Published : 24 Dec 2020 22:32 IST

ఈ అప్పు అవసరమా?

ఇటీవల ఒక దుర్వార్త విన్నాం, అదే 178 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కంపెనీ ’ థామస్ కుక్ ’ మూతపడడం. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా అందులో పనిచేసే 22 వేల మందికి ఉద్యోగాలు పోవడమే కాక , ఆ సంస్థ ద్వారా సేవలు పొందుతున్న విహారయాత్రలకు వెళ్లిన 6 లక్షల ప్రయాణికులు వివిధ ప్రదేశాల నుంచి తిరిగి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే సొమ్ము చెల్లించి, ఇంకా సేవలు వినియుగించుకోనివారు , వారి సొమ్ము ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు. రాత్రికిరాత్రే కంపెనీ మూతపడుతున్నట్లు ప్రకటించింది. దీనికి అసలు కారణం మోయలేని అప్పుల భారం. ఇటువంటి సమయంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినా , అధిక రుణ భారంతో ఉన్న కంపెనీని తిరిగి గాడిలో పెట్టడం చాలా కష్టమే.

దీనిని మన జీవితానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఫై ఎదగాలని ఉంటుంది. దానికోసం మన దగ్గర ఉన్న శక్తి సామర్ధ్యలైన చదువు, జ్ఞానం, వినయం, నమ్మకం వంటి వాటిని ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదగాలి. ప్రతి మెట్టు ను చూసుకుంటూ వెళ్ళాలి. తొందరపాటు పనికి రాదు. అవసరమైన మేరకు, తిరిగి చెల్లించే సామర్ధ్యం , చెల్లించ గలనన్న నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే రుణం తీసుకోవాలి. రుణదాత ఆశయం తన సొమ్ము తో కొంత వడ్డీ ఆదాయం కూడా లభిస్తుందని మనకు సొమ్ము ఇస్తారు. కానీ పక్షంలో మన దగ్గర ఉన్న ఆస్తులను అమ్మైనా తన సొమ్మును వసూలు చేసుకుంటాడు. అందువల్ల మనం అవసరం ఉన్న మేరకే కొద్ది మొత్తంలో రుణం తీసుకోవాలి.

రుణాలలో అనేక రకాలు ఉంటాయి. వ్యాపారస్తులకు స్వల్పకాలిక, కొన్ని సంస్థలకు మధ్యకాలిక, కంపెనీలకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. అదే వ్యక్తులకు ఇల్లు, స్థలం కొనుగోలు, విద్యా రుణం , విహార యాత్రలకు వంటివి. ఇందులో రెండు రకాలు తనఖా పెట్టి తీసుకునేవి, తనఖా లేకుండా తీసుకునేవి. ఇల్లు, స్థలం , పొలం కాగితాలు తనఖా పెట్టి తీసుకోవచ్చు. అలాగే బంగారం తనఖా పెట్టి తీసుకునే రుణం . దీనిలో 50-60 శాతం విలువ వరకు రుణం ఇస్తారు. ఒకవేళ అప్పు తీర్చలేక పొతే ఆ ఇల్లు, స్థలం లేదా బంగారాన్ని అమ్మి తన బాకీ సొమ్ము ను వడ్డీతో సహా తీసుకుంటారు.

ఒకవేళ తనఖా లేని రుణం తీసుకుంటే , తన బాకీ రాబట్టుకునేందుకు అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడరు . దీనివల్ల ఆర్ధిక నష్టమే కాకుండా పరువు నష్టం కూడా . ఆ ధీమాతోనే ఆర్ధిక సంస్థలు, బ్యాంకులు వివిధ రకాల ఆకర్షణలతో ముఖ్యంగా యువతరానికి రుణాలు ఇవ్వజూపుతున్నారు. చాలా మంది తమకు ప్రాముఖ్యతనిస్తూ ఎటువంటి తనఖా లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నారని , ఎటువంటి లక్ష్యం లేకుండా అవసరం ఉన్నా లేకున్నా అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు . కొంత కాలం అయిన తరువాత తప్పు గ్రహించి, తిరిగి అప్పు తీర్చుదామంటే ముందస్తు చెల్లింపు రుసుములతో దాదాపు అంతే వడ్డీని వసూలు చేస్తున్నారు.

ముగింపు:
మారుతున్న కాలానికి పెరిగిన జీవన ప్రమాణాలకు, జీవన విధానాలకు అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే అసలు మనకు అవసరం ఉందా , ఎంత ఉంది, తీర్చగల సామర్ధ్యం , ఇతర ఆర్ధిక లక్ష్యాలఫై ప్రభావం వంటి అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకోవాలి. అందులోని లోటుపాట్లను గుర్తించాలి. అవసరమైతే నిపుణుల సలహా సహాయం తీసుకోవాలి. దీనివల్ల ప్రస్తుతం చేకూరే లాభం కన్నా భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని నివారించవచ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts