గృహ రుణ ఆరంభ సంవత్సరాల్లో ముందస్తు చెల్లింపులు లాభ‌దాయ‌క‌మేనా?

చెల్లించాల్సిన గ‌డువు కంటే ముందే గృహరుణాన్ని తిరిగి చెల్లించ‌డాన్ని హోమ్ లోన్ ప్రీ పేమెంట్ అంటారు. మొత్తం గృహ‌రుణాన్ని లేదా అందులో కొంత భాగాన్ని కాల‌ప‌రిమితి కంటే ముందుగానే చెల్లించ‌వ‌చ్చు.సాదార‌ణంగా, రుణ‌గ్ర‌హీత‌లు వారి వ‌ద్ద అద‌న‌పు నిధులు ఉన్న‌ప్పుడు ముంద‌స్తు గృహ రుణ చెల్లింపులు చేస్తుంటారు. రుణం తీసుకున్న

Published : 23 Dec 2020 11:44 IST

చెల్లించాల్సిన గ‌డువు కంటే ముందే గృహరుణాన్ని తిరిగి చెల్లించ‌డాన్ని హోమ్ లోన్ ప్రీ పేమెంట్ అంటారు. మొత్తం గృహ‌రుణాన్ని లేదా అందులో కొంత భాగాన్ని కాల‌ప‌రిమితి కంటే ముందుగానే చెల్లించ‌వ‌చ్చు.సాదార‌ణంగా, రుణ‌గ్ర‌హీత‌లు వారి వ‌ద్ద అద‌న‌పు నిధులు ఉన్న‌ప్పుడు ముంద‌స్తు గృహ రుణ చెల్లింపులు చేస్తుంటారు. రుణం తీసుకున్న వారు త‌మ అనుకూల‌త‌ను బ‌ట్టి కొంత మొత్తంలో రుణాన్ని చెల్లించ‌వ‌చ్చు.మొత్తం రుణంలో కొంత భాగాన్ని చెల్లించ‌డాన్ని పార్ట్ ప్రీపేమెంట్ అంటారు.

ఉదాహ‌ర‌ణ‌కి ఒక వ్య‌క్తికి రూ.20 ల‌క్ష‌ల గృహ రుణం ఉంద‌నుకుందాం. మీద‌గ్గ‌ర రూ.3 ల‌క్ష‌లు మొత్తం ఉంద‌నుకుందాం. ఈ అద‌న‌పు మొత్తంతో గృహ రుణం చెల్లించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ఇక్క‌డ మీ గృహ రుణ మొత్తం రూ.20 ల‌క్ష‌లకు గాను రూ. 3 ల‌క్ష‌లు మాత్ర‌మే చెల్లిస్తున్నారు. దీన్ని పార్ట్ ప్రీపేమెంట్‌ అంటారు. గృహ‌రుణం ముందుగా చెల్లించ‌డం మంచిదేనా? ఎల్లప్పుడూ కాదు, ఇది అనేక అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మీ గృహ‌రుణ వ‌డ్డీ రేటు 9 శాతంగా ఉంద‌నుకుందాం. మీరు 30 శాతం ప‌న్ను స్లాబ్‌లో వుంటే మీరు చెల్లించే గృహ రుణ వ‌డ్డీపై ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపును తీసివేయ‌గా మీరు 6.3 శాతం వ‌డ్డీని చెల్లిస్తున్నారు. ఒక వేళ మీరు 20 శాతం ప‌న్ను స్లాబ్‌లో ఉంటే 7.2 శాతం,10 శాతం స్లాబ్‌లో ఉంటే 8.1 శాతం వ‌డ్డీ చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది.

గృహ రుణ అస‌లు మొత్తాన్ని తిరిగి చెల్లించాల‌నుకుంటున్నారా? మీ రుణ వ్య‌యం 6.3 శాతంగా ఉన్న‌ప్పుడు మీ గృహ రుణ అస‌లును ముందుగా చెల్లించ‌క పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే ఆ మొత్తాన్ని వేరే చోట పెట్టుబ‌డి చేస్తే 6.3 శాతం కంటే ఎక్కువ రాబ‌డి పొంద‌వ‌చ్చు.కాబ‌ట్టి ఆ నిధుల‌ను వేరే పెట్టుబ‌డి మార్గాల‌కు మ‌ళ్లించి ఈఎమ్ఐల ద్వారా గృహ‌రుణం చెల్లించ‌డం మంచిది. ఎందులోనూ మ‌దుపు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కాల‌వ్య‌వ‌ధి కంటే ముందుగా గృహ రుణం చెల్లించ‌డం మంచిది. ముంద‌స్తు చెల్లింపుల రుసుములు - గృహ రుణ ముంద‌స్తు చెల్లింపులపై ఎటువంటి రుసుము చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. ముంద‌స్తు గృహ రుణ చెల్లింపుల‌పై ఎటువంటి ఛార్జీలు విధించ‌వ‌ద్ద‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌ను కోర‌డంతో ఎస్‌బీఐ, హెచ్ డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు ఎటువంటి రుసుములు విధించ‌డం లేదు. ఎప్పుడు చెల్లిస్తే ప్ర‌యోజ‌నం? ప్రారంభ సంవ‌త్స‌రాల‌లో గృహ రుణ ముంద‌స్తు చెల్లింపు ద్వారా మంచి ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. గృహ రుణ ప్రారంభ సంత్స‌రాల‌లో వ‌డ్డీగా చెల్లించే మొత్తం అధికంగా ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌: రుణం మొత్తం: రూ. 30 ల‌క్ష‌లు; కాల‌ప‌రిమితి: 20 సంవ‌త్స‌రాలు; వ‌డ్డీ రేటు: 10 శాతం; ఈఎమ్ఐ: రూ.28,951. మొద‌టి సంవ‌త్స‌రం 12 ఈఎమ్ఐల‌కు గాను రూ. 3,47,412 చెల్లించాలి. ఈ మొత్తంలో మీరు చెల్లించే అస‌లు రూ.49,642 మాత్ర‌మే. మిగిలిన రూ.2,97,770 వ‌డ్డీ నిమిత్తం బ్యాంకు వారికి చెల్లిస్తున్నారు.ఈ సంద‌ర్భంలో ప్రారంభ సంవ‌త్స‌రాల‌లోనే ముంద‌స్తు గృహ రుణ చెల్లింపులు చేయ‌డం మంచిది. మొద‌టి 12 ఈఎమ్ఐల త‌రువాత గృహ రుణం అస‌లు నుంచి రూ.5 ల‌క్ష‌ల రూపాయిలు ముందుగా చెల్లిస్తే మిగిలిన రుణం అస‌లు రూ.24,50,358 గా ఉంటుంది. మీ ఈఎమ్ఐలు 228 నుంచి 147 కు త‌గ్గి, అనుకున్న దాని కంటే సుమారు 7 సంవ‌త్స‌రాల ముందుగా మీ గృహ రుణం తిరిగి చెల్లించ‌వ‌చ్చు. అంతే కాకుండా త‌రువాతి సంవ‌త్స‌రం చెల్లించే వ‌డ్డీ మొత్తం 2.4 ల‌క్ష‌ల‌కు త‌గ్గుతుంది. కాల‌వ్య‌వ‌ధిలో మార్పు వ‌ద్ద‌నుకుంటే ఈఎమ్ఐని రూ. 24,049 వ‌ర‌కూ త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో ఈఎమ్ఐ రూ.4,092 త‌గ్గుతుంది. అదే ఇంట్లో నివ‌సిస్తూ ఉంటే వారికి వార్షికంగా రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంది.

గృహ రుణ చివ‌రి సంవ‌త్స‌రాల‌లో ముంద‌స్తు చెల్లింపులు - పైన ఇచ్చిన ఉదాహ‌ర‌ణ‌లోని వ్య‌క్తి 15 సంవ‌త్స‌రాలు ఈఎమ్ఐలు చెల్లించి, చివ‌రి ఐదు సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్పుడు రూ.5 ల‌క్ష‌లు ముంద‌స్తు రుణ చెల్లింపులు చేశాడ‌నుకుందాం.15 సంవ‌త్స‌రాల ఈఎమ్ఐ చెల్లించిన అనంత‌రం మిగిలిన అస‌లు మొత్తం రూ. 13,62,573. ఈ ద‌శ‌లో రూ. 5 ల‌క్ష‌లు చెల్లిస్తే రూ. 8,62,573 అస‌లు ఉంటుంది.ఇందుకు గాను మీరు 60 నెల‌ల పాటు చెల్లించ‌వ‌ల‌సిన ఈఎమ్ఐలు 34 నెల‌ల‌కు త‌గ్గుతాయి. ప్రారంభ సంవ‌త్స‌రాల‌లో ముందుస్తు చెల్లింపుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నంతో పోల్చి చూస్తే ఇది చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

ముంద‌స్తు గృహరుణ చెల్లింపు చేసే ముందు కింది విష‌యాల‌ను ప‌రిశీలించాలి.

- అత్య‌వ‌స‌ర నిధి ను ఏర్పాటు చేసుకోవాలి.
- పిల్ల‌ల విద్య‌, పెళ్ళి, ప‌ద‌వీవిర‌మ‌ణ వంటి ఆర్ధిక ల‌క్ష్యాల‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా చూసుకోవాలి.
మీరు ఎంత ముందుగా రుణం చెల్లిస్తే, అంత ముందుగా గృహం మీ సొంత‌మ‌వుతుంది. ముందుగా రుణం చెల్లించ‌డం వ‌ల‌న మీరు త్వ‌ర‌గా రుణ విముక్తుల‌వుతారు. రుణదాత రికార్డుల‌ నుంచి ఇంటిని మీ పేరుకు మార్పు చేసుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని