గోల్డ్ లోన్‌ తీసుకుంటున్నారా?

వ్య‌క్తి గ‌త రుణం, గృహ రుణాల‌తో పోలిస్తే బంగారు రుణం అటు రుణ‌దాత‌కి ఇటు రుణగ్ర‌హీత‌కి ఇరువురికి భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది. రుణ‌గ్ర‌హీత‌ ఉంచిన బంగారానికి బ‌దులుగా న‌గ‌దు మంజూరు చేయ‌డం వ‌ల్ల రుణ‌దాతకి న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. ఇంకా వివ‌రంగా చెప్పాలంటే రుణ‌గ్రహీత తన బంగారాన్ని బ్యాంకుల వ‌ద్ద పూచీక‌త్తుగా

Updated : 02 Jan 2021 12:47 IST

వ్య‌క్తి గ‌త రుణం, గృహ రుణాల‌తో పోలిస్తే బంగారు రుణం అటు రుణ‌దాత‌కి ఇటు రుణగ్ర‌హీత‌కి ఇరువురికి భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది. రుణ‌గ్ర‌హీత‌ ఉంచిన బంగారానికి బ‌దులుగా న‌గ‌దు మంజూరు చేయ‌డం వ‌ల్ల రుణ‌దాతకి న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. ఇంకా వివ‌రంగా చెప్పాలంటే రుణ‌గ్రహీత తన బంగారాన్ని బ్యాంకుల వ‌ద్ద పూచీక‌త్తుగా ఉంచి, బ్యాంకు వారి నుంచి రుణం పొంద‌వ‌చ్చు. కాల‌వ్య‌వ‌ధి ముగిసే లోపుగా బ్యాంకుకు రుణాన్ని తిరిగి చెల్లించాలి. రుణాన్ని చెల్లించిన అనంత‌రం రుణ‌గ్ర‌హీత ఉంచిన బంగారాన్ని బ్యాంకు వారు తిరిగి ఇచ్చేస్తారు.

బంగారు రుణం తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల్లో ఒక‌టి, కొద్ది నిమిషాల్లోనే రుణం పొంద‌వ‌చ్చు. తిరిగి చెల్లించేదుకు సాధారణంగా స్వ‌ల్ప కాల వ్య‌వ‌ధి, మ‌ధ్య‌కాలిక కాల వ్య‌వ‌ధి ఉంటుంది. బంగారు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నిండి ఉండాలి, వారి వ‌ద్ద బంగారం ఉండాలి. ఇత‌ర వ్య‌క్తిగ‌త రుణాలు వంటి వాటి కంటే ఈ రుణంపై వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటుంది. అంతేకాకుండా కాల‌వ్య‌వ‌ధి కూడా అనువుగా ఉంటుంది. రుణం తీసుకున్న కొద్ది రోజుల నుంచి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కాల‌వ్య‌వ‌ధి రుణ‌దాత నిబంధ‌న‌ల‌ను బ‌ట్టి మారుతుంటుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు బంగారు రుణాలపై ఎటువంటి ముంద‌స్తు రుసుములు విధించ‌వు. దీనికి అవ‌స‌ర‌మైన ప‌త్రాలు చాలా త‌క్కువ‌.

ఇత‌ర రుణాల‌తో పోలిస్తే బంగారు రుణాలు ఆక‌ర్ష‌ణీయంగా ఉన్న‌ప్ప‌టికీ, రుణం తీసుకునే ముందు కొన్నిముఖ్య‌మైన‌ విష‌యాల‌ను గుర్తించుకోవాలి:

* ఆర్‌బీఐ సూచ‌న‌ల ప్ర‌కారం, మొత్తం బంగారం విలువ‌లో 75 శాతం విలువ మించ‌కుండా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణం మంజూరు చేస్తాయి. ఇది ఒక రుణ‌దాత నుంచి మ‌రొక రుణ‌దాత‌కు భిన్నంగా ఉంటుంది. అధిక రుణం తీసుకుంటే రుణ‌దాత బంగారం విలువ‌లో వ‌డ్డీ రేటు ఎక్కువ శాతం ఉండే అవ‌కాశం ఉంది.
* బంగారు రుణాల‌పై ప్రాసెసింగ్ రుసుములు కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. ఈ రుసుములు సాధార‌ణంగా మొత్తం రుణంలో 1 శాతం కంటే తక్కువగా ఉంటాయి. ఒక‌వేళ అధిక ప్రాసెసింగ్ రుసుములు వ‌సూలు చేస్తుంటే అది కచ్చితంగా మంచి రుణ‌దాత కాద‌ని గ్ర‌హించి, వేరొక రుణ‌దాత‌ని సంప్ర‌దించ‌డం మంచిది.
* అసురక్షితమైన రుణాలు, సురక్షితమైన ఇతర రుణాలతో పోలిస్తే బంగారు రుణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు నెలవారీ / త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీని చెల్లించి, పదవీకాలం ముగిసేనాటికి అసులు మొత్తాన్ని చెల్లించే విధానాన్ని ఎంచుకోవ‌చ్చు. ఇది మీ రుణ‌దాత నిబంధ‌న‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అంతేకాకుండా ఉపసంహరణ సమయం కూడా త‌క్కువ‌గానే ఉంటుంది.
* మీకు అందుబాటులో ఉన్న వివిధ‌ రుణదాతలు అందించే రుణాలు అందులోని వివిధ అంశాల‌ను స‌రిపోల్చుకోవాలి. రుణదాత విశ్వసనీయతపై కొంత పరిశోధన చేయడం కూడా మంచిది. తిరిగి చెల్లించే నిబంధనలను గురించి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని