గృహ రుణాల‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపులు పొందగలుగుతున్నారా?

గృహం కొనుగోలు చేయడం అనేది ఒక దీర్ఘకాల పెట్టుబడి. ఇంతకు ముందు రోజుల్లో ప్రజలు చాలా సంవత్సరాలు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి, కూడ‌బెట్టిన‌ మొత్తం నుంచి అధిక శాతాన్ని ఇంటిని కోనుగోలు చేయ‌డానికి లేదా నిర్మించ‌డానికి వినియోగించేవారు. ఇందుకు వారికి చాలా స‌మ‌యం ప‌ట్టేది. మారుతున్న కాలంతో పాటు ప్ర‌జ‌ల ఆదాయంలో

Published : 23 Dec 2020 11:43 IST

గృహం కొనుగోలు చేయడం అనేది ఒక దీర్ఘకాల పెట్టుబడి. ఇంతకు ముందు రోజుల్లో ప్రజలు చాలా సంవత్సరాలు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి, కూడ‌బెట్టిన‌ మొత్తం నుంచి అధిక శాతాన్ని ఇంటిని కోనుగోలు చేయ‌డానికి లేదా నిర్మించ‌డానికి వినియోగించేవారు. ఇందుకు వారికి చాలా స‌మ‌యం ప‌ట్టేది. మారుతున్న కాలంతో పాటు ప్ర‌జ‌ల ఆదాయంలో పెరుగుద‌ల‌, 10 నుంచి 15 శాతం డౌన్ పేమెంట్ తోనే చాలా ఆర్ధిక సంస్థ‌లు గృహ రుణాలు ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూప‌డంతో, చాలా మంది గృహ రుణాల‌ను పొంద‌టంతో పాటు అతి చిన్న వ‌య‌స్సులోనే త‌మ సొంత ఇంటి క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోగ‌లుగుతున్నారు.

ప్ర‌తి కుటుంబానికి సొంత ఇళ్లు ఉండాల‌నే ఉద్దేశ్యంతో క‌నీస డౌన్ పేమెంట్ చెల్లింపుతో రుణాల‌ను అందిస్తున్నారు. ఈఎమ్ఐల ద్వారా గృహ రుణాల‌ను చెల్లించే వెసులుబాటు క‌ల్పిస్తున్నారు. ప‌న్ను ప్ర‌యోజ‌నాల విషయంలో సెక్ష‌న్ 80సీ కింద ఇంటిరుణ అస‌లు పై పన్ను మినహాయింపు, సెక్ష‌న్ 24బీ కింద గృహ రుణ వ‌డ్డీ పై పన్ను మినహాయింపు ఇస్తున్నారు. అయితే, రుణ గ్ర‌హీతలు వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక‌పోతున్నారు .

ఈఎమ్ఐ:

గృహ రుణ అస‌లు, వ‌డ్డీ మొత్తాల‌ను స‌మాన వాయిదాలుగా చెల్లించ‌డాన్ని ఈఎమ్ఐ అంటారు. నెల చివ‌ర‌లో మిగిలిన అసలు మొత్తం ఆధారంగా వ‌డ్డీని లెక్కిస్తారు. అందువ‌ల్ల ప్రారంభ సంవ‌త్స‌రాల‌ ఈఎమ్ఐలో వ‌డ్డీ అధికంగాను, చివ‌రి సంవ‌త్స‌రాల‌లో త‌క్కువ‌గాను ఉంటుంది. మ‌రోవైపు గృహ‌రుణ అస‌లు ప్రారంభ సంవ‌త్స‌రాల‌లో త‌క్కువ‌గాను, చివ‌రి సంవ‌త్స‌రాల‌లో ఎక్కువ‌గాను ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కి: వ‌డ్డీ 9 శాతంగా ఉంటే ఈఎమ్ఐలు ఆర్ధిక సంవ‌త్స‌రానికి (ఏప్రిల్ నుంచి మార్చి వ‌ర‌కు) ఈ కింది విధంగా ఉంటాయి.

గృహ రుణంపై వడ్డీ:

సెక్ష‌న్ 24బీ కింద గృహ రుణ వ‌డ్డీ చెల్లింపులపై రూ. 2ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్నుమిన‌హాయింపు ఉంటుంది. అయితే రుణ గ్ర‌హీత అదే ఇంటిలో నివ‌సించినా లేదా ఆ ఇంటిని అద్దెకు ఇచ్చినా పూర్తి స్థాయిలో ప‌న్ను మిన‌హాయింపును పొంద‌లేక‌పోతున్నారు.

కింది ప‌ట్టిక‌లో ఎక్స్ అనే వ్య‌క్తి రూ. 15 ల‌క్ష‌ల గృహ రుణం, 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి, 9 శాతం వ‌డ్డీతో తీసుకున్నాడు, అత‌ను అదే ఇంట్లో నివ‌సిస్తున్నాడు. రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉన్న‌ప్ప‌టికీ, పూర్తిస్థాయిలో ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు పొంద‌లేక‌పోతున్నాడు. కార‌ణం ప్రారంభ సంవ‌త్స‌రంలో వ‌డ్డీ రూ.1,32,988. అదే 5వ సంవ‌త్స‌రంలో అయితే వ‌డ్డీ రూ. 1,11,599 ఉంటుంది. కాలం గుడుస్తున్న కొల‌ది వ‌డ్డీ త‌గ్గ‌డం వ‌ల‌న ప‌న్ను ప్ర‌యోజ‌నం మ‌రింత త‌గ్గుతుంది.

మ‌రొక వ్య‌క్తి 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి 25 ల‌క్ష‌ల రూపాయిలు రుణం తీసుకున్నాడు, ప్రారంభ సంవ‌త్స‌రంలో వ‌డ్డీ రూ.2,21,647. మిన‌హాయింపు ప‌రిమితి రూ.2 ల‌క్ష‌లు కంటే అధికంగా ఉన్న రూ. 21,647 పై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోలేడు. ఈ విధంగా ఈ పన్ను మినహాయింపు ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు.

గృహ‌రుణ అస‌లు చెల్లింపు:

పైన ప‌ట్టిక‌లో వ్య‌క్తి ఆరంభ సంవ‌త్స‌రంలో అస‌లు రూ. 49,580 గాను, 5 సంవ‌త్స‌రంలో రూ. 70,969 గాను చెల్లిస్తున్నాడు. అంటే కాలం గ‌డిచే కొల‌ది అస‌లు పెరుగుతూ వ‌స్తుంది.

సెక్ష‌న్ 80సీ కింద రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పీఎఫ్‌, పీపీఎఫ్‌, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, యులీప్, ఈఎల్ఎస్ఎస్‌, ఎన్ఎస్‌సీ, ఎన్‌పీఎస్ వంటి వాటితో పాటు గృహ రుణ అస‌లు చెల్లింపుల‌పై కూడా ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. చాలా మంది ప్ర‌జ‌లు ప‌న్ను ప్ర‌యోజ‌నాల కోసం పైన తెలిపిన వాటిలో పెట్టుబ‌డి పెడుతుంటారు. గృహ‌రుణ చెల్లింపులపై ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి పెంచక పోతే వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు సెక్ష‌న్ 80 సీ గృహ రుణ అస‌లు చెల్లింపుల కింద పూర్తి ప‌న్ను మిన‌హాయింపు పొందలేరు.

చివరి మాట:

పన్ను ప్రయోజనాలు పూర్తిగా వినియోగించుకోని కార‌ణంగా ఎక్కువ ప‌న్నులు చెల్లించాల్సి వ‌స్తుంది. గృహం పై రుణం దీర్ఘ‌కాల పెట్టుబ‌డి. కాబట్టి, చెల్లించిన పన్నులను భర్తీ చేయాలంటే మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే మంచి రాబడి పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని