విదేశీ విద్య భారంగా మారిందా?

విదేశీ విశ్వ విద్యాల‌యంలో డిగ్రీ పొంద‌డం చాలా గొప్ప‌విష‌యంగా, గ‌ర్వ‌కార‌ణంగా భావించి చాలా మంది త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల‌ను విదేశీ విద్య‌కు పోత్ర‌హిస్తున్నారు. అయితే విదేశాల‌లో విద్య‌ను అభ్య‌సించ‌డం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌దిగా ఉంది.ఈ వ్య‌యాన్ని భ‌రించ‌డం అంత సుల‌భం కాదు. విదేశీ విద్య

Published : 23 Dec 2020 15:50 IST

విదేశీ విశ్వ విద్యాల‌యంలో డిగ్రీ పొంద‌డం చాలా గొప్ప‌విష‌యంగా, గ‌ర్వ‌కార‌ణంగా భావించి చాలా మంది త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల‌ను విదేశీ విద్య‌కు పోత్ర‌హిస్తున్నారు. అయితే విదేశాల‌లో విద్య‌ను అభ్య‌సించ‌డం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌దిగా ఉంది.ఈ వ్య‌యాన్ని భ‌రించ‌డం అంత సుల‌భం కాదు. విదేశీ విద్య ఖ‌రీదైన‌ప్ప‌టికీ చాలా బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థ‌లు, సుల‌భంగా రుణాల‌ను ఇస్తున్నందువ‌ల్ల విదేశాల‌కు వెళ్లి చ‌దువుకునే విద్యర్ధుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అదేవిధంగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించ‌ని వారి (మొండిబ‌కాయిల‌) సంఖ్య కూడా పెరుగిపోతుంది. భార‌తీయ బ్యాంకుల అసోసియేష‌న్ అందించిన స‌మాచారం ప్ర‌కారం మార్చి 2016లో 7.3 శాతంగా ఉన్న మొండి బ‌కాయిల సంఖ్య మార్చి 2018 నాటికి 9 శాతానికి పెరిగింది.

ముంబైకి చెందిన సీఆర్ఐఎఫ్ హైమార్క్ క్రెడిట్ బ్యూరో అందించిన వివ‌రాల ప్ర‌కారం ప్ర‌తి సంవ‌త్స‌రం విదేశీ విద్య‌ను అభ్య‌సించేందుకు మంజూరు చేసే రుణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సెప్టెంబ‌ర్ 2018 నాటికి కొత్త‌ విద్యారుణం స‌గ‌టున రూ. 8.95 ల‌క్ష‌లు కాగా, ఇది మార్చి 2018 నాటికి రూ.7.08 ల‌క్ష‌లుగా ఉంది. భార‌తీయ జ‌నాభాలో యువ‌త ఎక్కువ‌గా ఉండడం వ‌ల్ల వారికి నాణ్య‌మైన విద్య‌ను అందిస్తే మంచి ఉపాధిని క‌ల్పించేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతం విదేశీ విద్య ఎక్కువ ఖ‌ర్చుతో కూడికున్న‌ది కావ‌డం వ‌ల్ల, భ‌విష్య‌త్తులో మంచి ఉపాదిని పొంద‌వ‌చ్చ‌నే ఉద్దేశ్యంతో, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు విద్యారుణం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని సీఆర్ఐఎఫ్ హై మార్క్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ ప‌రిజిత్‌గార్గ్ తెలిపారు.

యూఎస్‌లో హెచ్‌1బీ వీసా నియ‌మ‌నిభంధ‌న‌లు, రూపాయితో పోలిస్తే డాల‌ర్ విలువ అధికంగా ఉండ‌టం, ఇమిగ్రేష‌న్ నిబంధ‌న‌లు వంటి వివిధ కార‌ణాల‌తో స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వదం వ‌ల‌న రుణాల‌ను తీసుకుని చ‌దువుకునేందుకు విదేశాల‌కు వెళ్ళిన విద్యార్ధులు, ఉపాది పొంది రుణాల‌ను తిరిగి చెల్లించ‌డంలో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. భార‌తీయ విశ్వవిద్యాల‌యాల‌తో పోలిస్తే విదేశీ విశ్వ‌విద్య‌ల‌యాల‌లో ల‌భించే విద్య‌ ఖ‌రీదైన‌దిగా ఉండ‌డం వ‌ల్ల, ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ఇందుకు తీసుకునే రుణం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల విద్యార్థులు త‌మ చ‌దువు పూర్తైన వెంట‌నే ఉద్యోగంలో చేర‌డం చాలా అవ‌స‌రం. మార్కెట్లో ఉపాది శాతం మంద‌గిస్తే విద్యార్ధులు, హామీదారుల‌పై ఒత్తిడి పెరుగుతుంది.

అందువ‌ల్ల పిల్ల‌లను విదేశాల్లో చ‌ద‌వించాలి అని కోరుకునే త‌ల్లిదండ్రులు ప్రారంభం నుంచి ఇందుకు కావ‌ల‌సిన నిధుల‌ను సేక‌రించుందుకు త‌గిన ప్ర‌ణాళిక రూపొందించికోవాలి. విదేశీ విద్య కోసం త‌క్కువ స‌మ‌యంలో నిధులు సేక‌రించ‌డం క‌ష్ట‌త‌రంగా ఉంటుంది. ఇది వారి ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితానికి న‌ష్టం క‌లిగించే అవ‌కాశం కూడా ఉంటుంది. తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యాన్ని అంచానా వేయకుండా రుణం తీసుకోవడం మంచిది కాదు. రుణం తీసుకునే ముందు, విద్యార్థి తీసుకునే కోర్సు పూర్తైన త‌రువాత‌ ఎక్క‌డ ఉద్యోగం రావ‌చ్చు, స‌గ‌టు జీతం ఎంత ఉండొచ్చు త‌దిత‌ర విష‌యాల‌ను అంచానా వేసుకుని వాటికి త‌గిన‌ట్ల‌గా రుణం తీసుకోవాలి.

రుణ చెల్లింపుకు ప్లాన్ చేసుకోండి:

రుణ సామ‌ర్ధ్యాన్ని విశ్లేషించి, అందుకు త‌గిన‌ట్లుగా ప్ర‌ణాళిక రూపొందించుకోవాలి. ఇటువంటి రుణాల‌కు సాధార‌ణంగా 5 నుంచి 7 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటుంది. విద్యార్థి డిగ్రీ పూర్తైయ్యే నాటికి 12 నుంచి 18 నెల‌ల‌కు చెల్లించ‌వ‌ల‌సిన మొత్తాన్ని ప‌క్క‌న పెట్టుకోవ‌డం మంచిది. చివ‌రి నిమిషంలో ఇబ్బంది ప‌డకుండా ప‌నిచేయండం మొద‌లు పెట్టిన నాటి నుంచి పొదుపు చేయ‌డం ప్రారంభించాలి. క్లాసులు పూర్తైన త‌రువాత స‌మ‌యం ఉన్న వారు పార్ట్‌-టైమ్ ఉద్యోగాల‌ను చేస్తున్నారు. ఈ విధంగా ప్రారంభం నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ వుంటే తిరిగి చెల్లించ‌వ‌ల‌సిన స‌మ‌యం వ‌చ్చే నాటికి అధిక మొత్తాన్ని సేక‌రించ‌వ‌చ్చు.

ఒక‌సారి మీకు ఉద్యోగం వ‌చ్చినట్లు బ్యాంకుకు తెలిపితే, రుణం తిరిగి చెల్లించేందుకు ఈఎమ్ఐలు ప్రారంభించుకోవ‌చ్చు. ఈఎమ్ఐలు చెల్లించ‌డం ప్రారంభించేందుకు స‌మ‌యం తీసుకోకండి. మీ కోర్సు పూర్తైన వెంట‌నే ప్రీ ఈఎమ్ఐ వ‌డ్డీతో రుణం తిరిగి చెల్లింపులు ప్రారంభ‌మ‌వుతాయి. మీ వ‌ద్ద పెద్ద మొత్తంలో న‌గ‌దు ఉంటే రుణం తిరిగి చెల్లించేందుకు ప్ర‌య‌త్నించండి. రుణం తీసుకున్న నాటి నుంచి తిరిగి చెల్లించేంత వ‌ర‌కు ఉన్న కాలంపై బ్యాంకులు ప్రీ-ఈఎమ్ఐ రూపంలో సాదార‌ణ వ‌డ్డీని వ‌సూలు చేస్తాయి. ప్రీ-ఈఎమ్ఐ వ‌డ్డీని కోర్సు పూర్తయ్యే లోపుగా చెల్లిస్తే బ్యాంకులు కొన్ని అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. మొత్తం రుణ స‌మ‌యానికి గానూ వ‌డ్డీ రేటులో 1 శాతం రాయితీ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ వ‌డ్డీ మొత్తాన్ని కోర్సు అయ్యే లోపుగా చెల్లించ‌క పోతే, వ‌డ్డీని, మొత్తం రుణానికి చేర్చి ఈఎమ్ఐ లెక్కిస్తారు.

వ‌డ్డీ మార్పుల‌ను గ‌మ‌నిస్తూ ఉండండి:

మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకుని వుంటే, మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎమ్‌సీఎల్ఆర్‌) ఆధారంగా బ్యాంకులు విధించే వ‌డ్డీరేటు ప్ర‌తీ సంవ‌త్స‌రం మారుతూ ఉంటుంది. ఆర్‌బీఐ రేటు క‌ట్ చేయ‌డం వ‌ల్ల ఎమ్‌సీఎల్ఆర్ త‌గ్గితే మీకు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు:

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80ఈ ప్ర‌కారం విద్యారుణంపై చెల్లించే వ‌డ్డీపై ప‌న్ను ప్ర‌యోజ‌న‌లు పొంద‌వ‌చ్చు. ఈ మొత్తాన్ని పొదుపు, పెట్టుబ‌డి మార్గాల‌లో పెట్టుబ‌డిపెట్టి రాబ‌డిని పొంద‌వ‌చ్చు. ఈ మొత్తంతో ప్ర‌తీ సంవ‌త్స‌రం 5 నుంచి 10 శాతం ఎక్కువ ఈఎమ్ఐ చెల్లించ‌వ‌చ్చు. క్ర‌మ బ‌ద్దంగా ఈఎమ్‌లు చెల్లించ‌డం ద్వారా మంచి క్రెడిట్ స్కోరును పొంద‌వ‌చ్చు. క్రెడిట్ స్కోరు 700 కంటే ఎక్కువ‌గా ఉంటే మీకు కావ‌ల‌సిన క్రెడిట్ కార్డుల‌ను పొంద‌డంతో పాటు గృహ‌, వాహ‌నం వంటి ఇత‌ర రుణాలు తొంద‌రంగా మంజూరైయ్యే అవ‌కాశం ఉంటుంది.

భార‌తీయ బ్యాంకులు, ఇత‌ర సంస్థ‌లు సాధారణంగా రూ. 7 ల‌క్ష‌ల పైన రుణాల‌ను త‌న‌ఖాపై మాత్ర‌మే మంజూరు చేస్తాయి. ఒక‌వేళ స‌రైన రీతిలో రుణం చెల్లించ‌క‌పోతే, ఇది మీ క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. భ‌విష్య‌త్తులో ఇత‌ర రుణాల‌ను పొంద‌డం క‌ష్టం అవుతుంది. ఒక‌వేళ మీరు రుణం తిరిగి చెల్లించ‌డంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటే మీ రుణ‌దాత వ‌ద్ద‌కు వెళ్ళి మీ ప‌రిస్థితిని విశ‌దీక‌రించి రుణాన్ని రీషెడ్యూలు చేసుకోవ‌డం మంచిది.

మీ రుణ రీ-పేమెంటును, రీ-షెడ్యూలు చేసుకుంటే రుణ కాల‌ప‌రిమితితో పాటు ఈఎమ్ఐ కూడా పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఈఎమ్‌ను చెల్లించేంత ఆదాయం లేక‌పోతే ఈఎమ్‌ను త‌గ్గించుకుని కాల‌ప‌రిమితి పెంచుకోవ‌చ్చు. ప్ర‌తినెలా చెల్లించే ఈఎమ్ఐ త‌గ్గుతూ ఉంటే, మీరు వాస్తవంగా చెల్లించే రుణం, వ‌డ్డీల‌ మొత్తం పెరుగుతుంది.

ఒక‌వేళ‌ రుణం చెల్లిండంలో విఫ‌లం అయితే మీతో పాటు, మీకు హామీగా ఉన్న వారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవ‌లసి రావ‌చ్చు. విద్యా అనేది దీర్ఘ‌కాల పెట్టుబ‌డి, అయితే ఇందుకు త‌గిన ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. రుణం తిరిగి చెల్లించ‌ని వారిలో మీరు ఒక‌రు కాకుండా వుండాలంటే స‌రైన విధంగా ప్ర‌ణాళిక సిద్దం చేసుకుని రుణం తీసుకోవ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు