Vehicle Insurance : బండికి బీమా ఇలా!

మన జీవితాల్లో ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా.. ధర, నిర్వహణ.. రెండూ తక్కువగా ఉండటమూ ఇందుకు కారణం. ఇంతటి ప్రాధాన్యమున్న బండికి బీమా చేయించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

ఏ రకం బండి..

ఫీచర్లు, తయారీ, మోడల్‌ను బట్టి బైక్‌ ధర మారుతుంటుంది. ద్విచక్ర వాహన ధరపైనే బీమా కవరేజీ ఉంటుంది. కాబట్టి బీమా ప్రీమియం నేరుగా వాహన ధరకే అనుసంధానంగా ఉంటుంది. రూ.లక్ష బైక్‌తో పోలిస్తే రూ.75,000 బైక్‌కు ప్రీమియం తక్కువగానే ఉంటుంది. అదే సమయంలో క్యూబిక్‌ సామర్థ్యం(సీసీ) ఆధారంగా ప్రీమియం మారుతుంటుంది. 350 సీసీ బైక్‌తో పోలిస్తే 75 సీసీ బైక్‌ ప్రీమియం తక్కువగానే ఉంటుంది. బీమా నియంత్రణాధికార సంస్థ సీసీని బట్టి శ్లాబ్‌ రేట్లను నిర్వచించింది. ఇపుడు విద్యుత్‌ వాహనాలూ వస్తున్నందున థర్డ్‌ పార్టీ ఎలక్ట్రిక్‌ 2వీలర్‌ ప్రీమియాన్ని కిలోవాట్‌ ఆధారంగానూ నిర్ణయిస్తున్నారు.

ఎంత కాలమైంది?

మీ బీమా కంపెనీ వాహనం కొని ఎన్నాళ్లయిందనీ అడగడం ఆన్‌లైన్‌లో మీరు వివరాలను నింపే సమయంలో మీరు గమనించే ఉంటారు. ప్రతీ చరాస్తిలాగే మీ ద్విచక్ర వాహన విలువా సమయంతో పాటు తగ్గుతూ వెళుతుంది. పాత బండికి తరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. 6 నెలల కంటే తక్కువ వయసు ఉంటే 5% ఉంటుంది. 5 ఏళ్ల కంటే ఎక్కువైతే 50 శాతం వరకు తరుగుదల ఉండొచ్చు.

ఎటువంటి కవరేజీ కావాలి?

ద్విచక్ర వాహన బీమాలో రెండు రకాల కవరేజీలుంటాయి. ఒకటేమో థర్డ్‌ పార్టీ (టీపీ) కవర్‌, రెండోది కాంప్రహెన్సివ్‌ (విస్తృత) కవర్‌. చట్టం ప్రకారం.. రోడ్డుపై నడిచే ప్రతి బండికీ టీపీ కవర్‌ ఉండాలి. ఇది మీ వాహనం వల్ల ఎవరైనా థర్డ్‌ పార్టీకి జరిగే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తుంది. అయితే టీవీ కవర్‌లో వాహనానికి రక్షణ ఉండదు. విస్తృత పాలసీలో భూకంపాలు, వరదలు, రోడ్డు జారిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కవరేజీ లభిస్తుంది. అంతేకాదు.. ప్రమాదాలు, దొంగతనాల వంటి మనుషుల వల్ల జరిగే నష్టాలకూ కవరేజీ ఉంటుంది. అయితే టీపీ కవర్‌ కంటే దీని ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ధర ఎక్కువైనా సరే కాంప్రహెన్సివ్‌ కవర్‌ తీసుకోవడమే మంచిది. జరగరాని నష్టంతో పోలిస్తే ప్రీమియం తక్కువే కదా.

ఐడీవీ ముఖ్యం..

బీమా ప్రకటిత విలువ (ఐడీవీ) అనేది చాలా కీలకం. మీ వాహనం పూర్తిగా దెబ్బతిన్నా.. దొంగతనానికి గురైనా బీమా కంపెనీ ఇచ్చే గరిష్ఠ విలువనే ఐడీవీ అంటారు. దీనిని ప్రతీ పునరుద్ధరణ సమయంలో లెక్కిస్తారు. బండి ధరలో తరుగుదలను తీసివేసి దీనిని గణిస్తారు.

నో క్లెయిమ్‌ బోనస్‌(ఎన్‌సీబీ)

మీరు క్లెయిము చేసుకోని ప్రతీ ఏడాది మీ బీమా కంపెనీ ఎన్‌సీబీ ఇస్తుంది. ముందుగా నిర్ణయించిన శ్లాబుల ప్రకారం.. డిస్కౌంటు లభిస్తుంది. ఇది 20 శాతం నుంచి గరిష్ఠంగా 50 శాతం వరకు ఉంటుంది. ఎన్‌సీబీ వల్ల మీ మోటార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గుతుంది.

అనుబంధంగా..

యాడ్‌ ఆన్‌ కవర్స్‌ మీ వాహనానికి మరింత రక్షణ కల్పిస్తాయి. మీ కవరేజీని మీరే డిజైన్‌ చేసుకోవచ్చు. ప్రతీ యాడ్‌ ఆన్‌ ఒక ప్రత్యేక అవసరాన్ని తీర్చేలా ఉంటుంది. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, జీరో డిప్రీషియేషన్‌, మెడికల్‌ కవర్‌, ఇంజిన్‌ రక్షణ వంటివి ఇందులో ఉంటాయి. మీ అవసరాలకు తగ్గట్లుగా యాడ్‌ ఆన్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే వాహన బీమా పునరుద్ధరణ సమయంలో లేదా కొత్త బీమా తీసుకునే సమయంలో ప్రీమియం లెక్కలు సులువుగా తెలుస్తాయి.
- గుర్దీప్‌ సింగ్‌ బాత్రా, హెడ్‌-రిటైల్‌ అండర్‌రైటింగ్‌,
బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని