ఎంచుకోండి స‌రైన క్రెడిట్ కార్డు!

వినియోగదారుల  ఆర్థిక అవసరాలకు  అనుగుణంగా మార్కెట్లో చాలా రకాల క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్‌ కార్డు పొందేముందు మనకు ఎలాంటి కార్డు కావాలో తెలుసుకుని స్పష్టమైన  అవగాహనతో  దరఖాస్తు  చేయాలి.

Published : 23 Dec 2020 13:10 IST

వినియోగదారుల  ఆర్థిక అవసరాలకు  అనుగుణంగా మార్కెట్లో చాలా రకాల క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్‌ కార్డు పొందేముందు మనకు ఎలాంటి కార్డు కావాలో తెలుసుకుని స్పష్టమైన  అవగాహనతో  దరఖాస్తు  చేయాలి.

సాధారణ క్రెడిట్‌ కార్డులు:
వీటిని రోజువారీ కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.  దుస్తుల నుంచి మొదలుకొని  విమాన ప్రయాణ టికెట్ల వరకూ వీటి ద్వారా చెల్లింపులు జరపవచ్చు. కార్డుపై ఉన్న పరిమితి మేరకు వీటిని వాడుకునే వీలుంటుంది. ఒకసారి బిల్లు చెల్లింపులు జరిపిన తర్వాత మళ్లీ పరిమితి మొదలవుతుంది. ఆలస్య రుసుములను  తప్పించుకునేందుకు  కాల పరిమితిలోగా  చెల్లింపులు చేయాలి. సాధారణ  వినియోగ ఛార్జీలను  ప్రతి నెలా విధిస్తారు.

ప్రీమియం క్రెడిట్‌ కార్డులు:
సాధారణ కార్డుల్లా కాకుండా ప్రత్యేక ప్రయోజనాలను  చేకూర్చేవి ప్రీమియం క్రెడిట్‌కార్డులు. క్యాష్‌బ్యాక్‌, రివార్డ్‌ పాయింట్స్‌ వంటి వాటిని అందించే గోల్డ్‌, ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డులను ఈ తరహాకు చెందినవిగా  చెప్పుకోవచ్చు. కనీస ఆదాయం, మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికే  వీటిని జారీచేస్తారు. వీటికి అధిక రుసుములు  ఉంటాయి.

ఛార్జ్‌ కార్డులు:
వీటికి రుణ పరిమితి ఉండదు. ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రతినెలా  చివర్లో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. చెల్లింపులు ఎప్పటికప్పుడు  చేస్తుండటం వల్ల వీటిపై ఎటువంటి ఆర్థిక రుసుము కానీ కనీస పరిమితి కానీ ఉండదు. ఆలస్య చెల్లింపులకు  ప్రత్యేక రుసుములు విధిస్తారు. కార్డు నిబంధనలను  బట్టి కార్డును రద్దు చేసే అవకాశం ఉంది.

పరిమిత లేదా ఒకే రకానికి వినియోగించే కార్డులు:
ఒకటి లేదా కొన్ని దుకాణాల సముదాయాల్లో వస్తువులు, సరకులు కొనుగోలు చేసేందుకు వినియోగించేవి పరిమిత కార్డులు. ప్రముఖ నగదు దుకాణాలు, దుస్తుల దుకాణాలు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ కార్డులు అందించే వాటిని ఈ విభాగానికి చెందినవిగా చెప్పుకోవచ్చు.

ప్రీపెయిడ్‌ క్రెడిట్‌ కార్డులు:
వీటిలో ఖాతా నుంచి నగదును  జమ చేసుకోవాల్సి  ఉంటుంది. కార్డులో ఉన్న మొత్తంతో కొనుగోళ్లు చేసుకోవాల్సి  ఉంటుంది. డబ్బు కార్డులో జమ అయ్యేంత వరకూ కార్డు పరిమితి ఉపయోగించుకునే  వీలుండదు. ఖాతాలో సొమ్మును ఉపయోగించుకుంటున్నందున  వీటికి ప్రత్యేక రుసుము ఉండదు.

బిజినెస్‌ కార్డులు:
ప్రత్యేకంగా వాణిజ్య అవసరాలకు  రూపొందించినవి బిజినెస్‌ కార్డులు. వ్యాపార, వ్యక్తిగత చెల్లింపులను  వేర్వేరుగా  చేసుకునేందుకు  వ్యాపారవేత్తలకు  వీటిని జారీచేస్తారు. 
ఇవే కాకుండా వినియోగదారుల అవసరాలకు సరిపడే వివిధ రకాల కార్డులను ఎప్పటికప్పుడు క్రెడి కార్డు సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు