరఖాస్తును తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. దీనితో పాటు ఏయే రుణాలు ఉన్నాయన్నదీ ముఖ్యమే. ఉదాహరణకు హామీ ఉన్న రుణాలు, హామీ లేని రుణాలు, క్రెడిట్ కార్డు వాడకం, తరచూ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం లాంటివి కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేసే అంశాలే. ఒక వ్యక్తికి గృహ, వాహన రుణాలు ఉండి, వాటికి నెలసరి వాయిదా చెల్లింపులు సరిగ్గా ఉంటే ఎలాంటి ఇబ్బందీ లేకుండా స్కోరు పెరుగుతుంది. ఇప్పటికే అనేక రుణాలు ఉండి, మళ్ళీ కొత్తగా అప్పు కావాలని అడిగితే…బ్యాంకులు ఆ దరఖాస్తును పట్టిపట్టి చూస్తాయి. ఇలా అప్పు కోసం ఆరాట పడటం క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర పై ప్రభావం చూపుతుందని విస్మరించొద్దు.

చెల్లింపుల శాతం ఎంత?

ఒక వ్యక్తి తాను సంపాదిస్తున్న మొత్తం ఎంత? నెల నెలా కచ్చితంగా చెల్లించాల్సింది ఎంత అనే విషయాన్ని బట్టి ఆ వ్యక్తి ఇంకా ఎంత రుణం తీసుకోవడానికి అర్హుడో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ. 1 లక్ష ఆర్జిస్తున్నాడనుకుందాం. అప్పుడు తాను 40 నుంచి 50 వేల వరకు(అంటే జీతం లో 50 శాతం) ఈఎంఐ కట్టగలడని బ్యాంకులు భావించి దానికి తగ్గట్టుగా రుణం అందిస్తారు. అయితే ఇప్పటికే కొన్ని రుణాలు ఉంటే, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

చెల్లింపుల నిష్పత్తి ఎంత ఉండాలనే విషయం లో ఒక్కో రుణ సంస్థ ఒక్కో నిబంధనను పాటిస్తుంది. గృహ రుణాలలాంటి వాటికి ఈ పరిమితి కాస్త ఎక్కువే ఉంటుంది. రుణం ఏదైనా సరే…ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డు, రుణ చరిత్ర విషయం లో జాగ్రత్తగా ఉండాలి. చెల్లింపుల నిష్పత్తి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాయిదాలను సకాలం లో చెల్లించడం, ఈఎంఐ ల భారం తక్కువగా చూసుకోవడం తో పాటు, హామీ తో కూడిన, హామీ లేని రుణాల విషయం లో సమతుల్యం పాటించడం ద్వారా క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు. ఎక్కువ వడ్డీ వసూలు చేసే రుణాలను సాధ్యమైనంత తొందరగా వదిలించుకోవడం మంచిది. క్రెడిట్ స్కోరు కోసం సిబిల్ లాంటి క్రెడిట్ బ్యూరోల వెబ్సైట్లను సంప్రదించవచ్చు. తరచుగా క్రెడిట్ స్కోరు కోసం దరఖాస్తు చేసుకోవడం అంత మంచిది కాదని గుర్తుంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని