విద్య రుణం లో మరువకుడని పది విషయాలు

ఇంజినీరింగ్‌ ప్రవేశాల హడావుడి మొదలయ్యింది. కాస్త ఖర్చు ఎక్కువైనా మంచి కళాశాలలో తమ పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ఆర్థికంగా చేదోడు ఇచ్చేందుకు బ్యాంకులూ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ సిద్ధంగా ఉన్నాయి. మరి, విద్యా రుణం తీసుకునే

Published : 23 Dec 2020 15:44 IST

ఇంజినీరింగ్‌ ప్రవేశాల హడావుడి మొదలయ్యింది. కాస్త ఖర్చు ఎక్కువైనా మంచి కళాశాలలో తమ పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ఆర్థికంగా చేదోడు ఇచ్చేందుకు బ్యాంకులూ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ సిద్ధంగా ఉన్నాయి. మరి, విద్యా రుణం తీసుకునే ముందు ఏ అంశాలను పరిశీలించాలో తెలుసుకుందాం!వ్యక్తిగత, ఇతర సాధారణ రుణాలకూ… విద్యా రుణాలకూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దీనికి తక్కువ వడ్డీ రేటు, చెల్లించిన వడ్డీకి పూర్తి పన్ను మినహాయింపుల్లాంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి, నిజంగా చదువు కోసమే అయితే, నేరుగా విద్యా రుణానికి దరఖాస్తు చేసుకోవడమే ఉత్తమం.

విద్యా రుణం తీసుకోవాలా? వద్దా? అని నిర్ణయించుకునే ముందు మీకు అందుబాటులో ఉన్న డబ్బు గురించి తెలుసుకోండి. ఫీజు తిరిగి చెల్లింపు (రీఇంబర్స్‌మెంట్‌), ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌)లాంటివి ఉన్నాయా చూసుకోవాలి. ఆ తర్వాత మీ చేతి నుంచి ఎంత చెల్లించాల్సి వస్తోంది? లెక్క వేసుకోవాలి. భరించగలం అనుకుంటే… రుణం తీసుకోకపోవడమే మేలు. స్వదేశంలోనైనా… విదేశంలోనైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఒకసారి ఎంత రుణం కావాలన్నది తెలుసుకున్నాక, మీ అవసరాలకు తగిన విధంగా అప్పు ఇచ్చే రుణ సంస్థను ఎంచుకోవాలి. రుణ నిబంధనల్లోనూ, అడిగినంత అప్పు ఇవ్వడంలోనూ, వడ్డీ రేట్లు, మీరు నిర్ణయించుకున్న కోర్సుకు రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అనేది తెలుసుకోవాలి. కొన్ని రుణ సంస్థలు పూర్తిగా 100 శాతం రుణాన్ని ఇస్తాయి. బ్యాంకులు గరిష్ఠంగా రూ.20లక్షల వరకూ విద్యారుణం ఇస్తుండగా… బ్యాంకింగేతర రుణ సంస్థలు రూ.కోటి వరకూ ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి.
విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఆశించిన రుణం తీసుకోవడానికి సరిపోతుందా? లేదా అదనంగా మరో సహ దరఖాస్తుదారుడు అవసరమా తెలుసుకోవాలి. రుణ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులు/రుణ సంస్థలు సాధారణంగా అదనపు హామీని అడిగే అవకాశం ఉంది.

కళాశాలను, కోర్సును ఎంచుకునేముందు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించండి. కోర్సు పూర్తయ్యాక ఎలాంటి ఉపాధి అవకాశాలు అందాయి? ఎంత వరకు వేతనాలు అందుతున్నాయి తదితరాలను తెలుసుకోవాలి. విద్యారుణం కోసం దరఖాస్తు చేసేప్పుడు ఈ అంశాలూ కీలకమే. కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే ఇస్తారా? ఇతర ఖర్చులను కూడా కలిపి ఇస్తారా అనేది చూసుకోవాలి. ఉదాహరణకు పుస్తకాలు, కంప్యూటర్‌ తదితరాలకూ రుణం తీసుకునే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రయాణ, వసతి, బీమా ప్రీమియంలాంటి వాటికి కూడా రుణం ఇస్తారు.

బ్యాంకుల/రుణ సంస్థల వెబ్‌సైట్లను సంప్రదించి, అందులో రుణాన్ని మంజూరు చేయాలంటే ఉండాల్సిన అర్హతలు, రుణ మొత్తం ఎంత వరకూ వస్తుంది? ఏయే విద్యాసంస్థలతో ఒప్పందం ఉంది? ఎంత మేరకు రుణం వస్తుంది అనే వివరాలను ప్రాథమికంగా తెలుసుకోండి. ‘విద్యాలక్ష్మి’ వెబ్‌సైటులో విద్యారుణాల కోసం దరఖాస్తు చేసుకొంటే… బ్యాంకులే మిమ్మల్ని సంప్రదిస్తాయి. ‘విమేక్‌స్కాలర్స్‌’లాంటి కొన్ని ఇతర వెబ్‌సైట్లు కూడా విద్యారుణాలను ఇప్పించడంలో సహాయం చేస్తున్నాయి.
రుణాన్ని పొందడానికి చాలాసందర్భాల్లో ఇల్లు, ఫ్లాటు, వ్యవసాయ భూమి, స్థిర డిపాజిట్‌ లాంటివి హామీగా అవసరం అవుతాయి. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో రుణ మొత్తానికి సరిపోయే విధంగా హామీ అడుగుతాయి. బ్యాంకింగేతర సంస్థలు రుణ మొత్తంలో 80శాతం వరకూ హామీ ఇస్తే చాలంటున్నాయి. ఆస్తులను తనఖా పెట్టి, విద్యారుణం తీసుకోవడం వల్ల వడ్డీ రేట్లలో కొంత రాయితీని కోరడానికి అవకాశం ఉంటుంది.

రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఏయే పత్రాలు అవసరం అవుతాయనే వివరాలతో కూడిన ఒక పట్టికను తీసుకోండి. అవసరమైన అన్ని పత్రాలనూ సమర్పించడం ద్వారా రుణ మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. సాధారణంగా ‘మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి’ (కేవైసీ), విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, హామీగా ఉంచబోయే ఆస్తులకు సంబంధించిన పత్రాల నకళ్లు సమర్పించాల్సి ఉంటుంది.

రుణాన్ని ఎలా చెల్లించాలనే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. నెలవారీ సాధారణ వడ్డీని చెల్లించాలనుకుంటున్నారా? మారటోరియం అవసరమా? అనేది నిర్ణయించుకోవాలి. నెలవారీ సాధారణ వడ్డీని చెల్లించడం వల్ల చదువు పూర్తయ్యాక, రుణ చెల్లింపు అంత భారం అనిపించదు. అనివార్య పరిస్థితుల్లో తప్పదు అనుకుంటేనే మారటోరియం సౌలభ్యాన్ని ఎంచుకోవాలి. అంటే, నెలవారీ వడ్డీ కాకుండా, చదువు పూర్తయ్యాక రుణ వాయిదాలతో కలిపి చెల్లించే విధంగా అన్నమాట.
రుణానికి సంబంధించిన నియమ నిబంధనల విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. వడ్డీ రేటు ఎంత? తిరిగి చెల్లింపు వ్యవధి, రుణ వాయిదాలను ఎప్పటినుంచి చెల్లించాలి? అనేవి తెలుసుకోండి. చదువు పూర్తయ్యాక నెలవారీ వాయిదా మొత్తం ఎంత ఉండవచ్చనేదీ చూసుకోవాలి. బ్యాంకు/బ్యాంకింగేతర రుణ సంస్థ అధీకృత సేవాకేంద్రాన్ని సంప్రదించి ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి.

వీటన్నింటితోపాటు, నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం ఎలా ఉంటుందనేదీ చూసుకోవాలి. దీనివల్ల తల్లిదండ్రులు, సహ సంతకం చేసినవారూ భవిష్యత్తులో కొత్త రుణాలు తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అనేదీ తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని