Updated : 24 Dec 2021 08:26 IST

పరిహారానికి మించి.. చూడాలివన్నీ...

ఆరోగ్య బీమా అనగానే.. ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్య ఖర్చులు చెల్లిస్తుంది అనే భావనతోనే ఉంటాం. ఇది నిజమే అయినప్పటికీ.. ఇంతటితోనే ఇప్పుడు ఈ పాలసీ ఆగిపోవడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. ఇందులోనూ ఇప్పుడు ఎన్నో ఇతర అంశాలూ జోడిస్తున్నాయి బీమా సంస్థలు. పాలసీ తీసుకునేటప్పుడు వీటిని గమనించడమూ ఇప్పుడు అవసరం.

టెలీ హెల్త్‌ సేవలు: కరోనా తర్వాత టెలీ-హెల్త్‌ సేవలు, వర్చువల్‌ కన్సల్టేషన్లకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు బీమా సంస్థలు సొంతంగా కొంతమంది డాక్టర్లతోనే టెలీ మెడిసిన్‌ సేవలను అందించడం ప్రారంభించాయి. ఇంటి నుంచే ప్రాథమిక స్థాయిలో చికిత్స పొందేందుకు ఇది తోడ్పడుతుంది. సాధారణ అనారోగ్యానికి ఆసుపత్రికి వెళ్లి, సమయం వృథా చేసుకోకుండా ఇది తోడ్పడుతుంది. బీమా సంస్థలు.. దీనికోసం ఎలాంటి రుసుములూ వసూలు చేయడం లేదు. మీ బీమా పాలసీలో ఈ ఏర్పాటు ఉందా లేదా చూసుకోండి.

ఆరోగ్య పరీక్షలు: క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు.. ముందుగానే వ్యాధులను గుర్తించే వీలుంటుంది. బీమా సంస్థలు తమ పాలసీదారులకు ఈ విషయంలో కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ల్యాబ్‌లు, క్లినిక్‌లతో ఒప్పందం కుదుర్చుకొని, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి. పాలసీదారుడు పూర్తి ఆరోగ్యంగా ఉంటే.. ప్రీమియంలో రాయితీకీ సిద్ధం అవుతున్నాయి.

బరువు తగ్గేందుకు: అధిక బరువు ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. జీవన శైలితో బరువు తగ్గడం సాధ్యం కాని వారు.. కొన్ని ప్రత్యేక చికిత్సలతో శరీర బరువును తగ్గించుకుంటున్నారు. ఒకప్పుడు బీమా సంస్థలు ఈ చికిత్సలను పరిగణనలోనికి తీసుకునేవి కావు. ఇప్పుడు కొన్ని బీమా సంస్థలు ఈ చికిత్సల కోసం ప్రత్యేక పాలసీలను ప్రారంభిస్తున్నాయి. అయితే, దీనికి వేచి ఉండే సమయం కొంత ఉంటుంది.

రెండో అభిప్రాయం: అంబులెన్స్‌ సేవలు అందించే సంస్థలు, రక్తనిధి కేంద్రాలతోనూ ఇప్పుడు బీమా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గమనించండి. దీంతోపాటు.. అవసరమైనప్పుడు చికిత్స చేస్తున్న వైద్యుడు కాకుండా.. మరో వైద్యుడితో రెండో అభిప్రాయం తీసుకునే వీలూ కల్పించాలి.

ప్రముఖ వైద్యులతో: అనారోగ్యం వచ్చినప్పుడు ఆ చికిత్సలో అనుభవం ఉన్న వైద్యుడి వివరాలను బీమా సంస్థ అందిస్తోంది. ఏ వ్యాధి చికిత్సకు ఎవరిని సంప్రదించాలని సులభంగా తెలుసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు, పునరుద్ధరణ వేళ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సరైన పాలసీ మీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధీమాను అందిస్తుంది.

- ఆనంద్‌ రాయ్‌, ఎండీ,
స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలీడ్‌ ఇన్సూరెన్స్‌
Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని