Updated : 18 Mar 2022 09:07 IST

Insurance: ఆరోగ్య బీమా.. బోనస్‌ సంగతేమిటి?

వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రతి వ్యక్తీ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఒక తప్పనిసరి అవసరంగా మారింది. ఆర్థిక ప్రణాళికలో ఇది ముఖ్యమైన అంశం. ఈ ఆరోగ్య బీమా పాలసీని క్లెయిం చేసుకున్నప్పుడు వైద్య చికిత్స ఖర్చులు చెల్లించడంలాంటి ప్రయోజనాలు అందించడంతోపాటు.. క్లెయిం చేసుకోనప్పుడు క్యుములేటివ్‌ బోనస్‌లాంటి లాభాలూ ఉంటాయి.

పాలసీ ఏడాదిలో ఎలాంటి క్లెయిం చేసుకోనప్పుడు బీమా సంస్థలు తమ పాలసీదారులకు కొన్ని ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. ఇందులో క్యుములేటివ్‌ బోనస్‌ ఒకటి. వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలు రెండింటికీ ఇది వర్తిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీమా సంస్థ మీ పాలసీ విలువను పెంచడమే బోనస్‌ అన్నమాట. దీనికోసం ఎలాంటి ప్రీమియం అదనంగా చెల్లించక్కర్లేదు.

ఉదాహరణకు మీరు రూ.10లక్షల విలువైన పాలసీ తీసుకున్నారనుకుందాం..  క్లెయిం చేసుకోని ఏడాదికి మీ బీమా సంస్థ 5శాతం బోనస్‌ ఇస్తుందనుకుందాం. అప్పుడు మీ పాలసీ విలువ రూ.10,50,000 అవుతుంది. రెండో ఏడాదీ ఎలాంటి క్లెయిం లేకపోతే.. పాలసీ విలువ రూ.11లక్షలకు చేరుతుంది. పాలసీ విలువ పెరిగేందుకు ఒక స్థిరమైన శ్లాబు విధానం ఏదీ ఉండదు. పైగా ఇది బీమా సంస్థలను బట్టి, మారుతుంది. ప్రస్తుతం కొన్ని బీమా సంస్థలు అందించే ఆరోగ్య బీమా పాలసీల్లో 150-200 శాతం వరకూ బీమా పాలసీ విలువను బోనస్‌గా అందిస్తున్నాయి.

క్యుములేటివ్‌ బోనస్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాలసీ ఏడాదిలో ఒక క్లెయిం చేశారనుకోండి.. మొత్తం బోనస్‌ తగ్గించరు. బోనస్‌ను అందించిన నిష్పత్తిలోనే దానిని తగ్గిస్తారు. ఉదాహరణకు మీ బీమా సంస్థ క్లెయిం చేయని సంవత్సరానికి 10 శాతం బోనస్‌ ఇస్తుందనుకుందాం. వరుసగా అయిదేళ్ల పాటు మీరు ఎలాంటి క్లెయిం చేయలేదు. అప్పుడు మీ పాలసీ విలువ 50 శాతం పెరుగుతుంది. ఆరో ఏట క్లెయిం చేసినప్పుడు మీ పాలసీ మొత్తం విలువ 10 శాతం మేరకే తగ్గుతుంది. మీరు రూ.10లక్షల పాలసీ తీసుకున్నారనుకుంటే.. అయిదేళ్లపాటు క్లెయిం చేసుకోకపోతే అప్పుడు పాలసీ రూ.15,00,000 అవుతుంది. ఇప్పుడు క్లెయిం చేసుకున్నా.. బీమా సంస్థ 10 శాతం మొత్తాన్నే తగ్గిస్తుంది. అంటే, మీ పాలసీ విలువ రూ.14,00,000 అవుతుందన్నమాట.

అన్ని పాలసీలకూ వర్తించదు..

ఆరోగ్య బీమా పాలసీలన్నింటిలోనూ క్యుములేటివ్‌ బోనస్‌ ఉండకపోవచ్చు. అంతేకాకుండా.. బీమా సంస్థను బట్టి, ఈ బోనస్‌ రేటు మారుతూ ఉంటుంది. బోనస్‌కు సంబంధించిన నియమ నిబంధనలను తెలుసుకోండి. గరిష్ఠంగా ఎంత బోనస్‌ ఇస్తారనేది ముఖ్యం. కొన్ని బీమా సంస్థలు పాలసీ తొలినాళ్లలో అత్యధిక శాతంలో బోనస్‌ ఇస్తాయి. ఇది 50 శాతం వరకూ ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి దీన్ని తగ్గించి, 5-10 శాతానికి పరిమితం చేస్తాయి.

ప్రీమియానికి అదనపు భారం లేకుండా.. పాలసీని పెంచుకునేందుకు క్యుములేటివ్‌ బోనస్‌ ఒక మార్గం. ఈ బోనస్‌ మంచిదే అయినప్పటికీ దీనికీ కొన్ని పరిమితులు ఉంటాయన్నది మర్చిపోవద్దు. పూర్తిగా దీనిపైనే ఆధారపడటం మంచిది కాదు. వైద్య ద్రవ్యోల్బణం ఏటా 12-15 శాతం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న పెద్ద మొత్తం ఆరోగ్య బీమా పాలసీ సైతం కొన్నాళ్లకు సరిపోకపోవచ్చు. క్లెయిం చేసుకోకపోతేనే బోనస్‌ వస్తుంది. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు రావడం సహజం. ఎప్పటికప్పుడు మన అవసరాలు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ప్రాథమిక పాలసీ మొత్తాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడు బోనస్‌తో పాలసీ మరింత బలోపేతం అవుతుంది.

- ఆదిత్య శర్మ, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని