ఎఫ్‌డీ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. డిపాజిట్ క్లెయిమ్ చేయ‌డం ఎలా? 

ఖాతాదారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు, వారికి సంబంధించిన క్లెయిమ్‌ల‌ను సుల‌భంగా ప‌రిష్క‌రించేందుకు నామినేష‌న్ సౌక‌ర్యం ఉప‌యోగ‌ప‌డుతుంది

Updated : 12 May 2021 12:24 IST

సాధారణంగా చాలా మంది తాము క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటారు ముఖ్యంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారు, ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నవారు ఈ మార్గాన్ని ఎన్నుకుంటారు. కారణం ఇందులో రిస్క్ చాలా త‌క్కువ‌. దాదాపు ఉండ‌ద‌నే చెప్పాలి. అంతేకాకుండా ఎంత కాలానికి డిపాజిట్ చేస్తే.. ఎంత రాబ‌డి ఉంటుంద‌నేది ముందుగానే అంచ‌నా వేసుకునే అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల ఈ పెట్టుబ‌డుల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. 

అయితే అనుకోకుండా ఎఫ్‌డీ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, నామినిగా నియ‌మించిన వ్య‌క్తి లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసేందుకు కొన్ని ముఖ్య‌మైన అంశాల‌ను తెలుసుకోవాలి. 

సాధార‌ణంగా ఎఫ్‌డీ డిపాజిట్ల‌లో కొన్ని క్లాజులు ఉంటాయి. ఖాతాను తెరిచేప్పుడు డిపాజిట‌ర్ వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక వ్య‌క్తి ఎఫ్‌డీ చేస్తే, అందులో నామిని పేరు తెలిపారా.. లేదా.. అని బ్యాంకులు త‌నిఖీ చేస్తాయి. ఒక‌వేళ డిపాజిట్‌దారుడు నామినీని ఏర్పాటు చేసివుంటే.. అత‌ను/ఆమె గుర్తింపును ధృవీక‌రించి డిపాజిట్ మొత్తాన్ని వారికి అంద‌జేస్తాయి. నామినీ ఏర్పాటు చేయ‌క‌పోతే.. చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు కావ‌ల‌సిన అన్ని ప‌త్రాల‌ను బ్యాంకుకు అందించి డిపాజిట్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవ‌చ్చు. 

ఖాతాదారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు, వారికి సంబంధించిన క్లెయిమ్‌ల‌ను సుల‌భంగా ప‌రిష్క‌రించేందుకు.. నామినేష‌న్ సౌక‌ర్యం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది చ‌నిపోయిన వారి ఆస్తుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుల‌కు ఉన్న హ‌క్కుల‌ను హ‌రించ‌దు. నామినీగా పేర్కొన్న వ్య‌క్తి చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుల‌కు ధర్మకర్తగా వ్యవహరించాలి.

ఎఫ్‌డీ ఉమ్మడి ఖాతాల విష‌యంలో వివిధ క్లాజులు అందుబాటులో ఉన్నాయి. వివిధ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌మ‌కు కావ‌ల‌సిన వ‌ర్గాన్ని డిపాజిట్ స‌మ‌యంలోనే ఎంచుకోవాల్సి ఉంటుంది -  ఎఫ్‌డీ డిపాజిట్ల‌లో ఉండే క్లాసులు వాటి వివ‌రాలను ఇప్పుడు తెల‌సుకుందాం. 

ఐద‌ర్ ఆర్ స‌ర్వైవ‌ర్‌ (Either or Survivor)..
* ఈ క్లాస్ ప్ర‌కారం మీరు, మీ జీవిత భాగ‌స్వామికి ఉమ్మ‌డి ఖాతాదారులైతే, ఒక‌రి మ‌ర‌ణించిన‌ప్పుడు జీవించి ఉన్న వ్య‌క్తికి ఫైన‌ల్ బ్యాలెన్స్ చెల్లిస్తారు. 
* ఈ సందర్భంలో నామినీ ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ, జీవించి ఉన్న వ్య‌క్తికి మాత్ర‌మే డిపాజిట్ మొత్తాన్ని అంద‌జేస్తారు. ఇరువురు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో మాత్ర‌మే నామినికి అనుమ‌తి ఉంటుంది. 
* ఒక‌వేళ నామినీ లేక‌పోతే, భార్య భ‌ర్త‌లు ఇరువురిలో జీవించి ఉన్న‌వారు నిధుల‌ను పొంద‌వ‌చ్చు. ఒక‌వేళ ఉభ‌యులు మ‌ర‌ణిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు తీసుకోవ‌చ్చు. 

ఎనీవ‌న్ ఆర్ స‌ర్వైవ‌ర్‌ (Anyone or Survivor).. 
* ఒక‌రి కంటే ఎక్కువ జాయింటు ఖాతాదారులుంటే.. ఒక‌రు లేదా అంత‌కంటే ఎక్కువ మంది మ‌ర‌ణించిన జీవించి ఉన్న ఖాతాదారుల‌కు ఫైన‌ల్ బ్యాలెన్స్‌ను వ‌డ్డీతో స‌హా బ్యాంకు చెల్లిస్తుంది. 
* డిపాజిట్‌దారులంద‌రూ మ‌ర‌ణిస్తే, నామినీ ఫండ్స్ తీసుకోవ‌చ్చు. ఒక‌వేళ మ‌ర‌ణించిన డిపాజిట్ దారులు(ఒక‌రు లేదా అంత‌కంటే ఎక్కువ‌) త‌ర‌పున నామినీ లేక‌పోతే, జీవించి ఉన్న డిపాజిట్‌దారునితో పాటు మ‌ర‌ణించిన వారి చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌స‌లు కూడా డిపాజిట్ మొత్తాన్ని పొందుతారు. 
* ఒక‌వేళ డిపాజిట్ దారులంద‌రూ మ‌ర‌ణిస్తే, అంద‌రి చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు డిపాజిట్ మొత్తాన్ని తీసుకోవ‌చ్చు. 

ఫార్మ‌ర్ ఆర్ స‌ర్వైవ‌ర్ (Former or Survivor).. 
* ఈ క్లాస్ ప్ర‌కారం ఫార్మ‌ర్ ఖాతా దారునికి మొద‌టి అధికారం ఉంటుంది. ఫార్మ‌ర్ ఖాతాదారుడు జీవించి ఉన్నంత కాలం డ‌బ్బు విత్‌డ్రా చేసుకునేందుకు అత‌ను/ఆమెకు మాత్ర‌మే అధికారం ఉంటుంది. ఒక‌వేళ ఫార్మ‌ర్ ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే, అప్పుడు రెండ‌వ ఖాతాదారుడు డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

* ఫార్మ‌ర్ ఖాతాదారుడు మ‌ర‌ణం త‌రువాత రెండ‌వ ఖాతాదారుడు నిధుల‌ను విత్‌డ్రా చేసుకునేందుకు కొన్ని ప్రాథ‌మిక నిబంధ‌న‌ల‌ను పాటించాలి. ఫార్మ‌ర్ ఖాతాదారుడు మ‌ర‌ణించిన‌ట్లు ఆధారాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 

* డిపాజిట్ దార్లు ఇద్ద‌రు మ‌ర‌ణిస్తే నామినికి హ‌క్కు ల‌భిస్తుంది. నామినీ లేక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు అవ‌స‌ర‌మైన ఫార్మాలిటీల‌ను పూర్తి చేసి డిపాజిట్ మొత్తాన్ని తీసుకోవ‌చ్చు. 

లేట‌ర్ ఆర్ స‌ర్వైవ‌ర్‌ (Latter or Survivor).. 
* ఇది ఫార్మ‌ర్ లేదా స‌ర్వైవ‌ర్  క్లాస్ మాదిరిగానే ప‌నిచేస్తుంది. రెండింటికి ఉన్న వ్య‌త్యాసం.. ఇక్క‌డ రెండో డిపాజిట్ దారుడు జీవించి ఉన్నంత వ‌ర‌కు ఖాతాను నిర్వ‌హ‌ణ‌, విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. అత‌ను/ఆమె మ‌ర‌ణానంత‌రం జీవించి ఉన్న వారికి ఖాతా నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ల‌భిస్తుంది. 
* ఒకవేళ ఇద్ద‌రు మ‌ర‌ణిస్తే, నామినికి, నామినీ ఏర్పాటు చేయ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు కావ‌ల‌సిన ప‌త్రాల‌ను అందించి డిపాజిట్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని