బ్యాంక్ Vs ఎన్‌బీఎఫ్‌సీ- వ్యాపార రుణానికి ఏది మంచిది?

వ్యాపారం కోసం రుణం తీసుకోవాల‌నుకుంటున్న‌ చిన్న వ్యాపారస్తుల‌కు ఎదుర‌య్యే ప్ర‌శ్న రుణం ఎక్క‌డ తీసుకోవాలి? బ‌్యాంక్‌ను సంప్ర‌దించాలా? లేదా బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌(ఎన్‌బీఎఫ్‌సీ)నా? రుణ గ్ర‌హీత అవ‌స‌రాల‌కు అనుగుణంగా అటు బ్యాంకులు, ఇటు ఎన్‌బీఎఫ్‌సీలు కూడా మంచి

Published : 23 Dec 2020 15:45 IST

వ్యాపారం కోసం రుణం తీసుకోవాల‌నుకుంటున్న‌ చిన్న వ్యాపారస్తుల‌కు ఎదుర‌య్యే ప్ర‌శ్న రుణం ఎక్క‌డ తీసుకోవాలి? బ‌్యాంక్‌ను సంప్ర‌దించాలా? లేదా బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌(ఎన్‌బీఎఫ్‌సీ)నా? రుణ గ్ర‌హీత అవ‌స‌రాల‌కు అనుగుణంగా అటు బ్యాంకులు, ఇటు ఎన్‌బీఎఫ్‌సీలు కూడా మంచి ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నాయి. మ‌రి బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం ఏంటి? ఈ రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం తెలుసుకుంటే చిన్న వ్యాపారాల‌కు రుణం ఎక్క‌డ తీసుకోవాలి అనేది అర్ధం అవుతుంది.

బ్యాంకు-ఎన్‌బీఎఫ్‌సీల మ‌ధ్య ప్ర‌ధాన వ్యాత్యాసాలు:
బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు(ఎన్‌బీఎఫ్‌సీ)లు బ్యాంకులు కావు. అయితే బ్యాంకుల మాదిరిగానే రుణాల‌ను మంజూరు చేయ‌డం, పొదుపు ఖాతాలు, పెట్టుబ‌డి ప‌థ‌కాలు, మ‌నీ మార్కెట్‌లో ట్రేడింగ్ నిర్వ‌హించ‌డం, స్టాక్‌ల పోర్ట్ ఫోలియో నిర్వ‌హించ‌డం, న‌గ‌దు బ‌దిలీ, వంటి కార్య‌కాలాపాల‌ను నిర్వ‌హిస్తుంటాయి. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కంపెనీ, సుంద‌రం ఫైనాన్స్‌, ఐసీఐసీఐ వెంచ‌ర్స్ వంటివి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు.

ఎన్‌బీఎఫ్‌సీల‌ను మూడు ర‌కాలుగా వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు.
1.ఎసెట్ కంపెనీలు
2.లోన్ కంనెనీలు
3.ఇన్‌వెస్ట్‌మెంట్ కంపెనీలు.
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రెండూ ఆర్థిక సేవ‌ల‌ను అందిస్తాయి. అయితే వాటి నియంత్ర‌ణ‌లో మాత్రం చాలా పెద్ద వ్య‌త్యాసం ఉంది. బ్యాంకులను రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నియంత్రిస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీల‌ను కంపెనీల చ‌ట్టం, 1956 నియంత్రిస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీలు డిపాజిట్ల‌ను అనుమ‌తించ‌వు. అదేవిధంగా చెక్కులు, డ్రాఫ్ట్‌ల‌ను జారీ చేయ‌వు. మ‌రోవైపు బ్యాంకులు, పేమెంట్‌, సెటిల్‌మెంట్ సిస్ట‌మ్‌లో ఒక భాగంగా ప‌నిచేస్తాయి. ఖాతాదారులు న‌గ‌దును పంపించ‌వ‌చ్చు, అందుకోవ‌చ్చు.

చిన్న వ్యాపార రుణాల‌కు ఎవ‌రిని సంప్ర‌దించాలి?

ఎన్‌బీఎఫ్‌సీలు రుణాల‌ను మాత్ర‌మే అందిస్తాయి. చాలామంది చిన్న వ్యాపార రుణాల‌కు ద‌ర‌ఖాస్తు చేసేవారు ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రాముఖ్య‌తనిస్తారు. సాంప్ర‌దాయ బ్యాంకుల‌తో పోలిస్తే, చిన్న వ్యాపార రుణాల‌ను పొందేందుకు ఎన్‌బీఎఫ్‌సీలు మంచి ఎంపిక అని చెప్పుకోవ‌చ్చు. ఇందుకు కార‌ణాలు

వ‌డ్డీరేట్లు:
బ్యాంకు రుణాలు ఎమ్‌సీఎల్ఆర్‌తో పాటు ఆర్‌బీఐ లెండింగ్ రేటు, అంత‌ర్జాతీయ మార్కెట్లు వంటి మైక్రో ఎక‌న‌మిక్ ఫ్యాక్ట‌ర్ల‌పై ఆధార‌ప‌డి ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలు ప్రైమ్ లెండింగ్ రేటు(పీఎల్ఆర్‌) ఆధారంగా రుణాల‌ను మంజూరు చేస్తాయి. పీఎల్ఆర్ ఆర్‌బీఐ నియంత్ర‌ణ‌లో ఉండ‌దు. అందువ‌ల్ల వ‌డ్డీ రేట్ల‌ను ఆక‌ర్షిణీయంగా మార్చేందుకు ఎన్‌బీఎఫ్‌సీలకు వీలుంటుంది. అయితే బ్యాంకులకు ఈ అవ‌కాశం ఉండ‌దు.

రుణ అర్హ‌త‌:
రుణ అర్హ‌త‌ను నిర్ణ‌యించ‌డంలో ఎన్‌బీఎఫ్‌సీలు స‌డ‌లింపు విధానాన్ని అనుస‌రిస్తాయి. బ్యాంకులు రుణ గ్ర‌హీత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా నిధులు మంజూరు చేయ‌వు. కొంత భాగాన్ని మాత్ర‌మే ఇస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీ పూర్తి విలువ‌ను మంజూరు చేస్తాయి. అందువ‌ల్ల బ్యాంకుల కంటే ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ‌ల వ‌ద్ద ఎక్కువ ఎస్ఎమ్ఈ రుణం పొందేందుకు వీలుంటుంది.

పేప‌ర్ వ‌ర్క్‌:
త‌క్కువ పేప‌ర్ వ‌ర్క్‌, ప్రాసిసెంగ్ విధానం సుల‌భంగా ఉండ‌డం వ‌ల్ల చిన్న వ్యాపార‌స్తులు ఎన్‌బీఎఫ్‌సీల వైపు మొగ్గు చూపుతున్నారు. బ్యాంకుల‌లో ఎక్కువ పేప‌ర్ వ‌ర్క్‌, అధిక ప్రాసిసెంగ్ విధానం ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దారుడు అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను అందించ‌డంలో విఫ‌ల‌మ‌యితే రుణ ప్రాసెస్ ప్రారంభించేదుకు బ్యాంకులు తిరస్క‌రిస్తాయి. అయితే ఎన్‌బీఎఫ్‌సీలు త‌క్కువ డాక్యుమెంటేష‌న్‌తో, త‌క్కువ స‌మ‌యంలో రుణ ప్రాసెస్‌ను ప్రారంభించి రుణం మంజూరు చేస్తాయి. అత్య‌వ‌స‌రంగా నిధులు అవ‌స‌ర‌మైన వ్య‌పార‌స్తుల‌కు ఎన్‌బీఎఫ్‌సీలు పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తాయి.

క్రెడిట్ స్కోరు:
సాధారణంగా, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న‌వ్యక్తులకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఎందుకంటే త‌క్కువ క్రెడిట్‌స్కోరు ఉన్న వారు స‌క్ర‌మంగా ఈఎమ్ఐ చెల్లించ‌ర‌ని బ్యాంకులు భావిస్తాయి. అయితే ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం త‌క్కువ క్రెడిట్ స్కోరు ఉన్న‌ప్ప‌టికీ చిన్న వ్యాపార‌స్తుల‌కు రుణాల‌ను మంజూరు చేస్తున్నాయి. అందువ‌ల్ల‌ ఎన్‌బీఎఫ్‌లు అధిక వ‌డ్డీ రేట్ల‌ను వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది.

చివ‌రిగా:
కేవ‌లం బ్యాంకులు అందించే రుణాల‌తో చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెంద‌లేవు. చిన్న వ్యాపార‌స్తుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా రుణాలను మంజూరు చేయ‌డంలో ఎన్‌బీఎఫ్‌సీలు ముఖ్య పాత్ర వ‌హిస్తున్నాయి. రుణాల‌ను అందించ‌డంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు కంటే వేగంగా విస్త‌రిస్తున్నాయ‌ని, రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక స్థిర‌త్వ నివేదిక‌లో వెల్ల‌డించింది. ఏదిఏమైన‌ప్ప‌టికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల‌లో ఎక్క‌డ రుణం తీసుకోవాల‌నేది వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం, వ్య‌క్తి త‌న వ్యాపారం అవ‌స‌రాలు, అందుబాటులో ఉన్న ప్ర‌యోజ‌నాలు, వ్యాపార అభివృద్ధి వంటి అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని రుణాల కోసం ఎన్‌బీఎఫ్‌సీల‌ను గానీ బ్యాంకుల‌ను గానీ సంప్ర‌దించ‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని