20 ఏళ్లలో రూ.కోటి వచ్చేలా..

ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30వేల వరకూ వస్తున్నాయి. వయసు 23. ఇందులో నుంచి నెలకు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. టర్మ్‌ పాలసీ ఇప్పుడే తీసుకోవాలా? మరో రెండేళ్ల తర్వాత తీసుకున్నా ఇబ్బంది ఉండదా? ఏం చేయాలి?

Updated : 04 Mar 2022 09:50 IST

* ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30వేల వరకూ వస్తున్నాయి. వయసు 23. ఇందులో నుంచి నెలకు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. టర్మ్‌ పాలసీ ఇప్పుడే తీసుకోవాలా? మరో రెండేళ్ల తర్వాత తీసుకున్నా ఇబ్బంది ఉండదా? ఏం చేయాలి?

- అవినాశ్‌

* మీరు నెలకు మదుపు చేయాలనుకుంటున్న రూ.15వేలలో రూ.5వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా రూ.10వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయండి. ఇలా మీరు కనీసం 20 ఏళ్లపాటు కొనసాగిస్తే.. సగటున 11 శాతం వార్షిక రాబడితో రూ.1,15,56,500 అయ్యేందుకు అవకాశం ఉంది. మీపైన ఆధారపడిన వారు ఉంటే టర్మ్‌ పాలసీ తీసుకోండి. వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల విలువైన పాలసీ ఉండటం మంచిది. చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వేచి చూడటం కన్నా ఇప్పుడే పాలసీ తీసుకోండి.


* మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం నెలనెలా రూ.10 వేల వరకూ బంగారంలో మదుపు చేయాలని అనుకుంటున్నాం. ఇందుకోసం గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మంచివా, లేక గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేయాలా? వీటికన్నా అధిక రాబడి వచ్చే పథకాలేమైనా ఉన్నాయా? కనీసం 12 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగించగలను.

- మాధురి

* బంగారంలో మదుపు చేసేందుకు గోల్డ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేసేందుకు డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. దీర్ఘకాలంలో బంగారంతో పోలిస్తే ఈక్విటీ ఆధారిత పథకాలే మంచి రాబడినిచ్చాయి. కాబట్టి, పసిడికి ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు. మీరు నెలకు రూ.10వేలు 12 ఏళ్లపాటు మదుపు చేస్తే.. కనీసం  10 శాతం వార్షిక రాబడితో.. రూ.25,66,000 జమ అయ్యే అవకాశం ఉంది.


* నా గృహరుణం మరో మూడు నెలల్లో తీరిపోతోంది. దీనిపై టాపప్‌ రుణం తీసుకునే వీలుంది. ఇలా కొత్తగా తక్కువ వడ్డీకి రుణం తీసుకొని, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు ఆర్జించేందుకు వీలవుతుందా?

- రాజు

* పెట్టుబడుల కోసం మన దగ్గర ఉన్న డబ్బునే వినియోగించాలి. అప్పు చేసి మదుపు చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. పెట్టుబడుల ద్వారా రుణానికి చెల్లించే వడ్డీకి మించి రాబడి రావచ్చు. రాకపోవచ్చు. దీనికి బదులుగా మీరు రుణానికి చెల్లించాలనుకుంటున్న ఈఎంఐనే ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడికి కేటాయించండి. కనీసం 7-8 ఏళ్లపాటు మదుపు కొనసాగించాలి.


* ఆదాయపు పన్ను ఆదా కోసం యూనిట్‌ ఆధారిత బీమా పాలసీని తీసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం ఏటా రూ.50,000 వరకూ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పన్ను ఆదాకు ఇతర పథకాలను ఎంచుకోవచ్చా? కొన్నాళ్ల తర్వాత అవసరమైతే డబ్బు వెనక్కి తీసుకునేలా ఉండాలి.

- మురళి

* జీవిత బీమా పాలసీ కావాలనుకుంటే.. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ లభిస్తుంది. ప్రీమియంపైన పన్ను మినహాయింపూ ఉంటుంది. ఇక పన్ను భారాన్ని తగ్గించుకునేదుకు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించండి. ఇతర పన్ను ఆదా పథకాలతో పోలిస్తే వీటికి తక్కువ లాకిన్‌ వ్యవధి ఉంటుంది. మూడేళ్ల తర్వాత మీ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. కాస్త నష్టభయం ఉంటుందని గుర్తుంచుకోండి.


* నా వయసు 67. రెండేళ్ల క్రితం వరకూ ఆరోగ్య బీమా పాలసీ ఉండేది. దీన్ని పునరుద్ధరించుకోలేదు. ఇప్పుడు పాలసీ కావాలంటే పాత పాలసీ ఆధారంగా ఇస్తారా? లేకపోతే కొత్త పాలసీగానే పరిగణిస్తారా? కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. ఇలాంటి వారికి ప్రత్యేక పాలసీలేమైనా ఉన్నాయా? 

- శ్రీనివాస రావు

* ఆరోగ్య బీమా పాలసీని క్రమం తప్పకుండా పునరుద్ధరించుకోవాలి. వ్యవధి తీరిన తర్వాత పాత పాలసీ రద్దవుతుంది. కాబట్టి, ఇప్పుడు కొత్తగా పాలసీని తీసుకోవాల్సిందే. కొత్తగా పాలసీ తీసుకున్నప్పుడు ముందుగా ఉన్న వ్యాధులకు వేచి ఉండే సమయం ఉంటుంది. మీ పాలసీ దరఖాస్తులో మీ ఆరోగ్య వివరాలు పూర్తిగా తెలపండి. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, వచ్చిన నివేదికలను బట్టి, బీమా సంస్థ తన విచక్షణ మేరకు పాలసీ ఇస్తుంది. సీనియర్‌ సిటిజన్ల కోసం కొన్ని బీమా సంస్థలు ప్రత్యేక పాలసీలు అందిస్తున్నాయి. వీటిలో వేచి ఉండే వ్యవధి కాస్త తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని పరిశీలించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని