'అప్పు'డే జాగ్రత్త పడాల్సింది

ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో… అప్పు చేయడం సర్వసాధారణ మయ్యింది… మనకు అప్పు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్న వారినుంచి మన అవసరానికి డబ్బు తీసుకొని, దానిని వడ్డీతో సహా కలిపి చెల్లిస్తాం. ప్రస్తుతం అప్పు అనేక మార్గాల నుంచి ఎన్నో రూపాల్లో లభిస్తోంది. బ్యాంకులతోపాటు

Updated : 01 Jan 2021 15:48 IST

ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో… అప్పు చేయడం సర్వసాధారణ మయ్యింది… మనకు అప్పు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్న వారినుంచి మన అవసరానికి డబ్బు తీసుకొని, దానిని వడ్డీతో సహా కలిపి చెల్లిస్తాం. ప్రస్తుతం అప్పు అనేక మార్గాల నుంచి ఎన్నో రూపాల్లో లభిస్తోంది. బ్యాంకులతోపాటు పలు రుణ సంస్థలు గృహ, వాహన, వ్యక్తిగత, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రుణాలను అందిస్తున్నాయి. క్రెడిట్‌ కార్డులనూ అందిస్తున్నాయి. మరోవైపు బంగారం తనఖా పెట్టి అప్పు తీసుకోవచ్చు… హామీ లేకుండా లభించే రుణాలు అనేకం. ఇలా పలు మార్గాల్లో రుణం దొరుకుతున్న నేపథ్యంలో అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటోంది. అలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలి?

అర్జున్‌ ఏం చేశాడంటే..

అర్జున్‌ ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వయసు 35 ఏళ్లు. భార్య గృహిణి. వారికి ఇద్దరు పిల్లలు. అర్జున్‌ వయసు 22 ఏళ్లు ఉన్నప్పుడు అంటే.. 13 ఏళ్ల క్రితం సాఫ్ట్‌వేర్‌ రంగం మంచి ఊపు మీద ఉన్నప్పుడు నెలకు రూ.50,000 జీతంతో అతను ఉద్యోగంలో చేరాడు. బరువు బాధ్యతలు పెద్దగా లేవు. పైగా చేతిలో కావాల్సినంత డబ్బు. ఎంత ఖర్చు చేసినా ఇబ్బందే లేదు. అప్పుడే అతనికి ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చింది. గృహరుణం తీసుకున్నాడు. నెలకు రూ.35,000 ఈఎంఐ. అయినా రూ.15,000 మిగిలేవి. అతని ఖర్చులకు ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు 

25 ఏళ్ల వయసులో అర్జున్‌కు వివాహం అయ్యింది. ఖర్చులు పెరిగాయి. జీతం కూడా నెలకు రూ.58,500 అయ్యింది. నెలకు రూ.30,000 వరకూ ఖర్చులకు అవసరం అవుతున్నాయి. గృహరుణం ఈఎంఐ రూ.35వేలు అలానే ఉంది. ఒక్కసారిగా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అనే పరిస్థితిలోకి వచ్చాడు అర్జున్‌. ఇక లాభం లేదనుకున్నాడు అర్జున్‌. రూ.5లక్షల వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావించాడు. అధిక జీతం కోసం ఉద్యోగం మారాలనుకున్నాడు. కొత్త జీతం నెలకు రూ.75,000. అదే సమయంలో వ్యక్తిగత రుణానికి నెలకు రూ.7,000 ఈఎంఐ చెల్లించడం ప్రారంభించాడు. మెల్లిగా పరిస్థితి మెరుగుపడుతుంది అనుకుంటుండగానే.. కొత్త రుణాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక కారు కొనుగోలు చేశాడు. పాత ఇల్లు అమ్మేసి, కాస్త పెద్ద ఇల్లు తీసుకున్నాడు. ఇప్పుడు అతని జీతం నెలకు రూ.2లక్షలు. అదే సమయంలో తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న నెలసరి వాయిదాల మొత్తం పెరిగింది. మంచి జీతం వస్తుందన్నమాటే కానీ.. కొత్తగా ఆస్తిని సంపాదించడంకానీ, అనుకోని ఖర్చులకు సిద్ధంగాగానీ లేడు. అవసరం ఏదైనా వస్తే అప్పు చేయడమే పనిగా.. రోజులు గడుపుతున్నాడు.

అర్జున్‌ స్నేహితుడు భార్గవ్‌… నెలకు రూ.40వేల జీతంతో ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ.20 వేలు ఖర్చులు పోను.. మిగతాది పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అతనికి వివాహం అయ్యేనాటికి నెలకు రూ.47 వేల జీతం. ఖర్చులు రూ.40వేలు. అప్పుడు అతను తన పెట్టుబడి మొత్తాన్ని తగ్గించుకున్నాడు. కానీ, ఆపలేదు. కోరికలను వాయిదా వేసుకోవడం నేర్చుకున్న భార్గవ్‌.. తన ప్రతి అవసరానికీ సాధ్యమైనంత వరకూ తన సొంత పెట్టుబడి నుంచే కేటాయించేలా ప్రణాళిక వేసుకున్నాడు. అతని ఆర్థిక సామర్థ్యాన్ని బట్టే ఖర్చులు చేయడం అలవాటు చేసుకున్నాడు. ప్రస్తుతం భార్గవ్‌ కూడా గృహరుణం, వాహన రుణం తీసుకున్నాడు. వాటికి ఈఎంఐలు కూడా చెల్లిస్తున్నాడు. కానీ, ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడంతో.. ప్రస్తుతం అతని చేతిలో రూ.1.5కోట్ల నిధి ఉంది.

డబ్బు ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు.. దాన్ని ఎంత సమర్థంగా నిర్వహిస్తున్నామన్నదే ప్రధానమని ఈ రెండు ఉదాహరణలతో మనం అర్థం చేసుకోవచ్చు.

అప్పు తీసుకోవడం సులభమే. కానీ, దానిని వడ్డీతో సహా తిరిగి తీర్చేయడం ఎంతో కష్టమైన పనే. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నా… క్రమంగా అప్పు అసలు మొత్తాన్ని తగ్గించుకోకుండా అలాగే ఉంటున్నా… రుణాన్ని తీర్చే క్రమంలో ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నా… ఇలా ఏ ఒక్కటి ఉన్నా… మనం అప్పుల ఊబిలో ఉన్నట్లు లెక్క.

అప్పులు అధికం అయినప్పుడు మొదట చిన్న చిన్న ఇబ్బందులే వస్తాయి. రానురాను అవి పెను భూతంలా మారతాయి. సాధారణంగా మనం సంపాదించిన మొత్తాన్ని బట్టి ఖర్చులు ఉండాలి. భవిష్యత్తులో ఏదో ఒక ఆదాయం వస్తుంది… దాని ఆధారంగా ఈ అప్పును తీర్చేయవచ్చు అనే ఆలోచన ఉన్నప్పుడే అప్పు చేస్తుంటాం. ఏదో ఒక కారణంతో… మనం అనుకున్న ఆ భవిష్యత్తు డబ్బు రాకపోతే… ఏమిటి పరిస్థితి? ఆ రుణాన్ని తీర్చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ దాన్ని ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ ఉంటే… మీ నెలవారీ ఖర్చుల మొత్తం పెరుగుతుంది. వాయిదాల కోసం ప్రత్యేకంగా డబ్బును కేటాయించాలి. అంటే… అప్పటి వరకూ ఉన్న ఇంటి బడ్జెట్‌ గాడి తప్పుతుంది. ఆదాయం పెరగకపోగా ఖర్చులు పెరగడంతో… జీవన శైలిపై ఆ ప్రభావం పడుతుంది. కొత్త అప్పులు చేయాల్సిన అవసరమూ రావచ్చు. ఒకసారి ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే… వాస్తవం ఏమిటో అర్థమవుతుంది.

ఖర్చు ఎక్కువైతే..

అప్పుల ఊబిలో చిక్కుకోవాలని ఎవరికీ ఉండదు. అయితే, ఒకసారి అప్పు చేయడం ఆరంభమైతే దానికి అంతం అనేదీ ఉండదు. కాస్త జాగ్రత్తగా కొన్ని సూత్రాలను పాటిస్తేనే ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉంటాం. మీకు వచ్చే ఆదాయం అంటే.. జీతం, వడ్డీ, డివిడెండ్లు, అద్దె వగైరా ఇలా అన్నీ కలిపి ఒకసారి లెక్కవేసుకోండి. దీనికన్నా మీ నుంచి వెళ్తే మొత్తం అంటే.. నిత్యావసర ఖర్చులు, అద్దె, బీమా ప్రీమియాలు, ఈఎంఐల లాంటివి తక్కువగా ఉండేలా చూసుకోండి. కోరికలను వాయిదా వేయడం నేర్చుకోవాలి. అప్పటికప్పుడు కావాల్సిన వస్తువు కొనాలనే ఆదుర్దా పనికిరాదు.

అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. రుణం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆ రుణ వాయిదాలకు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం ఎలా అనేది చూసుకోవాలి. అధిక వడ్డీ రుణాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. కనీసం 10శాతం వరకూ వడ్డీ ఉండే రుణాలు కొంత మేలు. అంతకు మించి వడ్డీ రేటు ఉన్న రుణాల జోలికి పోకుండా ఉండటమే ఉత్తమం. నిజం తెలుసుకోండి. అప్పులు పెరుగుతున్న సంగతి మనకు అర్థం అవుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు… ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామన్న సంగతిని గుర్తించండి. ఎలాంటి భేషజాలకూ పోవద్దు.

అప్పులను తీర్చేందుకు ఏం చేయాలన్న విషయాన్ని ఆలోచించండి. ఏక మొత్తంగానా… వాయిదాల్లో చెల్లించాలా అనేది నిర్ణయించుకోండి. దానికి తగ్గట్టుగా ఖర్చులను తగ్గించి, మిగులు మొత్తం పెరిగేలా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోండి.
అవసరంలో ఎంత వరకూ డబ్బును మనకు మనమే సమకూర్చుకోగలం అనేది చూసుకోండి. బ్యాంకులో ఉన్న మొత్తం, ఎవరికైనా చేబదులుగా ఇచ్చారా, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు, ఏదైనా స్థిరాస్తులు అమ్మే అవకాశం ఉందా… చూసుకోండి. ఆ తర్వాతే అప్పు చేసే విషయాన్ని ఆలోచించండి.

సలహా తీసుకోండి…
అన్ని విషయాలూ మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు… వాటిని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. రుణాల భారంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు ఒకరకమైన భయం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడేందుకూ, మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను తిరిగి నిర్మించుకునేందుకు మంచి ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం మేలు. మీ వివరాలు, అవసరాలకు అనుగుణంగా వారు మంచి ప్రణాళికను సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది.

వడ్డీ భారం తగ్గేలా…

అప్పు చేయడం అంటే… అదనంగా వడ్డీ భారం మోయడమే. ఈ వడ్డీ ఎంత తక్కువగా ఉంటే అంత మేలు. కాబట్టి, అప్పు చేయడం తప్పదు అనుకున్నప్పుడు తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ గమనించాలి. సాధ్యమైనంత వరకూ వడ్డీ రేటు 10శాతం లోపు ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో అధిక వ్యవధిని ఎంచుకోవడం ద్వారా నెలవారీ ఈఎంఐల భారం కొంత మేరకు తగ్గించుకునేందుకు వెసులుబాటు దొరుకుతుంది. అనుకోని విధంగా ఆదాయం వచ్చినప్పుడు 10శాతానికి మించి వడ్డీ రేటు ఉన్న అప్పులను వదిలించుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి మిగులు మొత్తం పెరిగితే… వెంటనే రుణ వాయిదాల మొత్తాన్ని ఆ మేరకు పెంచుకోవాలి. దీనివల్ల అప్పును తొందరగా ముగించి వేసేందుకు వీలవుతుంది. మరీ అవసరం అయితే… తప్పదు అనుకుంటే… అప్పుడు స్థిరాస్తులను విక్రయించి, అప్పుల ఊబి నుంచి బయటపడే ఆలోచన చేయవచ్చు.

గుర్తుంచుకోండి… స్థిరాస్తిని ఒక్కసారి అమ్మితే… ఆ ఆస్తిని మళ్లీ సంపాదించడం ఎంతో కష్టం. ఇక్కడ ఇంకో విషయం… అప్పులు అధికంగా చేసినప్పుడు… అవి మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎలాగైనా వాటిని వదిలించుకోవాలనే ఆలోచన వస్తుంది. ఇలాంటప్పుడు మీ దగ్గర ఉన్న అన్ని పెట్టుబడులూ… నిధులూ కరిగిపోతాయి. మళ్లీ మొదటి నుంచి మీ పెట్టుబడి ప్రణాళికను ప్రారంభించాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చేసిన అప్పుల ప్రభావం జీవితాంతం వరకూ మీకు ఏదో ఒక విధంగా నష్టం చేస్తూనే ఉంటుందన్న విషయాన్నీ మనం మర్చిపోకూడదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని