బీమాతో.. ఆర్థిక స్వేచ్ఛ

అవకాశాలు అనంతంగా ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం.. అదే సమయంలో.. ఊహించని అనిశ్చితులూ ఎన్నో. కొవిడ్‌-19 మహమ్మారి దీన్ని మరింత నిజం చేసింది. అనుకోని పరిస్థితులు ఎదురైనా.. ఆర్థికంగా స్థిరంగా ఉండాల్సిన అవసరాన్ని ఇది తెలిపింది.

Updated : 26 Oct 2021 13:01 IST

అవకాశాలు అనంతంగా ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం.. అదే సమయంలో.. ఊహించని అనిశ్చితులూ ఎన్నో. కొవిడ్‌-19 మహమ్మారి దీన్ని మరింత నిజం చేసింది. అనుకోని పరిస్థితులు ఎదురైనా.. ఆర్థికంగా స్థిరంగా ఉండాల్సిన అవసరాన్ని ఇది తెలిపింది. ఈ స్థిరత్వమే మనకు ఆర్థిక స్వేచ్ఛను తీసుకొస్తుంది. ఈ రోజుల్లో ఇది ఎంతో ముఖ్యం. మరి, దీన్ని సాధించే క్రమంలో బీమా పాలసీలు ఎంత వరకూ తోడ్పడతాయనేది తెలుసుకోవాల్సిన విషయమే.

అనుకున్న లక్ష్యాల బాటలో పయనించకుండా.. మహమ్మారి ఎంతోమందిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. భవిష్యత్‌ అవసరాల కోసం ఎంత మొత్తం దాచుకున్నా.. ఒక్కసారి అదంతా తుడిచిపెట్టుకుపోయిన సందర్భాలు ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో చూశాం. రానున్న రోజుల్లో మళ్లీ ఇలాంటి మహమ్మారులు దాడి చేసినా.. ఎంతోకొంత ఆర్థిక భరోసా మనకు ఉండాల్సిందే. అందుకే, సంపాదన, పెట్టుబడులు.. పొదుపులాంటి వాటితోపాటు.. బీమా పాలసీలూ ఒక రకంగా మనకు ఆర్థిక రక్షణనిచ్చేవే.

చిన్న మొత్తంతోనే..
కరోనా తర్వాత ప్రధానంగా మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యపరమైనది. ఒక వ్యక్తికి ఈ వైరస్‌ సోకి, పరిస్థితి విషమిస్తే.. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అప్పటి వరకూ అతను దాచుకున్న అత్యవసర నిధి, పొదుపు, పెట్టుబడులన్నీ ఆ వైద్య బిల్లులు చెల్లించేందుకే ఖర్చు అయిపోయాయి. కొంతమంది అధిక వడ్డీకి వ్యక్తిగత రుణాలను సైతం తీసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఆర్థిక రక్షణ కల్పించాలంటే మంచి ఆరోగ్య బీమా పాలసీ ఉండాల్సిందే. ఆసుపత్రి బిల్లుల ఖర్చులతో పోలిస్తే తక్కువ మొత్తంతో లభించే ఆరోగ్య బీమా పాలసీలు ఆర్థిక స్వేచ్ఛలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చును ఆరోగ్య బీమా భరిస్తుంది. దీనివల్ల కుటుంబ అవసరాల కోసం దాచిన డబ్బును తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి, ఆర్థిక లక్ష్యాల సాధనలో ఇబ్బందులు ఎదురవ్వవు. దీంతోపాటు ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం-1961, సెక్షన్‌ 80డీ ప్రకారం మినహాయింపూ వర్తిస్తుంది.

వివరాలన్నీ చూశాకే..
ఆరోగ్య బీమా పాలసీ అందించే ప్రయోజనాలు ఏమిటన్న విషయంలో పూర్తి అవగాహన పెంచుకోవాలి. క్రిటికల్‌ ఇల్‌నెస్‌, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలు, వ్యక్తిగత ప్రమాద బీమా, పెద్దల కోసం ప్రత్యేక పాలసీలు.. వీటి గురించి తెలుసుకోవాలి. ఒక్కో పాలసీ పనితీరు భిన్నంగా ఉంటుంది. మన అవసరానికి అనుగుణంగా దాన్ని ఎంచుకోవాలి.
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఎంచుకున్నప్పుడు.. ఏదైనా తీవ్ర వ్యాధి సోకినప్పుడు ఏక మొత్తంగా పరిహారం లభిస్తుంది. దీనికి చికిత్స ఖర్చుతో సంబంధం ఉండదు. వ్యక్తిగత ప్రమాద బీమా.. ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు, వైకల్యం సంభవించినప్పుడు పరిహారాన్ని అందిస్తుంది.
సరైన మొత్తానికి బీమా పాలసీ తీసుకోవడం ఎప్పుడూ అవసరం. వ్యక్తులను బట్టి, బీమా అవసరాలూ మారుతుంటాయి. వృత్తి, జీవన విధానం, ఆర్థిక స్థితిగతులు, ఉండే ప్రాంతం.. ముఖ్యంగా వయసు.. బీమా మొత్తాన్ని నిర్ణయించడంలో ఇవే ప్రధానం. ఇప్పటికే వ్యాధులు ఉన్నప్పుడు బీమా పాలసీల ఎంపిక మారుతుంది. వైద్య ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా పాలసీ విలువ ఉండాలి. కంపెనీని ఎంపిక చేసుకునేటప్పుడు చెల్లింపుల చరిత్రను చూడాలి.

- విద్యా ప్రకాశ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని