అప్పుల భారం వదిలించుకుందాం

ఒకసారి మన ఖర్చులు ఆదాయాన్ని మించాయంటే.. అప్పు చేయడం తప్పని పరిస్థితుల్లోకి వెళ్లిపోతాం. ఒక రుణం తీర్చేలోపే.. మరోటి పుట్టుకొస్తూనే ఉంటుంది. కొన్నాళ్లలోనే ఇది మోయలేని భారంగా మారిపోతుంది.

Updated : 25 Dec 2021 06:01 IST

ఒకసారి మన ఖర్చులు ఆదాయాన్ని మించాయంటే.. అప్పు చేయడం తప్పని పరిస్థితుల్లోకి వెళ్లిపోతాం. ఒక రుణం తీర్చేలోపే.. మరోటి పుట్టుకొస్తూనే ఉంటుంది. కొన్నాళ్లలోనే ఇది మోయలేని భారంగా మారిపోతుంది. తర్వాత ఇది తీవ్ర పరిణామాలకు దారి తీసిన సంఘటనలు ఎన్నో వింటూనే ఉంటాం. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న రుణ చరిత్ర నివేదిక దెబ్బతింటుంది. వడ్డీలు పెరిగిపోయి.. మిగతా అవసరాలకూ డబ్బు అందక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే, ఉన్నంతలో కాస్త క్రమశిక్షణతో ఈ అప్పుల భారం నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలను తెలుసుకోవడం మంచిది.


సానుకూల దృష్టితో..

అప్పులు తీర్చేందుకు మార్గం ఉంది అన్న సానుకూల ధోరణితోనే ఎప్పుడూ ఉండాలి. ఇది అవసరం కూడా. ఒక అప్పు తీసుకున్నప్పుడు దాన్ని తీర్చడం నైతిక, చట్టబద్ధమైన బాధ్యత. చెల్లింపులో ఆలస్యం, ఎగవేత, ఎంతోకొంత మొత్తానికి సెటిల్‌ చేసుకోవడంలాంటివి భవిష్యత్‌లో రుణగ్రహీతకు నష్టాన్నే కలిగిస్తాయి. క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటే.. మున్ముందు రుణాలు రావడమూ కష్టమవుతుంది. వచ్చినా అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, అప్పులన్నీ తీర్చేయడానికే సిద్ధంగా ఉండండి. దీనికి పరిష్కారం కోసం అవసరమైతే వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించి సలహాలు స్వీకరించండి.


ఆందోళన చెందకూడదు..

అనుకోని పరిస్థితుల్లో ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోవచ్చు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టం రావచ్చు. ఇలాంటివి కాకుండా.. కొంతమందికి అనిపించిన వెంటనే కొనే అలవాటు ఉంటుంది. ఇలాంటివీ అప్పుల ఊబిలోకి నెట్టివేస్తాయి. కారణమేదైనా కానీయండి. అప్పులు పెరుగుతుంటే.. వాటిని కట్టడి చేసేందుకు ప్రయత్నించాలి. కానీ, మానసిక ఆందోళనకు గురి కాకూడదు. దీనివల్ల మరిన్ని ఖర్చులు పెరగడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఆర్థిక నిపుణులను సంప్రదించినా ఫలితం కనిపించదు.


ప్రాధాన్య క్రమంలో..

ఒకసారి మీరు రుణాలను తీర్చాలని నిర్ణయించుకున్నారనుకోండి. వాటికి ప్రాధాన్య క్రమాన్ని ఇవ్వండి. కొన్నింటికి మిగతా వాటికన్నా అధిక వడ్డీ ఉండవచ్చు. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు బిల్లులు. వీటిని ఎంత త్వరగా చెల్లిస్తే అంత మంచిది. కొన్ని దీర్ఘకాలిక రుణాలుంటాయి. ఉదాహరణకు గృహరుణం. తక్కువ వడ్డీతోపాటు, ఆదాయపు పన్ను ప్రయోజనాలూ ఉంటాయి. ఇలాంటి వాటి నెలవారీ వాయిదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు.


ఒకే రుణంగా..

అప్పుల సంఖ్య ఎక్కువగా ఉంటే వాటికి చెల్లించే వడ్డీ భారం, వాయిదాలు తప్పినప్పుడు పడే రుసుములు ఇలా అనేకం ఉంటాయి. రెండు మూడు అప్పులకు బదులుగా ఒకే రుణం తీసుకోవడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఉదాహరణకు రెండు మూడు క్రెడిట్‌ కార్డు బిల్లులకు బదులు ఒక వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. ఇంటి రుణం ఉంటే.. దానికి టాపప్‌ రుణం తీసుకొని, చిల్లర రుణాలన్నింటినీ తీర్చేయడం మేలు. రుణం చెల్లింపు భారం అవుతుందని భావిస్తే.. బ్యాంకును సంప్రదించి, వాయిదా మొత్తం తగ్గించుకునే అవకాశం ఉందా చూడండి. కొన్ని సందర్భాల్లో రుణ మారటోరియానికి అవకాశం ఉండవచ్చు. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థికంగా కొంత సర్దుబాటు దొరుకుతుంది. అయితే, ఈ వాయిదాలను వాయిదా వేయడం వల్ల కొంత వడ్డీ అదనంగా చెల్లించాల్సి వస్తుందని మర్చిపోవద్దు.


అలాంటివి వద్దు..

క్రెడిట్‌ స్కోరుతో సంబంధం లేకుండా ఇప్పుడు రుణాలు తీసుకునే అవకాశాలూ ఎన్నో ఉన్నాయి. కానీ, అవన్నీ అధిక వడ్డీని వసూలు చేస్తాయి. మరీ అవసరం అయితే.. బంగారాన్ని లేదా ఏదైనా ఆస్తిని హామీగా చూపించి రుణం తీసుకోండి. దీనివల్ల మీకు తక్కువ వడ్డీకే డబ్బు లభిస్తుంది.

అత్యవసరాల కోసం ఆదాయంలో నుంచి కొంత మొత్తాన్ని ప్రతినెలా పక్కన పెట్టాలి. దీనివల్ల అవసరమైన ప్రతిసారీ అప్పు చేయాల్సిన అవసరం తప్పుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడిని సృష్టించే పెట్టుబడి పథకాల్లో మదుపు చేయాలి. కానీ, మనల్ని ఆర్థికంగా దివాలా తీయించే అప్పులకు వడ్డీలు చెల్లించకూడదు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. రుణ భారం లేకుండా ప్రశాంతంగా ఉండగలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని